యూపీలో బీజేపీ విజయభేరి | BJP Emerges Victorious In Civic Polls, Wins 14 Seats | Sakshi
Sakshi News home page

యూపీలో బీజేపీ విజయభేరి

Published Sat, Dec 2 2017 3:50 AM | Last Updated on Sat, Dec 2 2017 3:50 AM

 BJP Emerges Victorious In Civic Polls, Wins 14 Seats - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 16 మునిసిపల్‌ కార్పొరేషన్లలో 14 చోట్ల బీజేపీ జెండా ఎగురవేసింది. ఆశ్చర్యకరంగా బీఎస్పీ అలీగఢ్, మీరట్‌ నగరాల మేయర్‌ పదవులను కైవసం చేసుకుంది. అలహాబాద్, వారణాసి, అయోధ్య, గోరఖ్‌పూర్, ఘజియాబాద్, బరేలీ, ఆగ్రా, ఫిరోజాబాద్, మథుర, లక్నో, కాన్పూర్, సహరాన్‌పూర్, ఝాన్సీ, మొరాదాబాద్‌లలో బీజేపీ అభ్యర్థులే మేయర్‌ పీఠాన్ని అధిరోహించనున్నారు. కాంగ్రెస్‌ కంచుకోట, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నగర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి పాగా వేసింది.

2019లో క్లీన్‌స్వీప్‌: యోగి
ఈ విజయంపై యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ హర్షం వ్యక్తం చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో అమేథీ సహా అన్ని స్థానాల్లోనూ తమ పార్టీయే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయం చరిత్రాత్మకమన్న సీఎం.. మోదీ దార్శనికత, అమిత్‌  మార్గనిర్దేశత్వం కారణంగా ఈ ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. ప్రజలు కుల, కుటుంబ, ప్రలోభపెట్టే రాజకీయాలను పక్కనపెట్టి బీజేపీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకు సంపూర్ణ మద్దతు తెలిపారనేది సుస్పష్టమైందని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా పేర్కొన్నారు. కాగా, జీఎస్టీకి ప్రజల మద్దతుకు ఈ ఎన్నికల ఫలితాలు తార్కాణమని కేంద్ర మంత్రి జైట్లీ అన్నారు. వ్యాపారులకు అనుకూల వాతావరణం నిర్మాణం జరుగుతోందన్నారు. ‘జీడీపీ వృద్ధి, యూపీ ఎన్నికల ఫలితాలు.. ఇలా ఎటుచూసినా శుభవార్తలే వినిపిస్తున్నాయి’ అని ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

బీజేపీలో జోష్‌.. కాంగ్రెస్‌లో నిరాశ
ఈ ఫలితాలు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి అదనపు బలాన్నివ్వగా.. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌కు పగ్గాలు అప్పజెప్పనున్న నేపథ్యంలో ఈ ప్రదర్శన కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది.

లక్నోకు తొలి మహిళా మేయర్‌
యూపీ రాజ ధాని లక్నోకు ప్రథమ మహిళా మేయర్‌గా సం యుక్త భాటియా చరిత్ర సృష్టించా రు. ప్రత్యర్థిపై 1,31,356 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 19 మంది బరిలో నిలవగా.. కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు వరుసగా మూడు, నాలుగు స్థానాలకు పరిమితమయ్యారు. దేశానికి మొదటి మహిళా గవర్నర్‌గా సరోజినీ నాయుడు (1947–1949), తొలి మహిళా సీఎంగా సుచేతా కృపలానీ (1963–1967) యూపీ వారే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement