కోల్‌‘కథ’ ఇంకా ఉంది  | Kolkata Knight Riders beat Rajasthan Royals by 25 runs | Sakshi
Sakshi News home page

కోల్‌‘కథ’ ఇంకా ఉంది 

Published Thu, May 24 2018 1:38 AM | Last Updated on Thu, May 24 2018 7:45 AM

Kolkata Knight Riders beat Rajasthan Royals by 25 runs - Sakshi

మొదట బంతితోనూ, తర్వాత బ్యాట్‌తోనూ రాజస్తాన్‌ ఆటలే సాగాయి. నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మెన్‌తో ఓ ఆటాడుకుంది. షాట్లను అడ్డుకుంది. ఆడేవాళ్లందరినీ ఆదిలోనేపడగొట్టింది. క్రీజ్‌లోకి వచ్చిన వారిని వెంటనే పెవిలియన్‌ పంపించింది. కానీ ఊరించే లక్ష్యాన్ని (170) మాత్రం ఛేదించలేకపోయింది. బ్యాటింగ్‌ను, బౌలింగ్‌నుపేలవంగా మొదలు పెట్టిన కోల్‌కతా మ్యాచ్‌ సాగే కొద్దీ సత్తా చాటింది. పట్టుదలతోగెలిచింది. ఎలిమినేటర్‌లో రాజస్తాన్‌ కథను ముగించింది. ఐపీఎల్‌–11లో ఫైనల్‌ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది.

కోల్‌కతా: సొంత మైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సత్తా చాటింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ పోరులో 25 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు అర్హత పొందింది. 25న ఇదే వేదికపై జరిగే రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో దినేశ్‌ కార్తీక్‌ బృందం తలపడనుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (38 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రసెల్‌ (25 బంతుల్లో 49 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులే చేయగల్గింది. సంజూ శామ్సన్‌ (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రహానే (41 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. రసెల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.   

‘టాప్‌’ లేచింది
కోల్‌కతా ఇన్నింగ్స్‌ పేలవంగా మొదలైంది. భారీ షాట్లకు తెగబడే సునీల్‌ నరైన్‌ (4) రెండో బంతికే స్టంపౌట్‌ అయ్యాడు. రాబిన్‌ ఉతప్ప (3), నితీశ్‌ రాణా (3) నిర్లక్ష్యంగా ఆడి వికెట్లను పారేసుకున్నారు. నరైన్, ఉతప్ప... కృష్ణప్ప గౌతమ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగితే రాణా... అర్చర్‌ ఖాతాలోకి వెళ్లాడు. ఇందులో బౌలింగ్‌ గొప్పతనం కంటే బ్యాట్స్‌మెన్‌ పేలవ షాట్లే కోల్‌కతా కొంప ముంచాయి. ఓపెనర్‌ లిన్‌ (22 బంతుల్లో 18; 2 ఫోర్లు) ఎనిమిది ఓవర్లపాటు ఆడిన ఉపయోగపడే పరుగులు జతచేయలేకపోయాడు.  

కార్తీక్‌ ఆదుకుంటే... రసెల్‌ అదరగొట్టాడు... 
51 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయిన దశలో దినేశ్‌ కార్తీక్‌ జట్టును ఆదుకున్నాడు. శుబ్‌మన్‌ గిల్‌ (17 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌) సహకారంతో జట్టు స్కోరును 14వ ఓవర్లో 100 పరుగులకు చేర్చాడు. అయితే జోరుపెంచిన గిల్‌కు అర్చర్‌ ముకుతాడు వేశాడు. ఈ దశలో రసెల్‌ క్రీజులోకి వచ్చాడు. రాగానే సిక్సర్లతో విజృంభించాడు. స్కోరు పట్టపగ్గాల్లేకుండా సాగింది. అర్ధసెంచరీ చేసిన తర్వాత కార్తీక్‌ కూడా నిష్క్రమించగా... రసెల్‌ జట్టు స్కోరు పెంచే బాధ్యతని తన భుజాన వేసుకుని పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచాడు. రసెల్‌ వీరవిహారంతో నైట్‌రైడర్స్‌ రెండో సగం ఓవర్లలో 106 పరుగులు చేయగలిగింది. 

లక్ష్యం చేరని నిలకడ... 
లక్ష్యం కష్టసాధ్యమైంది కాదు... అంత సులువైందీ కాదు... కానీ రాజస్తాన్‌ మాత్రం నిలకడగా అడుగులు వేసింది. కడదాకా వికెట్లను కాపాడుకుంది. 5 ఓవర్ల వరకు అసలు వికెటే కోల్పోకుండా 47 పరుగులు చేసింది. 10 ఓవర్లు ముగిసేసరికి ఒకటే వికెట్‌ కోల్పోయి 87 పరుగులు చేసింది. ఇక గెలిచేందుకు మరో 10 ఓవర్లలో 83 పరుగులు చేస్తే చాలు. చేతిలో 9 వికెట్లున్న జట్టుకు ఇది చాలా సులువైనపని. కానీ రాజస్తాన్‌ లక్ష్యానికి అల్లంత దూరాన్నే ఆగిపోయింది. ఎక్కడా ఎదురుదాడికి దిగలేదు. ఎవరూ మెరిపించే సాహసం చేయలేదు. గెలిపించేందుకు కష్టపడలేదు. చివరకు 15 ఓవర్లలో 111/2 స్కోరుతో మోయలేని భారాన్ని మీదేసుకొని మూల్యం చెల్లించుకుంది. ఆఖరి 10 ఓవర్లలో 57 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్‌ రహానే, రాహుల్‌ త్రిపాఠి (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు)లిద్దరు కలిసి తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్‌కు జతయిన శామ్సన్‌ కూడా ఫిఫ్టీతో జట్టును నడిపించాడు. రహానే, శామ్సన్‌లు కూడా రెండో వికెట్‌కు 62 పరు గులు జోడించారు. రహానే ఔటయ్యే సమయానికి జట్టు స్కోరు 109/2. గెలిచేందుకు రాయల్స్‌కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ కీలక సమయంలో ప్రసిధ్‌ కృష్ణ (1/28), రసెల్‌ (0/22), పీయూశ్‌ చావ్లా (2/24), కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో క్రీజ్‌లో క్లాసెన్‌ (18 బంతుల్లో 18 నాటౌట్‌; 1 ఫోర్‌) ఉన్నా ఏమీ చేయలేకపోయాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement