జట్టును ముందుండి నడిపించడం అంటే ఏమిటో శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లోనే చూపించాడు. కెప్టెన్‌గా తనపై ఎలాంటి ఒత్తిడి లేదని నిరూపిస్తూ బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించి ఢిల్లీ రాత మార్చాడు. 10 సిక్సర్లతో విరుచుకుపడి డేర్‌డెవిల్స్‌కు కీలక విజయాన్ని అందించాడు. కెప్టెన్సీతో పాటు తుది జట్టుకూ దూరమైన సీనియర్ గంభీర్ డగౌట్ నుంచి చూస్తుండగా, యువ అయ్యర్‌తో పాటు మరో సంచలనం పృథ్వీ షా దూకుడైన బ్యాటింగ్ కోట్లాలో అభిమానులకు ఆనందం పంచితే... భారీ స్కోరును ఛేదించలేక కోల్‌కతా చతికిల పడింది
న్యూఢిల్లీ: కెప్టెన్సీ మార్పు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు అదృష్టం తెచ్చిపెట్టినట్లుంది. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ జట్టుకు ఎట్టకేలకు ఊరట లభించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 55 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 10 సిక్సర్లు) భీకర బ్యాటింగ్, పృథ్వీ షా (44 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌కు మున్రో (18 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు కూడా తోడయ్యాయి. ఆ తర్వాత కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. రసెల్ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చివరి 4 ఓవర్లలో 76...
పృథ్వీ షా, మున్రో తొలి వికెట్‌కు 42 బంతుల్లో 59 పరుగులు జోడించి ఢిల్లీకి శుభారంభం అందించారు. మున్రోను మావి బౌల్డ్ చేయగా... మరోవైపు 38 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న షా, ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా సంజు శామ్సన్‌తో సమంగా నిలిచాడు. షాను చావ్లా అవుట్ చేయగా, మరో మూడు బంతులకే పంత్ (0) వెనుదిరిగాడు. ఈ దశలో ఢిల్లీ స్కోరు 129/3 కాగా శ్రేయస్ 33 (23 బంతుల్లో) పరుగుల వద్ద ఆడుతున్నాడు. అయితే ఆపై అయ్యర్ తుఫాన్ వేగంతో దూసుకుపోయాడు.
తాను ఎదుర్కొన్న తర్వాతి 17 బంతుల్లో అతను ఏకంగా 60 పరుగులు బాదాడు! వీటిలో 8 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా తన బ్యాటింగ్ పదును చూపించాడు. మావి వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లోనైతే శ్రేయస్ పండుగ చేసుకున్నాడు. ఐదు బంతుల్లో అతను 4 భారీ సిక్సర్లు, ఫోర్ బాదగా వైడ్‌తో కలిపి ఆ ఓవర్లో మొత్తం 29 పరుగులు వచ్చాయి. దాదాపు అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 77 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. ఈ దశలో రసెల్, శుబ్‌మన్ గిల్ ఆరో వికెట్‌కు 36 బంతుల్లోనే 64 పరుగులు జోడించినా... నైట్‌రైడర్స్ విజయానికి అది సరిపోలేదు.
స్కోరు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) చావ్లా 62; మున్రో (బి) మావి 33; శ్రేయస్ అయ్యర్ నాటౌట్ 93; పంత్ (సి) కార్తీక్ (బి) రసెల్ 0; మ్యాక్స్‌వెల్ రనౌట్ 27; విజయ్ శంకర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 219.
వికెట్ల పతనం: 1–59, 2–127, 3–129, 4–202
బౌలింగ్: చావ్లా 4–0–33–1, కుల్దీప్ 2–0–22–0, శివమ్ మావి 4–0–58–1, నరైన్ 3–0–35–0, జాన్సన్ 4–0–42–0, రసెల్ 3–0–28–1.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ (బి) మ్యాక్స్‌వెల్ 5; నరైన్ (సి) శ్రేయస్ (బి) బౌల్ట్ 26; ఉతప్ప (సి) పృథ్వీ షా (బి) బౌల్ట్ 1; రాణా (సి అండ్ బి) అవేశ్ ఖాన్ 8; కార్తీక్ (సి) బౌల్ట్ (బి) మిశ్రా 18; శుబ్‌మన్ గిల్ రనౌట్ 37; రసెల్ (బి) అవేశ్ ఖాన్ 44; శివమ్ మావి (బి) మిశ్రా 0; చావ్లా (సి) మున్రో (బి) మ్యాక్స్‌వెల్ 2; జాన్సన్ నాటౌట్ 12; కుల్దీప్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 164.
వికెట్ల పతనం: 1–19, 2–20, 3–33, 4–46, 5–77, 6–141, 7–141, 8–144, 9–146. బౌలింగ్: బౌల్ట్ 4–0–44–2, మ్యాక్స్‌వెల్ 2–0–22–2, అవేశ్ ఖాన్ 4–0–29–2, ప్లంకెట్ 4–0–24–0, మిశ్రా 4–1–23–2, శంకర్ 1–0–10–0, తేవటియా 1–0–11–0.
Comments
Please login to add a commentAdd a comment