
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు పోరాటం ముగిసింది. అజేయంగా సెమీస్ చేరిన ఆంధ్ర ఆదివారం జరిగిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర చేతిలో 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 49.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌట్ కాగా... ఆంధ్ర 45.3 ఓవర్లలో 196 పరుగులకే పరిమితమై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
రవీంద్ర జడేజా (56; 4 ఫోర్లు, 1 సిక్స్), అర్పిత్ (58; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో సౌరాష్ట్ర గౌరవప్రద స్కోరు చేసింది. ఆంధ్ర బౌలర్లలో కార్తీక్ రామన్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌కు మంచి ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. భరత్ (29), అశ్విన్ హెబర్ (12), కెప్టెన్ విహారి (25), రికీ భుయ్ (13) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. సుమంత్ (42; 2 ఫోర్లు, 1 సిక్స్), రవితేజ (42) పోరాడినా లాభం లేకపోయింది. మంగళవారం జరిగే ఫైనల్లో కర్ణాటకతో సౌరాష్ట్ర తలపడుతుంది.