అందుకే చెన్నై గెలిచింది : గంభీర్‌ | Gambhir Opinion About Chennai Super Kings Best Performance In All IPL Seasons | Sakshi
Sakshi News home page

అందుకే చెన్నై గెలిచింది : గంభీర్‌

Published Wed, May 30 2018 9:59 AM | Last Updated on Wed, May 30 2018 10:52 AM

Gambhir Opinion About Chennai Super Kings Best Performance In All IPL Seasons - Sakshi

ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్‌-11 విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు యాజమాన్యంపై ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. సీఎస్‌కే యాజమాన్యం తమ కెప్టెన్‌ ధోనీని క్రికెట్‌ బాస్‌గా భావిస్తుందని.. ఫీల్డ్‌లో అతనికి పూర్తి స్వేచ్చను ఇవ్వడం ద్వారా ఒత్తిడిని తగ్గించి తద్వారా విజయాల్ని తమ ఖాతాలో వేసుకుంటుందని పేర్కొన్నాడు. ఈ కారణంగానే ఆ జట్టు ఏడుసార్లు ఫైనల్‌కు చేరడమే కాకుండా మూడుసార్లు విజేతగా నిలిచిందని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ వంటి టోర్నమెంట్‌లో ఒక కెప్టెన్‌గా విజయవంతమవ్వాలంటే ఆటగాళ్లతో పాటు యాజమాన్యం సహకారం కూడా ఎంతో ముఖ్యమని గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అంతేకాకుండా ఐపీఎల్‌​ చాలా ఖరీదైన వ్యాపారమని.. ఫ్రాంచైజీ ఫీజు, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది జీతాలు, ప్రయాణ ఖర్చులు అంటూ యాజమాన్యం ఎంతో ఖర్చు పెడుతుందని గంభీర్‌ ఒక ప్రముఖ పత్రికలో రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు. అన్నిటికంటే ఇక్కడ ఇగోకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని గంభీర్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లోని వివిధ జట్ల యజమానులు అందరు వేర్వేరు వ్యాపారాల్లో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించారని.. అయితే క్రికెట్‌ను కూడా ఒక వ్యాపారం లాగే భావిస్తారని.. పెట్టుబడికి తగిన లాభం​ వచ్చిందా లేదా అనే విషయం మీదే వారికి ఎక్కువ శ్రద్ధ ఉంటుందని ఘాటుగా విమర్శించాడు. క్రికెటర్లలాగా వారు కూడా ఓటమిని ద్వేషిస్తారని.. విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఇష్టపడతారే గానీ.. ఒకవేళ వారి సలహాల వల్ల ఓటమి ఎదురైనపుడు అందుకు తగిన కారణాలు చూపితే వారి ఇగో దెబ్బతింటుందని పరోక్షంగా తమ జట్టు యాజమాన్య తీరును ఎండగట్టాడు.

‘కొన్ని మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నా.. యాజమాన్యం నాకు మామూలు ఆటగాడిగానూ అవకాశం ఇవ్వలేదు. మీరెందుకు ఆ తర్వాత ఢిల్లీ జట్టులో ఆడలేదని కొందరు ఇప్పటికీ అడుగుతున్నారు. అయితే వాస్తవం వేరేలా ఉంది. ప్రధాన ఆటగాళ్లయిన రబడ, క్రిస్‌ మోరిస్‌లకు గాయాలు కావడంతో పాటు కొందరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. దీంతో జట్టు వరుస వైఫల్యాలు చవిచూడాల్సి వచ్చింది. కీలక ఆటగాళ్లు సరైన సందర్భాల్లో రాణించకపోవడంతో ఈ సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాలో ఒత్తిడిని పెంచడంతో విఫలమయ్యానని’ గంభీర్‌ పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్‌లో ఢిల్లీ కేవలం 10 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement