రోహిత్ రాయుడు
సాక్షి, హైదరాబాద్: సమష్టి ఆటతీరుతో ఆకట్టుకున్న హైదరాబాద్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. జమ్మూ కశ్మీర్‌తో సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్ 149 పరుగులతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ సరిగ్గా 50 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ కశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ ధాటికి హైదరాబాద్ 41 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ రోహిత్ రాయుడు (130 బంతుల్లో 130; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), బావనాక సందీప్ (74 బంతుల్లో 72; 5 ఫోర్లు) బాధ్యతాయుత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు.
రోహిత్ ఈ టోర్నీలో రెండో సెంచరీ నమోదు చేయగా... సందీప్ రెండో అర్ధ సెంచరీ సాధించాడు. స్కోరు 212 పరుగులవద్ద సందీప్ ఔటవ్వడంతో నాలుగో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ధాటిగా పరుగులు సాధించే క్రమంలో హైదరాబాద్ వికెట్లు కోల్పోయి 312 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ కశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ కశ్మీర్ ఏదశలోనూ లక్ష్యాన్ని ఛేధించేలా కనిపించలేదు. హైదరాబాద్ బౌలర్లు సిరాజ్ (2/33), రవికిరణ్ (2/17), ఆకాశ్ భండారి (3/34) వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆ జట్టు 34.1 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఇదే గ్రూప్‌లోని ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ ఏడు వికెట్లతో జార్ఖండ్‌పై...
సౌరాష్ట్ర ఎనిమిది వికెట్లతో సర్వీసెస్‌పై గెలిచాయి.
ప్రస్తుతం గ్రూప్ ‘డి’లో విదర్భ, హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్ 16 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా... 12 పాయింట్లతో సౌరాష్ట్ర రెండో స్థానంలో ఉంది. బుధవారం జరిగే చివరి రౌండ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్; విదర్భతో సౌరాష్ట్ర తలపడతాయి. సమీకరణాల ప్రకారం ఈ నాలుగు జట్లకూ క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment