great success
-
Ind Vs Pak: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
చెన్నై: గత ఏడేళ్లుగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు చేతిలో ఓటమి ఎరుగని భారత హాకీ జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (15వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జుగ్రాజ్ (36వ ని.లో), ఆకాశ్‌దీప్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు రాగా ఇందులో మూడింటిని గోల్స్‌గా మలి చింది. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ 2–1తో చైనాపై, మలేసియా 1–0తో కొరియాపై నెగ్గాయి. పాక్‌పై విజయంతో ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక భారత్ 13 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 12 పాయింట్లతో మలేసియా రెండో స్థానంలో, 5 పాయింట్లతో దక్షిణ కొరియా, జపాన్, పాకిస్తాన్ సంయుక్తంగా మూడో స్థానంలో, ఒక పాయింట్‌తో చైనా చివరి స్థానంలో నిలిచాయి. కొరియా, జపాన్, పాక్ ఐదు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరంతో కొరియా, జపాన్ జట్లకు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. దాంతో మాజీ చాంపియన్ పాకిస్తాన్ సెమీఫైనల్ చేరలేకపోయింది. శుక్రవారం 5–6 స్థానాల కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో చైనాతో పాకిస్తాన్...సెమీఫైనల్స్ లో కొరియాతో మలేసియా; జపాన్‌తో భారత్ ఆడతాయి. -
హసీనా నాలుగోసారి
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ 11వ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా(71) నేతృత్వంలోని మహాకూటమి ఘనవిజయం సాధించింది. ఆదివారం ముగిసిన ఎన్నికల్లో మొత్తం 300 స్థానాలకు గానూ హసీనాకు చెందిన అవామీలీగ్, దాని మిత్రపక్షాలు 288 చోట్ల విజయదుందుభి మోగించాయి. తాజా ఫలితాల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా మూడోసారి, మొత్తంగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టేందుకు హసీనాకు మార్గం సుగమమైంది. కాగా, ఈ ఎన్నికల్లో విపక్ష కూటమి జాతీయ ఐక్య ఫ్రంట్(ఎన్‌యూఎఫ్) కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో అధికార కూటమి 82 శాతం దక్కించుకోగా, విపక్షాలకు 15 శాతం ఓట్లు లభించాయి. 2008లో జరిగిన ఎన్నికల్లో 263 సీట్లు సాధించి రికార్డు సృష్టించిన హసీనా ఈసారి ఏకంగా 288 స్థానాలు కొల్లగొట్టి ఆ రికార్డును తిరగరాశారు. ఫలితాలను అంగీకరించబోం: విపక్షాలు బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని విపక్షాల కూటమి జాతీయ ఐక్య ఫ్రంట్(ఎన్‌యూఎఫ్) ఆరోపించింది. ఈ ఫలితాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ ఎన్నికలను రద్దుచేసి పారదర్శకంగా, తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) డిమాండ్ చేసింది. మళ్లీ ఎన్నికల ప్రసక్తే లేదు: ఈసీ బంగ్లాదేశ్‌లో పోలింగ్ సందర్భంగా భారీగా అవకతవకలు, రిగ్గింగ్ చోటుచేసుకున్నాయన్న విపక్షాల ఆరోపణలను ఎన్నికల సంఘం చీఫ్(సీఈసీ) కె.ఎం.నూరల్ హుడా ఖండించారు. పోలింగ్‌కు ముందురోజు రాత్రే చాలాచోట్ల బ్యాలెట్ బాక్సులు నిండిపోయాయన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో నైరుతి గోపాల్‌గంజ్ నుంచి పోటీచేసిన ప్రధాని హసీనాకు 2,29,539 ఓట్లు రాగా, ఆమెపై పోటీచేసిన ఎన్‌యూఎఫ్ అభ్యర్థికి కేవలం 123 ఓట్లు వచ్చాయని తెలిపారు. హసీనాకు మోదీ ఫోన్.. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన షేక్ హసీనాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హసీనాకు సోమవారం ఫోన్‌చేసిన మోదీ.. బంగ్లాదేశ్ అభివృద్ధికి భారత్ మద్దతు కొనసాగుతుందని వెల్లడించారు. హసీనా నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ అభివృద్ధి విషయంలో భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. ఏక పార్టీ దిశగా అడుగులు సైనిక కుట్రలో చనిపోకముందు హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజీబుర్ దేశంలో ప్రతిపక్షాలను దెబ్బతీసి ఏకపార్టీ వ్యవస్థను నెలకొల్పేందుకు యత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ముజీబుర్ తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జియావుర్ రెహమాన్, ఎర్షాద్లు సైన్యానికి చెందిన వ్యక్తులు. వీరూ తమ హయాంలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకోకుండా ప్రయత్నించారు. సైనిక పాలన ముగిశాక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బీఎన్పీ చీఫ్ ఖలీదా వైఖరీ ఇదే. మూడుసార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేసిన ఖలీదా ప్రతీసారి అవామీ లీగ్‌ను అణిచేందుకు యత్నించారు. హసీనా సైతం ప్రజాస్వామ్యం ఉనికిని చెరిపేసేలా వ్యవహరించడం గమనార్హం. ఖలీదాను అవినీతి ఆరోపణలపై జైలు శిక్షపడేలా హసీనా చేశారు. మొదటి నుంచి పెత్తందారీ ధోరణులే! 1996లో మొదటిసారి ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచీ ప్రతిపక్షాలను, పోటీదారులను హసీనా సహించిన దాఖలాలు లేవు. తన ప్రత్యర్థి ఖలీదా బాటలోనే పయనిస్తూ బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం కావడానికి ఆమె కారకులయ్యారు. బీఎన్పీ మిత్రపక్షమైన ముస్లిం ఛాందసవాద సంస్థ జమాతే ఇస్లామీని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించారు. 1971 యుద్ధ నేరాలపై ఈ సంస్థ నేతలపై విచారణ జరిపించి శిక్షలు అమలు చేశారు. కొందరిని ఉరితీసి, మరి కొందరిని జైళ్లకు పంపారు. జమాతే సంస్థను ఖలీదా వాడుకున్నట్టే మరో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హిఫాజుతుల్ ఇస్లాంను హసీనా తనకు అనుగుణం గా వినియోగించుకుంటున్నారు. అవామీలీగ్‌కు ప్రతిపక్షమే లేకుండా చేయడమే లక్ష్యంగా ఆమె అధికారం ప్రయోగిస్తున్నారు. ఇంటర్నెట్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే రచయితలను చంపిన వారిని పట్టుకునే విషయంలో హసీనా ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. అయితే నిరుపేద దేశంగా, బలహీన ఆర్థిక వ్యవస్థగా పేరొందిన బంగ్లాదేశ్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టించడం హసీనా విజయంగా చెప్పొచ్చు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, ఆతర్వాత రాజకీయా పరిస్థితుల నేపథ్యంలో హసీనా భారత్‌తో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. హసీనా చేపట్టిన అభివృద్ధి పనులకు బంగ్లా ప్రజలు పట్టం కట్టారని మోదీ ప్రశంసించారు. విద్యార్థి దశ నుంచే... బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ప్రధాని హసీనా తీసుకున్న చర్యలే కారణమని ఆమె సన్నిహితులు చెబుతుంటే, ప్రతిపక్షాలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారని వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. హసీనా.. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు ముజీబుర్ రెహమాన్ కుమార్తె. తూర్పుపాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లోని తుంగిపరాలో 1947, సెప్టెంబర్ 28న జన్మించారు. ఢాకాలోని ఈడెన్ కాలేజీలో విద్యార్థి రాజకీయాల్లో హసీనా చురుగ్గా పాల్గొనేవారు. 1975, ఆగస్టు 15న ఆమె తండ్రి రెహమాన్, మిగిలిన కుటుంబ సభ్యులను ఆర్మీలోని ఓ వర్గం దాడిచేసి చంపేసింది. విదేశాల్లో ఉండటంతో హసీనా ప్రాణాలతో బతికిపోయారు. తర్వాత ఐదేళ్ల పాటు భారత్‌లోనే ప్రవాస జీవితం గడిపారు. 1981లో ఆమె అవామీలీగ్ పార్టీ అధ్యక్షురాలయ్యారు. బంగ్లాదేశ్‌లో సైనిక పాలనను పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించడంతో హసీనాకు మద్దతుదారులు క్రమంగా పెరిగారు. ఇదే సమయంలో ఆమెను సైన్యం గృహనిర్బంధంలో ఉంచింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్ జియా ఖలీదాతో కలిసి హసీనా ప్రజాస్వామ్య పోరాటాన్ని తీవ్రతరం చేయడంతో చివరికి 1990, డిసెంబర్లో అధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ హుస్సేన్ మొహమ్మద్ ఎర్షాద్ రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్‌లో సైనిక పాలనకు తెరపడింది. అయితే కాలక్రమంలో హసీనా, ఖలీదా రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. అణు శాస్త్రవేత్త అయిన ఎం.ఎ.వాజెద్‌ను హసీనా 1968లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జోయ్, కుమార్తె సైమా ఉన్నారు. 2009లో హసీనా భర్త కన్నుమూశారు. హసీనా హయాంలోనే బంగ్లాదేశ్ పౌరుల తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. 2017లో దేశ జీడీపీ 250 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
కశ్మీర్ స్థానిక ఎన్నికల్లో కమల వికాసం
శ్రీనగర్: కశ్మీర్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జమ్మూ ప్రాంతంలో ఉన్న 446 వార్డుల్లో 169 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 96 చోట్ల గెలవగా, స్వతంత్ర అభ్యర్థులు 167 సీట్లతో రెండోస్థానంలో నిలిచారు. కశ్మీర్ లోయలోని 42 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 178 వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించగా, కాంగ్రెస్ 157 స్థానాల్లో గెలిచింది. ఆశ్చర్యకరంగా, బీజేపీ అభ్యర్థులు కశ్మీర్ లోయలో 100 వార్డుల్లో గెలిచారు. కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ చట్టబద్ధతపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పడంతో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) ఈ ఎన్నికల్ని బహిష్కరించాయి. దీంతో జమ్మూలో 36 మున్సిపాలిటీల్లో బీజేపీ 15 చోట్ల, స్వతంత్రులు 12 చోట్ల, కాంగ్రెస్ ఐదు చోట్ల మెజారిటీ స్థానాలను దక్కించుకున్నాయి. -
2019లో భారీ మెజార్టీతో..!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేకులంతా ఏకమై ప్రారంభించనున్న మహాకూటమి ఓ మిథ్య అని ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో రెండ్రోజులపాటు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభోత్సవంలో షా మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మేకిన్ ఇండియా నినాదంతో ముందుకెళ్తుంటే బ్రేకింగ్ ఇండియా లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. 2014లో పార్టీ, కూటమి సాధించిన సీట్లకంటే ఈ సారి మరిన్ని ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమగ్ర అభివృద్ధి, పేదల సంక్షేమం, జాతీయవాదం అంశాలపై బీజేపీ ఎన్నికల ప్రచారం ఉండాలని కార్యవర్గ సభ్యులకు మోదీ సూచించారు. ‘వరుస ఎన్నికల్లో ఓటమితో ఆత్మరక్షణలో ఉన్న విపక్షాలు అర్బన్ నక్సల్స్‌కు మద్దతివ్వడంతోపాటు భారత్‌ను ముక్కలు ముక్కలు (బ్రేకింగ్ ఇండియా) చేద్దామని ప్రయత్నిస్తున్నారు’ అని షా అన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల పార్టీ ముఖ్య పదాధికారులు (మొత్తం 175 మంది) హాజరయ్యారు. ఆదివారం జరిగే ముగింపు సమావేశంలో మోదీ ప్రసంగిచనున్నారు. రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ప్రతిపాదించి ఆమోద ముద్ర వేయనున్నారు. బెంగాల్, ఒడిశా, తెలంగాణలపై.. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణల్లో అక్కడి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలపై ఉన్న ప్రజావ్యతిరేకత కారణంగా ఎక్కువసీట్లు గెలుస్తామని షా చెప్పారు. 2014లో మొత్తం 543 సీట్లలో బీజేపీ 283 సీట్లు గెలిచింది. ‘బీజేపీ 2014లో ఇప్పుడు ఏకమవుతున్న అన్ని పార్టీలను చిత్తుగా ఓడించింది. ఇప్పుడు వాళ్లందరూ ఏకమైనా ఫలితాల్లో పెద్ద తేడా ఉండదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మోదీ చరిష్మా, పార్టీ సంస్థాగత బలం కారణంగా మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని షా అన్నారు. ‘కాంగ్రెస్ చెప్పిందే మన్మోహన్ సింగ్ పాటిస్తారు. ఇక్కడ మోదీ ముందుండి నడిపిస్తారు’ అని అన్నారు. పాక్‌పై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సెప్టెంబర్ 28ని శౌర్యదివస్‌గా జరపాలని, గాంధీజీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. వాజ్‌పేయిని గుర్తుచేసుకుంటూ.. మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయిని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం స్మరించుకుంది. ఆరోగ్యం సహకరించినదాకా ప్రతీ జాతీయ కార్యవర్గ సమావేశానికి అటల్జీ హాజరైన విషయాన్ని స్మరించుకుంది. ‘దేశ ప్రజల ఆకాంక్షలన నెరవేర్చడంలో విశ్వసనీయమైన నేతగా అటల్జీ తనకంటూ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు. ఆయన చిత్తశుద్ధి, కఠోర శ్రమకారణంగానే ఇది సాధ్యమైంది. సిద్ధాంతాలకు కట్టుబడి ధ్రుఢనిశ్చయంతో ముందుకెళ్లడం ద్వారానే అనుకున్న లక్ష్యాలను ఆయన సాధించగలిగారు’ అని వాజ్‌పేయి సంతాప తీర్మానంలో పేర్కొంది. రైతుల ఆదాయం రెట్టింపుచేసేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలుపుతూ వ్యవసాయ తీర్మానాన్ని ఆమోదించింది. ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లలో ఓకే ఈ సమావేశాల్లో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎలక్షన్లపై చర్చ జరిగింది. ఇప్పటివరకు జరిగిన వివిధ సర్వేలు, పార్టీ అంతర్గత వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది. రాజస్తాన్‌లో ప్రజావ్యతిరేకత ఉందని పార్టీ ఈ సమస్యను దాటుకుని ముందుకెళ్లటం చాలా కష్టమని పార్టీ నివేదికలు చెబుతున్నాయి. రాజస్తాన్ సీఎం, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, కీలక మంత్రులు, ఇతర పార్టీ ముఖ్యులతో షా ఆదివారం షా భేటీ కానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మోదీ, అమిత్ నేతృత్వంలోనూ ముందుకెళ్లాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. దీనికితోడు 2019 జనవరిలో పూర్తికానున్న అమిత్ షా అధ్యక్ష పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. అసెంబ్లీ, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికలను వాయిదా వేయాలని తీర్మానించారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేద్దామనుకునేవారు కచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీచేసి తమ సత్తా చాటాలని ఆయన తెలంగాణ ముఖ్యనేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థుల జాబితాను విడతలవారీగా విడుదల చేయాలని పార్టీ నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే రోజే 35 మందితో తొలి జాబితాను ప్రకటించనున్నారు. ఆ తర్వాత 2 దశల్లో మిగిలిన 84 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. వ్యూహాలపై జాతీయ కార్యవర్గ భేటీ అనంతరం తెలంగాణ నేతలతో వేరుగా ఆయన భేటీ కానున్నారు. -
వెనిజువెలా ఎన్నికల్లో మదురో ఘనవిజయం
కారకస్: వెనిజువెలాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్ట్ నేత నికోలస్ మదురో(55) ఘనవిజయం సాధించారు. జాతీయ ఎన్నికల కౌన్సిల్ ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజువెలాకు చెందిన మదురో 68 శాతం ఓట్లను దక్కించుకున్నారు. దాదాపు 46.1 శాతం పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో మదురోకు 58 లక్షల ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్కు 18 లక్షల ఓట్లు పోలయ్యాయి. తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు మదురో వెనిజువెలాకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం అధ్యక్ష భవనం వద్ద గుమిగూడిన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇది చరిత్రాత్మక విజయం. ఈ ఎన్నికల్లో వెనిజువెలా గెలిచింది. శాంతి గెలిచింది. ప్రజాస్వామ్యం గెలిచింది. వెనిజువెలాలో అతిపెద్ద, శక్తిమంతమైన రాజకీయ శక్తిగా మనం చాలాకాలం ఉంటాం. వాళ్లు నన్ను చాలా తక్కువగా అంచనా వేశారు. నేను నియంతనని ప్రతిపక్షాల చేసే విమర్శలు నన్ను బాధపెట్టవు. వెనిజువెలా ఆర్థికవ్యవస్థను అమెరికా, కొలంబియా దేశాల మద్దతు ఉన్న మాఫియాలు తీవ్రంగా దెబ్బతీశాయి. రాబోయే రెండేళ్లలో ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టిసారిస్తాం’ అని పేర్కొన్నారు. వెనిజువెలాతో అనుసరిస్తున్న యుద్ధవైఖరిని అమెరికా పునఃసమీక్షించాలని మదురో విజ్ఞప్తి చేశారు. 2013, మార్చి 5న అప్పటి దేశాధ్యక్షుడు హ్యుగో చావెజ్ మరణంతో మదురో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఈ ఎన్నికల్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు మరోసారి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. మదురో ప్రభుత్వం ఎన్నికలకు ముందు, పోలింగ్ సందర్భంగా తీవ్రమైన అవకతవకలకు, ఉల్లంఘనలకు పాల్పడిందని రెండో స్థానంలో నిలిచిన హెన్రీ ఫాల్కన్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌కేంద్రాల సమీపంలో ‘రెడ్ టెంట్ల’ను ఏర్పాటుచేశారనీ, సంక్షేమ పథకాలకు అవసరమైన ‘ఫాదర్ల్యాండ్ కార్డు’లను మదురో మద్దతుదారులు అక్కడ స్కాన్ చేశారని వెల్లడించారు. కాగా, మదురో విజయంపై మయామీ, మ్యాడ్రిడ్‌లో వలసదారులు నిరసన తెలిపారు. వెనిజువెలాలో ఎన్నికలు జరిగిన తీరు సిగ్గుచేటనీ, ఈ ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)తో పాటు 17 పొరుగుదేశాలు తేల్చిచెప్పాయి. తాజాగా మదురో విజయం నేపథ్యంలో వెనిజువెలా జీడీపీలో 25 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న చమురురంగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని ఆంక్షలు విధించే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
అయ్యర్ అద్భుతం
జట్టును ముందుండి నడిపించడం అంటే ఏమిటో శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లోనే చూపించాడు. కెప్టెన్‌గా తనపై ఎలాంటి ఒత్తిడి లేదని నిరూపిస్తూ బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించి ఢిల్లీ రాత మార్చాడు. 10 సిక్సర్లతో విరుచుకుపడి డేర్‌డెవిల్స్‌కు కీలక విజయాన్ని అందించాడు. కెప్టెన్సీతో పాటు తుది జట్టుకూ దూరమైన సీనియర్ గంభీర్ డగౌట్ నుంచి చూస్తుండగా, యువ అయ్యర్‌తో పాటు మరో సంచలనం పృథ్వీ షా దూకుడైన బ్యాటింగ్ కోట్లాలో అభిమానులకు ఆనందం పంచితే... భారీ స్కోరును ఛేదించలేక కోల్‌కతా చతికిల పడింది న్యూఢిల్లీ: కెప్టెన్సీ మార్పు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు అదృష్టం తెచ్చిపెట్టినట్లుంది. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ జట్టుకు ఎట్టకేలకు ఊరట లభించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 55 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 10 సిక్సర్లు) భీకర బ్యాటింగ్, పృథ్వీ షా (44 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌కు మున్రో (18 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు కూడా తోడయ్యాయి. ఆ తర్వాత కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. రసెల్ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరి 4 ఓవర్లలో 76... పృథ్వీ షా, మున్రో తొలి వికెట్‌కు 42 బంతుల్లో 59 పరుగులు జోడించి ఢిల్లీకి శుభారంభం అందించారు. మున్రోను మావి బౌల్డ్ చేయగా... మరోవైపు 38 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న షా, ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా సంజు శామ్సన్తో సమంగా నిలిచాడు. షాను చావ్లా అవుట్ చేయగా, మరో మూడు బంతులకే పంత్ (0) వెనుదిరిగాడు. ఈ దశలో ఢిల్లీ స్కోరు 129/3 కాగా శ్రేయస్ 33 (23 బంతుల్లో) పరుగుల వద్ద ఆడుతున్నాడు. అయితే ఆపై అయ్యర్ తుఫాన్ వేగంతో దూసుకుపోయాడు. తాను ఎదుర్కొన్న తర్వాతి 17 బంతుల్లో అతను ఏకంగా 60 పరుగులు బాదాడు! వీటిలో 8 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా తన బ్యాటింగ్ పదును చూపించాడు. మావి వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లోనైతే శ్రేయస్ పండుగ చేసుకున్నాడు. ఐదు బంతుల్లో అతను 4 భారీ సిక్సర్లు, ఫోర్ బాదగా వైడ్‌తో కలిపి ఆ ఓవర్లో మొత్తం 29 పరుగులు వచ్చాయి. దాదాపు అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 77 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. ఈ దశలో రసెల్, శుబ్‌మన్ గిల్ ఆరో వికెట్‌కు 36 బంతుల్లోనే 64 పరుగులు జోడించినా... నైట్‌రైడర్స్ విజయానికి అది సరిపోలేదు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) చావ్లా 62; మున్రో (బి) మావి 33; శ్రేయస్ అయ్యర్ నాటౌట్ 93; పంత్ (సి) కార్తీక్ (బి) రసెల్ 0; మ్యాక్స్‌వెల్ రనౌట్ 27; విజయ్ శంకర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 219. వికెట్ల పతనం: 1–59, 2–127, 3–129, 4–202 బౌలింగ్: చావ్లా 4–0–33–1, కుల్దీప్ 2–0–22–0, శివమ్ మావి 4–0–58–1, నరైన్ 3–0–35–0, జాన్సన్ 4–0–42–0, రసెల్ 3–0–28–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ (బి) మ్యాక్స్‌వెల్ 5; నరైన్ (సి) శ్రేయస్ (బి) బౌల్ట్ 26; ఉతప్ప (సి) పృథ్వీ షా (బి) బౌల్ట్ 1; రాణా (సి అండ్ బి) అవేశ్ ఖాన్ 8; కార్తీక్ (సి) బౌల్ట్ (బి) మిశ్రా 18; శుబ్‌మన్ గిల్ రనౌట్ 37; రసెల్ (బి) అవేశ్ ఖాన్ 44; శివమ్ మావి (బి) మిశ్రా 0; చావ్లా (సి) మున్రో (బి) మ్యాక్స్‌వెల్ 2; జాన్సన్ నాటౌట్ 12; కుల్దీప్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 164. వికెట్ల పతనం: 1–19, 2–20, 3–33, 4–46, 5–77, 6–141, 7–141, 8–144, 9–146. బౌలింగ్: బౌల్ట్ 4–0–44–2, మ్యాక్స్‌వెల్ 2–0–22–2, అవేశ్ ఖాన్ 4–0–29–2, ప్లంకెట్ 4–0–24–0, మిశ్రా 4–1–23–2, శంకర్ 1–0–10–0, తేవటియా 1–0–11–0. -
కేజీబీ టు క్రెమ్లిన్
రష్యా నేత పుతిన్ అధ్యక్ష ఎన్నికల్లో సాధించిన ఘన విజయం 2024 వరకూ ఆయన పదవిలో కొనసాగడానికి అవకాశమిచ్చింది. రష్యా రాజ్యాం గం ప్రకారం వరుసగా రెండు సార్లు మించి ఏ నేతా అధ్యక్ష పదవి చేపట్టకూడదు. దాని ప్రకారం 2024 ఎన్నికలు వదిలేసి 2030లో ఆయన అధ్యక్ష పదవికి పోటీచేయొచ్చు. వ్యూహ రచనలో దిట్ట! నిఘా సంస్థ కేజీబీలో ఓ అధికారి స్థాయి నుంచి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ సెనెట్ వరకూ సాగిన పుతిన్ ప్రయాణం అసామాన్యం. పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న మొదటి ఎనిమిదేళ్లలో (2000–2008) రష్యా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. ఆ రోజుల్లో భారీగా పెరిగిన ముడి చమురు, సహజ వాయువు ధరల ఫలితంగా సంపన్నులు సహా రష్యన్ల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయన తన అధికారం సుస్థిరం చేసుకోగలిగారు. ప్రభుత్వంపై తిరుగులేని పట్టు సంపాదించారు.మొదట రాజకీయ పలుకుబడి ఉన్న బడా పారిశ్రామికవేత్తలను, తర్వాత ప్రతిపక్ష నేతలను నిరాధార ఆరోపణలతో దెబ్బతీశారు. వారిలో కొందరిని దేశం నుంచి బహిష్కరించారు. రష్యాలో రాజకీయాలు లేని ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు పుతిన్ చేసిన ప్రయత్నం ఫలించింది. ‘ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తా. మీరు రాజకీయాలకు దూరంగా ఉండండి’ అన్న పుతిన్ మాటలను సామాన్య ప్రజానీకం, కార్మికవర్గం నమ్మడంతో పుతిన్ అధికారానికి అడ్డంకులు లేకుండా పోయాయి. అయితే, గత ఆరేళ్లలో పాశ్చాత్యదేశాల ఆంక్షల ఫలితంగా రష్యా ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. అయినప్పటికీ సిరియా అంతర్యుద్ధంలో జోక్యం, క్రిమియా ఆక్రమణ ద్వారా దేశాన్ని పుతిన్ అగ్రరాజ్యం దిశగానే నడిపిస్తున్నారని రష్యన్లు విశ్వసిస్తున్నారు. కాగా, పుతిన్‌కు తొలినాళ్లలో ప్రజాదరణ ఉన్నప్పటికీ ఇప్పుడు జరిగే ప్రతీ ఎన్నికల్లోనూ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు, పరిశీలకులు ఆరోపిస్తున్నారు. అణచివేయడంలో ఘటికుడు ప్రధాన ప్రత్యర్థులను అణచివేయడం, అక్రమంగా జైలుకు పంపడం, ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హులను చేయడం పుతిన్‌కు కొట్టిన పిండి. 1952లో లెనిన్గ్రాడ్లో జన్మించిన పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుకున్నారు. 1975లో కేజీబీలో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉద్యోగంలో చేరి వేగంగా లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. రాజకీయాలపై ఆసక్తితో 1991లో ఉద్యోగానికి రాజీనామా చేసి మకాం రాజధాని మాస్కోకు మార్చారు. యునైటెడ్ రష్యా పార్టీ నేత అయిన పుతిన్‌కు ప్రధానిగా తొలి అవకాశం అధ్యక్షుడు బోరిస్ ఎలిత్సిన్ ఇచ్చారు. 1999లో అప్పటి ప్రధాని సెర్జీ స్టెపాషిన్ను బర్తరఫ్ చేసి పుతిన్‌ను ప్రధానమంత్రిగా ప్రమోట్ చేశారు. అదే ఏడాది డిసెంబర్లో రాజీనామా చేసిన ఎలిత్సిన్ తాత్కాలిక అధ్యక్షునిగా పుతిన్‌ను నియమించారు. 2000 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ తన సమీప కమ్యూనిస్ట్ ప్రత్యర్థి గెనడీ జ్యుగనోవ్పై విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో 72 శాతం ఓట్లు సాధించి రెండోసారి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. 2008లో ప్రధానిగా నియమితులయ్యారు. 2011లో అధ్యక్ష పదవీకాలా న్ని నాలుగు నుంచి ఆరేళ్లకు పెంచారు. ఈ చట్ట సవరణ చేశాక 2012లో పుతిన్ మూడోసారి అధ్యక్షపదవికి పోటీచేసి 64 శాతం ఓట్లతో గెలిచారు. తాజా విజయంతో పుతిన్ నియంత జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాను ఎక్కువ కాలం పాలించిన నేతగా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హైదరాబాద్ ఆశలు సజీవం
సాక్షి, హైదరాబాద్: సమష్టి ఆటతీరుతో ఆకట్టుకున్న హైదరాబాద్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. జమ్మూ కశ్మీర్‌తో సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్ 149 పరుగులతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ సరిగ్గా 50 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ కశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ ధాటికి హైదరాబాద్ 41 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ రోహిత్ రాయుడు (130 బంతుల్లో 130; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), బావనాక సందీప్ (74 బంతుల్లో 72; 5 ఫోర్లు) బాధ్యతాయుత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. రోహిత్ ఈ టోర్నీలో రెండో సెంచరీ నమోదు చేయగా... సందీప్ రెండో అర్ధ సెంచరీ సాధించాడు. స్కోరు 212 పరుగులవద్ద సందీప్ ఔటవ్వడంతో నాలుగో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ధాటిగా పరుగులు సాధించే క్రమంలో హైదరాబాద్ వికెట్లు కోల్పోయి 312 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ కశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ కశ్మీర్ ఏదశలోనూ లక్ష్యాన్ని ఛేధించేలా కనిపించలేదు. హైదరాబాద్ బౌలర్లు సిరాజ్ (2/33), రవికిరణ్ (2/17), ఆకాశ్ భండారి (3/34) వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆ జట్టు 34.1 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఇదే గ్రూప్‌లోని ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ ఏడు వికెట్లతో జార్ఖండ్‌పై... సౌరాష్ట్ర ఎనిమిది వికెట్లతో సర్వీసెస్‌పై గెలిచాయి. ప్రస్తుతం గ్రూప్ ‘డి’లో విదర్భ, హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్ 16 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా... 12 పాయింట్లతో సౌరాష్ట్ర రెండో స్థానంలో ఉంది. బుధవారం జరిగే చివరి రౌండ్లో ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్; విదర్భతో సౌరాష్ట్ర తలపడతాయి. సమీకరణాల ప్రకారం ఈ నాలుగు జట్లకూ క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉన్నాయి. -
యూపీలో బీజేపీ విజయభేరి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 16 మునిసిపల్ కార్పొరేషన్లలో 14 చోట్ల బీజేపీ జెండా ఎగురవేసింది. ఆశ్చర్యకరంగా బీఎస్పీ అలీగఢ్, మీరట్ నగరాల మేయర్ పదవులను కైవసం చేసుకుంది. అలహాబాద్, వారణాసి, అయోధ్య, గోరఖ్‌పూర్, ఘజియాబాద్, బరేలీ, ఆగ్రా, ఫిరోజాబాద్, మథుర, లక్నో, కాన్పూర్, సహరాన్పూర్, ఝాన్సీ, మొరాదాబాద్లలో బీజేపీ అభ్యర్థులే మేయర్ పీఠాన్ని అధిరోహించనున్నారు. కాంగ్రెస్ కంచుకోట, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నగర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి పాగా వేసింది. 2019లో క్లీన్‌స్వీప్: యోగి ఈ విజయంపై యూపీ సీఎం ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో అమేథీ సహా అన్ని స్థానాల్లోనూ తమ పార్టీయే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయం చరిత్రాత్మకమన్న సీఎం.. మోదీ దార్శనికత, అమిత్ మార్గనిర్దేశత్వం కారణంగా ఈ ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. ప్రజలు కుల, కుటుంబ, ప్రలోభపెట్టే రాజకీయాలను పక్కనపెట్టి బీజేపీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకు సంపూర్ణ మద్దతు తెలిపారనేది సుస్పష్టమైందని బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. కాగా, జీఎస్టీకి ప్రజల మద్దతుకు ఈ ఎన్నికల ఫలితాలు తార్కాణమని కేంద్ర మంత్రి జైట్లీ అన్నారు. వ్యాపారులకు అనుకూల వాతావరణం నిర్మాణం జరుగుతోందన్నారు. ‘జీడీపీ వృద్ధి, యూపీ ఎన్నికల ఫలితాలు.. ఇలా ఎటుచూసినా శుభవార్తలే వినిపిస్తున్నాయి’ అని ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ప్రసంగంలో పేర్కొన్నారు. బీజేపీలో జోష్.. కాంగ్రెస్‌లో నిరాశ ఈ ఫలితాలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి అదనపు బలాన్నివ్వగా.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌కు పగ్గాలు అప్పజెప్పనున్న నేపథ్యంలో ఈ ప్రదర్శన కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. లక్నోకు తొలి మహిళా మేయర్ యూపీ రాజ ధాని లక్నోకు ప్రథమ మహిళా మేయర్‌గా సం యుక్త భాటియా చరిత్ర సృష్టించా రు. ప్రత్యర్థిపై 1,31,356 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 19 మంది బరిలో నిలవగా.. కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు వరుసగా మూడు, నాలుగు స్థానాలకు పరిమితమయ్యారు. దేశానికి మొదటి మహిళా గవర్నర్‌గా సరోజినీ నాయుడు (1947–1949), తొలి మహిళా సీఎంగా సుచేతా కృపలానీ (1963–1967) యూపీ వారే. -
'చహల్' చల్
► 6 వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ ► చివరి టి20లో భారత్ సంచలన విజయం ► 75 పరుగులతో ఇంగ్లండ్ చిత్తు ► 2–1తో సిరీస్ కోహ్లి సేన సొంతం ‘ఆరో నంబర్’ ఆటగాడు అద్భుతం చేశాడు. తన మణికట్టు మాయాజాలం చూపిస్తూ చిన్నస్వామి మైదానంలో చరిత్రను తిరగరాశాడు. గుగ్లీలు, ఫ్లిప్పర్లతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను విలవిల్లాడించిన యజువేంద్ర చహల్ భారత జట్టుకు ఆహా అనిపించే గెలుపును అందించాడు. తన తొలి ఓవర్లో వికెట్‌తో శుభారంభం... మూడో ఓవర్లో వరుస రెండు బంతుల్లో కీలక బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసి ప్రత్యర్థి కోట బద్దలు... చివరి ఓవర్లో మరో మూడు వికెట్లు... గతంలో ఏ భారత బౌలర్‌కూ సాధ్యం కాని రీతిలో ఆరు వికెట్లతో లెగ్‌స్పిన్నర్ చహల్ ఆటాడుకున్నాడు. టెస్టులు, వన్డేల బాటలోనే ఇంగ్లండ్‌తో టి20 సిరీస్ కూడా గెలిచి భారత్ తమ విజయాల జోరును పరిపూర్ణం చేయగా, ఇంగ్లండ్ నిరాశతో పర్యటనను ముగించింది. ముందుగా ధోని, రైనా మెరుపులకు తోడు యువరాజ్ పవర్ కూడా జత కలిసి భారత్ 202 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. అయితే మైదానం చిన్నది, గత రికార్డు వల్ల ఇది అసాధ్యమైన లక్ష్యంలా అనిపించలేదు. ఒకదశలో 119/2తో ఇంగ్లండ్ మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ సమయంలో చహల్ దండయాత్ర మొదలైంది. అతనికి తోడుగా బుమ్రా నిలిచాడు. అంతే... ఇంగ్లండ్ ఆటగాళ్లు అవుటయ్యేందుకు క్యూలో నిలబడ్డారు. 19 బంతుల వ్యవధిలో కేవలం 8 పరుగులకు తమ చివరి 8 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ తలవంచింది. ఆరుగురు బ్యాట్స్‌మెన్ సున్నాకే పరిమితమైన స్థితిలో ఆ జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకోగా, భారత ఆటగాళ్ల సంబరాలకు అంతులేకుండా పోయింది. బెంగళూరు: తొలి రెండు టి20ల్లో అంతంత మాత్రం ప్రదర్శన కనబర్చిన భారత్ కీలకమైన చివరి మ్యాచ్‌లో జూలు విదిల్చింది. భారీ స్కోరు చేయడంతో పాటు ప్రత్యర్థిని కుప్పకూల్చి సిరీస్‌ను సొంతం చేసుకుంది. బుధవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో టి20లో భారత్ 75 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. సురేశ్ రైనా (45 బంతుల్లో 63; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోని (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. రెండో వికెట్‌కు రాహుల్‌తో 37 బంతుల్లో 61 పరుగులు జోడించిన రైనా, ఆ తర్వాత మూడో వికెట్‌కు ధోనితో 37 బంతుల్లో 55 పరుగులు జత చేశాడు. ఆ తర్వాత చహల్ (6/25) అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ 16.3 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. రూట్ (37 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మోర్గాన్ (21 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–1తో నెగ్గింది. చహల్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు దక్కాయి. పరుగుల మోత... సిరీస్‌లో వరుసగా మూడోసారి కూడా టాస్ ఓడిన భారత్ మూడోసారి కూడా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో ఆడిన మనీశ్ పాండే స్థానంలో రిషభ్ పంత్‌కు కెరీర్లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. రెండో ఓవర్ తొలి బంతికే లేని పరుగు కోసం ప్రయత్నించి రాహుల్‌తో సమన్వయ లోపంతో కోహ్లి (2) రనౌట్ కావడంతో భారత్‌కు షాక్ తగిలింది. అయితే ఈ దశలో రైనా, రాహుల్ (18 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జోరు తగ్గకుండా బ్యాటింగ్‌కు కొనసాగించారు. చాలా కాలం తర్వాత తనదైన శైలిలో ఆడిన రైనా సిక్సర్లతో చెలరేగాడు. జోర్డాన్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో 14 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 53 పరుగులకు చేరింది. అలీ వేసిన బంతిని స్టేడియం బయటకు కొట్టిన తర్వాత మరుసటి ఓవర్లో రాహుల్ బౌల్డ్ కావడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. స్టోక్స్ వేసిన ఈ బంతి ‘నోబాల్’ అయినా, అంపైర్లు దానిని గుర్తించలేకపోయారు. మరోవైపు రైనా దూకుడు కొనసాగింది. రషీద్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్‌తో 39 బంతుల్లోనే రైనా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో ధోని మెరుపు షాట్లు భారత్‌కు భారీ స్కోరు అందించాయి. యువరాజ్ (10 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్సర్లు) కూడా క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు శివాలెత్తాడు. తొలి పది ఓవర్లలో 78 పరుగులు చేసిన భారత్, తర్వాతి పది ఓవర్లలో 124 పరుగులు చేయడం విశేషం. టపటపా... ఛేదనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే బిల్లింగ్స్ (0) వికెట్ కోల్పోయింది. అనంతరం రాయ్ (23 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్), రూట్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ధాటిగా ఆడిన వీరిద్దరు రెండో వికెట్‌కు 29 బంతుల్లోనే 47 పరుగులు జోడించిన తర్వాత మిశ్రా బౌలింగ్‌లో రాయ్ వెనుదిరిగాడు. రూట్ జాగ్రత్తగా ఆడగా, మోర్గాన్ చెలరేగిపోయాడు. ఈ దశలో ఇంగ్లండ్ లక్ష్యం దిశగా మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే చహల్ వరుస బంతుల్లో వీరిద్దరిని అవుట్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్ వైపు తిరిగింది. ఆ తర్వాత బుమ్రా కూడా విజృంభించడంతో కొద్ది సేపటికే భారత జట్టు విజయం ఖాయమైంది. అసహనం నుంచి అభినందనల వరకు... తన తొలి బంతికి సిక్సర్ ఇచ్చిన చహల్ మూడో బంతికే వికెట్ తీసి భారత్‌కు శుభారంభం అందించాడు. అయితే మరుసటి బంతికే సునాయాస రనౌట్ అవకాశాన్ని అతను పోగొట్టాడు. కవర్స్ దిశగా రూట్ బంతిని ఆడగా, నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ నుంచి రాయ్ చాలా ముందుకు వచ్చేశాడు. కోహ్లి అద్భుత ఫీల్డింగ్‌తో బౌలర్‌కు బంతిని అందించాడు. అయితే రెప్పపాటులో పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయిన చహల్ దానిని కీపర్ వైపు విసిరాడు. దాంతో రాయ్ రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు. ఈ సమయంలో జట్టు మొత్తం అతనిపై అసహనం వ్యక్తం చేసింది. కానీ చివర్లో వరుస వికెట్లతో జట్టును గెలిపించిన క్షణాన అదే సహచరుల అభినందనల వర్షంలో అతను తడిసిముద్దవడం విశేషం. బ్రాడ్... కాదు కాదు జోర్డాన్! భారత్ ఇన్నింగ్స్ 18వ ఓవర్... జోర్డాన్ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని ధోని సింగిల్ తీయడంతో యువరాజ్‌కు స్ట్రైకింగ్ వచ్చింది. తర్వాతి నాలుగు బంతులు అతను ఆడిన తీరు చూస్తే పదేళ్ల క్రితంనాటి యువీ గుర్తుకొచ్చాడు. ప్రతీ బంతిని తుత్తునియలు చేస్తూ విరుచుకుపడిన యువరాజ్ వరుసగా 6, 6, 4, 6 బాదడంతో చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. ఓవర్లో ఆరు సిక్సర్లు కాకపోయినా, నాడు బ్రాడ్‌ను ఉతికేసిన తరహాలోనే ఈ సారి జోర్డాన్‌పై యువీ విరుచుకుపడ్డాడు. అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీసిన రెండో బౌలర్ చహల్. టి20ల్లో భారత్ తరఫున ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. గతంలో శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ మాత్రమే రెండుసార్లు ఆరేసి వికెట్లు తీశాడు. ఎట్టకేలకు అర్ధ సెంచరీ... 75 మ్యాచ్‌లు, 65 ఇన్నింగ్స్‌లు... పదేళ్ల టి20 కెరీర్లో వరల్డ్ కప్ మొదలు పలు చిరస్మరణీయ విజయాలు. కానీ ధోని ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క అర్ధసెంచరీ కూడా లేదు. ఈ మ్యాచ్‌కు ముందు అతని అత్యధిక స్కోరు 48 పరుగులు మాత్రమే. చివర్లోనే వచ్చి కొన్ని ధనాధన్ షాట్లతో మురిపించడమే తప్ప సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలిచే అవకాశం రాకపోవడం కూడా అందుకు ఒక కారణం. అయినా సరే ధోనిలాంటి హిట్టర్‌కు అదో వెలితిగానే ఉండిపోయింది. ఇప్పుడు మొత్తానికి అతను దానిని సాధించాడు. ఎనిమిదో ఓవర్లోనే క్రీజ్‌లోకి వచ్చిన ఈ మాజీ కెప్టెన్ తన పాత ఆటను చూపిస్తూ సాంప్రదాయేతర షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆరంభంలోనే రెండు సిక్సర్లు బాదిన అతను, స్టోక్స్ ఓవర్లో రెండు చూడచక్కటి బౌండరీలు కొట్టాడు. 32 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అర్ధ సెంచరీ చేయడానికి ఇన్ని మ్యాచ్‌లు (76) ఎవరూ తీసుకోలేదు. మ్యాచ్‌కు ముందు ధోనిని భారత జట్టు సభ్యులంతా కలిసి ఘనంగా సత్కరించారు. కెప్టెన్‌గా అతను సాధించిన నాలుగు గొప్ప విజయాలను సూచిస్తూ నాలుగు స్టార్లు ఉండేలా ప్రత్యేకంగా చెక్కించిన ఫలకాన్ని జ్ఞాపికగా అందజేశారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: కోహ్లి (రనౌట్) 2; రాహుల్ (బి) స్టోక్స్ 22; రైనా (సి) మోర్గాన్ (బి) ప్లంకెట్ 63; ధోని (సి) రషీద్ (బి) జోర్డాన్ 56; యువరాజ్ (సి) బట్లర్ (బి) మిల్స్ 27; పంత్ (నాటౌట్) 5; పాండ్యా (రనౌట్) 11; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–4; 2–65; 3–120; 4–177; 5–191; 6–202. బౌలింగ్: మిల్స్ 4–0–31–1; జోర్డాన్ 4–0–56–1; ప్లంకెట్ 2–0–22–1; స్టోక్స్ 4–0–32–1; అలీ 4–0–30–0; రషీద్ 2–0–23–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) ధోని (బి) మిశ్రా 32; బిల్లింగ్స్ (సి) రైనా (బి) చహల్ 0; రూట్ (ఎల్బీ) (బి) చహల్ 42; మోర్గాన్ (సి) పంత్ (బి) చహల్ 40; బట్లర్ (సి) కోహ్లి (బి) బుమ్రా 0; స్టోక్స్ (సి) రైనా (బి) చహల్ 6; అలీ (సి) కోహ్లి (బి) చహల్ 2; ప్లంకెట్ (బి) బుమ్రా 0, జోర్డాన్ (స్టంప్డ్) ధోని (బి) చహల్ 0; రషీద్ (నాటౌట్) 0; మిల్స్ (సి) కోహ్లి (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.3 ఓవర్లలో ఆలౌట్) 127 వికెట్ల పతనం: 1–8; 2–55; 3–119; 4–119; 5–119; 6–123, 7–127, 8–127, 9–127, 10–127. బౌలింగ్: నెహ్రా 3–1–24–0, చహల్ 4–0–25–6, బుమ్రా 2.3–0–14–3, మిశ్రా 4–0–23–1; పాండ్యా 2–0–17–0, రైనా 1–0–22–0.