'చహల్‌' చల్‌ | India beat England to win third T20 international and series | Sakshi
Sakshi News home page

'చహల్‌' చల్‌

Published Thu, Feb 2 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

'చహల్‌' చల్‌

'చహల్‌' చల్‌

6 వికెట్లు తీసిన లెగ్‌ స్పిన్నర్‌
చివరి టి20లో భారత్‌ సంచలన విజయం
75 పరుగులతో ఇంగ్లండ్‌ చిత్తు
2–1తో సిరీస్‌ కోహ్లి సేన సొంతం   


‘ఆరో నంబర్‌’ ఆటగాడు అద్భుతం చేశాడు. తన మణికట్టు మాయాజాలం చూపిస్తూ చిన్నస్వామి మైదానంలో చరిత్రను తిరగరాశాడు. గుగ్లీలు, ఫ్లిప్పర్లతో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను విలవిల్లాడించిన యజువేంద్ర చహల్‌ భారత జట్టుకు ఆహా అనిపించే గెలుపును అందించాడు. తన తొలి ఓవర్లో వికెట్‌తో శుభారంభం... మూడో ఓవర్లో వరుస రెండు బంతుల్లో కీలక బ్యాట్స్‌మెన్‌ను అవుట్‌ చేసి ప్రత్యర్థి కోట బద్దలు... చివరి ఓవర్లో మరో మూడు వికెట్లు... గతంలో ఏ భారత బౌలర్‌కూ సాధ్యం కాని రీతిలో ఆరు వికెట్లతో లెగ్‌స్పిన్నర్‌ చహల్‌ ఆటాడుకున్నాడు. టెస్టులు, వన్డేల బాటలోనే ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌ కూడా గెలిచి భారత్‌ తమ విజయాల జోరును పరిపూర్ణం చేయగా, ఇంగ్లండ్‌ నిరాశతో పర్యటనను ముగించింది.

ముందుగా ధోని, రైనా మెరుపులకు తోడు యువరాజ్‌ పవర్‌ కూడా జత కలిసి భారత్‌ 202 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. అయితే మైదానం చిన్నది, గత రికార్డు వల్ల ఇది అసాధ్యమైన లక్ష్యంలా అనిపించలేదు. ఒకదశలో 119/2తో ఇంగ్లండ్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ సమయంలో చహల్‌ దండయాత్ర మొదలైంది. అతనికి తోడుగా బుమ్రా నిలిచాడు. అంతే... ఇంగ్లండ్‌ ఆటగాళ్లు అవుటయ్యేందుకు క్యూలో నిలబడ్డారు. 19 బంతుల వ్యవధిలో కేవలం 8 పరుగులకు తమ చివరి 8 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్‌ తలవంచింది. ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ సున్నాకే పరిమితమైన స్థితిలో ఆ జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకోగా, భారత ఆటగాళ్ల సంబరాలకు అంతులేకుండా పోయింది.

బెంగళూరు: తొలి రెండు టి20ల్లో అంతంత మాత్రం ప్రదర్శన కనబర్చిన భారత్‌ కీలకమైన చివరి మ్యాచ్‌లో జూలు విదిల్చింది. భారీ స్కోరు చేయడంతో పాటు ప్రత్యర్థిని కుప్పకూల్చి సిరీస్‌ను సొంతం చేసుకుంది. బుధవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో టి20లో భారత్‌ 75 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. సురేశ్‌ రైనా (45 బంతుల్లో 63; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), మహేంద్ర సింగ్‌ ధోని (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. రెండో వికెట్‌కు రాహుల్‌తో 37 బంతుల్లో 61 పరుగులు జోడించిన రైనా, ఆ తర్వాత మూడో వికెట్‌కు ధోనితో 37 బంతుల్లో 55 పరుగులు జత చేశాడు. ఆ తర్వాత చహల్‌ (6/25) అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ 16.3 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. రూట్‌ (37 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మోర్గాన్‌ (21 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2–1తో నెగ్గింది. చహల్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్, సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

పరుగుల మోత...
సిరీస్‌లో వరుసగా మూడోసారి కూడా టాస్‌ ఓడిన భారత్‌ మూడోసారి కూడా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో ఆడిన మనీశ్‌ పాండే స్థానంలో రిషభ్‌ పంత్‌కు కెరీర్‌లో తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కింది. రెండో ఓవర్‌ తొలి బంతికే లేని పరుగు కోసం ప్రయత్నించి రాహుల్‌తో సమన్వయ లోపంతో కోహ్లి (2) రనౌట్‌ కావడంతో భారత్‌కు షాక్‌ తగిలింది. అయితే ఈ దశలో రైనా, రాహుల్‌ (18 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి జోరు తగ్గకుండా బ్యాటింగ్‌కు కొనసాగించారు. చాలా కాలం తర్వాత తనదైన శైలిలో ఆడిన రైనా సిక్సర్లతో చెలరేగాడు. జోర్డాన్‌ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో 14 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 53 పరుగులకు చేరింది. అలీ వేసిన బంతిని స్టేడియం బయటకు కొట్టిన తర్వాత మరుసటి ఓవర్లో రాహుల్‌ బౌల్డ్‌ కావడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. స్టోక్స్‌ వేసిన ఈ బంతి ‘నోబాల్‌’ అయినా, అంపైర్లు దానిని గుర్తించలేకపోయారు. మరోవైపు రైనా దూకుడు కొనసాగింది. రషీద్‌ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్‌తో 39 బంతుల్లోనే రైనా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో ధోని మెరుపు షాట్లు భారత్‌కు భారీ స్కోరు అందించాయి. యువరాజ్‌ (10 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్సర్లు) కూడా క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు శివాలెత్తాడు. తొలి పది ఓవర్లలో 78 పరుగులు చేసిన భారత్, తర్వాతి పది ఓవర్లలో 124 పరుగులు చేయడం విశేషం.  

టపటపా...
ఛేదనలో ఇంగ్లండ్‌ ఆరంభంలోనే బిల్లింగ్స్‌ (0) వికెట్‌ కోల్పోయింది. అనంతరం రాయ్‌ (23 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రూట్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ధాటిగా ఆడిన వీరిద్దరు రెండో వికెట్‌కు 29 బంతుల్లోనే 47 పరుగులు జోడించిన తర్వాత మిశ్రా బౌలింగ్‌లో రాయ్‌ వెనుదిరిగాడు. రూట్‌ జాగ్రత్తగా ఆడగా, మోర్గాన్‌ చెలరేగిపోయాడు. ఈ దశలో ఇంగ్లండ్‌ లక్ష్యం దిశగా మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే చహల్‌ వరుస బంతుల్లో వీరిద్దరిని అవుట్‌ చేయడంతో మ్యాచ్‌ ఒక్కసారిగా భారత్‌ వైపు తిరిగింది. ఆ తర్వాత బుమ్రా కూడా విజృంభించడంతో కొద్ది సేపటికే భారత జట్టు విజయం ఖాయమైంది.

అసహనం నుంచి అభినందనల వరకు...
తన తొలి బంతికి సిక్సర్‌ ఇచ్చిన చహల్‌ మూడో బంతికే వికెట్‌ తీసి భారత్‌కు శుభారంభం అందించాడు. అయితే మరుసటి బంతికే సునాయాస రనౌట్‌ అవకాశాన్ని అతను పోగొట్టాడు. కవర్స్‌ దిశగా రూట్‌ బంతిని ఆడగా, నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌ నుంచి రాయ్‌ చాలా ముందుకు వచ్చేశాడు. కోహ్లి అద్భుత ఫీల్డింగ్‌తో బౌలర్‌కు బంతిని అందించాడు. అయితే రెప్పపాటులో పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయిన చహల్‌ దానిని కీపర్‌ వైపు విసిరాడు. దాంతో రాయ్‌ రనౌట్‌ కాకుండా తప్పించుకున్నాడు. ఈ సమయంలో జట్టు మొత్తం అతనిపై అసహనం వ్యక్తం చేసింది.  కానీ చివర్లో వరుస వికెట్లతో జట్టును గెలిపించిన క్షణాన అదే సహచరుల అభినందనల వర్షంలో అతను తడిసిముద్దవడం విశేషం.

బ్రాడ్‌... కాదు కాదు జోర్డాన్‌!
భారత్‌ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌... జోర్డాన్‌ వేసిన ఈ ఓవర్‌ తొలి బంతిని ధోని సింగిల్‌ తీయడంతో యువరాజ్‌కు స్ట్రైకింగ్‌ వచ్చింది. తర్వాతి నాలుగు బంతులు అతను ఆడిన తీరు చూస్తే పదేళ్ల క్రితంనాటి యువీ గుర్తుకొచ్చాడు. ప్రతీ బంతిని తుత్తునియలు చేస్తూ విరుచుకుపడిన యువరాజ్‌ వరుసగా 6, 6, 4, 6 బాదడంతో చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. ఓవర్‌లో ఆరు సిక్సర్లు కాకపోయినా, నాడు బ్రాడ్‌ను ఉతికేసిన తరహాలోనే ఈ సారి జోర్డాన్‌పై యువీ విరుచుకుపడ్డాడు.

అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీసిన రెండో బౌలర్‌ చహల్‌. టి20ల్లో భారత్‌ తరఫున ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. గతంలో శ్రీలంక స్పిన్నర్‌ అజంతా మెండిస్‌ మాత్రమే రెండుసార్లు ఆరేసి వికెట్లు తీశాడు.

ఎట్టకేలకు అర్ధ సెంచరీ...
75 మ్యాచ్‌లు, 65 ఇన్నింగ్స్‌లు... పదేళ్ల టి20 కెరీర్‌లో వరల్డ్‌ కప్‌ మొదలు పలు చిరస్మరణీయ విజయాలు. కానీ ధోని ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క అర్ధసెంచరీ కూడా లేదు. ఈ మ్యాచ్‌కు ముందు అతని అత్యధిక స్కోరు 48 పరుగులు మాత్రమే. చివర్లోనే వచ్చి కొన్ని ధనాధన్‌ షాట్లతో మురిపించడమే తప్ప సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలిచే అవకాశం రాకపోవడం కూడా అందుకు ఒక కారణం. అయినా సరే ధోనిలాంటి హిట్టర్‌కు అదో వెలితిగానే ఉండిపోయింది. ఇప్పుడు మొత్తానికి అతను దానిని సాధించాడు. ఎనిమిదో ఓవర్లోనే క్రీజ్‌లోకి వచ్చిన ఈ మాజీ కెప్టెన్‌ తన పాత ఆటను చూపిస్తూ సాంప్రదాయేతర షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆరంభంలోనే రెండు సిక్సర్లు బాదిన అతను, స్టోక్స్‌ ఓవర్లో రెండు చూడచక్కటి బౌండరీలు కొట్టాడు. 32 బంతుల్లోనే అతను హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అర్ధ సెంచరీ చేయడానికి ఇన్ని మ్యాచ్‌లు (76) ఎవరూ తీసుకోలేదు. మ్యాచ్‌కు ముందు ధోనిని భారత జట్టు సభ్యులంతా కలిసి ఘనంగా సత్కరించారు. కెప్టెన్‌గా అతను సాధించిన నాలుగు గొప్ప విజయాలను సూచిస్తూ నాలుగు స్టార్‌లు ఉండేలా ప్రత్యేకంగా చెక్కించిన ఫలకాన్ని జ్ఞాపికగా అందజేశారు.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: కోహ్లి (రనౌట్‌) 2; రాహుల్‌ (బి) స్టోక్స్‌ 22; రైనా (సి) మోర్గాన్‌ (బి) ప్లంకెట్‌ 63; ధోని (సి) రషీద్‌ (బి) జోర్డాన్‌ 56; యువరాజ్‌ (సి) బట్లర్‌ (బి) మిల్స్‌ 27; పంత్‌ (నాటౌట్‌) 5; పాండ్యా (రనౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 202.

వికెట్ల పతనం: 1–4; 2–65; 3–120; 4–177; 5–191; 6–202. బౌలింగ్‌:  మిల్స్‌ 4–0–31–1; జోర్డాన్‌ 4–0–56–1; ప్లంకెట్‌ 2–0–22–1; స్టోక్స్‌ 4–0–32–1; అలీ 4–0–30–0; రషీద్‌ 2–0–23–0.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) ధోని (బి) మిశ్రా 32; బిల్లింగ్స్‌ (సి) రైనా (బి) చహల్‌ 0; రూట్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 42; మోర్గాన్‌ (సి) పంత్‌ (బి) చహల్‌ 40; బట్లర్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 0; స్టోక్స్‌ (సి) రైనా (బి) చహల్‌ 6; అలీ
(సి) కోహ్లి (బి) చహల్‌ 2; ప్లంకెట్‌ (బి) బుమ్రా 0, జోర్డాన్‌ (స్టంప్డ్‌) ధోని (బి) చహల్‌ 0; రషీద్‌ (నాటౌట్‌) 0; మిల్స్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.3 ఓవర్లలో ఆలౌట్‌) 127

వికెట్ల పతనం: 1–8; 2–55; 3–119; 4–119; 5–119; 6–123, 7–127, 8–127, 9–127, 10–127.

బౌలింగ్‌: నెహ్రా 3–1–24–0, చహల్‌ 4–0–25–6, బుమ్రా 2.3–0–14–3, మిశ్రా 4–0–23–1; పాండ్యా 2–0–17–0, రైనా 1–0–22–0.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement