రష్యా నేత పుతిన్ అధ్యక్ష ఎన్నికల్లో సాధించిన ఘన విజయం 2024 వరకూ ఆయన పదవిలో కొనసాగడానికి అవకాశమిచ్చింది. రష్యా రాజ్యాం గం ప్రకారం వరుసగా రెండు సార్లు మించి ఏ నేతా అధ్యక్ష పదవి చేపట్టకూడదు. దాని ప్రకారం 2024 ఎన్నికలు వదిలేసి 2030లో ఆయన అధ్యక్ష పదవికి పోటీచేయొచ్చు.
వ్యూహ రచనలో దిట్ట!
నిఘా సంస్థ కేజీబీలో ఓ అధికారి స్థాయి నుంచి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ సెనెట్ వరకూ సాగిన పుతిన్ ప్రయాణం అసామాన్యం. పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న మొదటి ఎనిమిదేళ్లలో (2000–2008) రష్యా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. ఆ రోజుల్లో భారీగా పెరిగిన ముడి చమురు, సహజ వాయువు ధరల ఫలితంగా సంపన్నులు సహా రష్యన్ల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి.
దీంతో ఆయన తన అధికారం సుస్థిరం చేసుకోగలిగారు. ప్రభుత్వంపై తిరుగులేని పట్టు సంపాదించారు.మొదట రాజకీయ పలుకుబడి ఉన్న బడా పారిశ్రామికవేత్తలను, తర్వాత ప్రతిపక్ష నేతలను నిరాధార ఆరోపణలతో దెబ్బతీశారు. వారిలో కొందరిని దేశం నుంచి బహిష్కరించారు. రష్యాలో రాజకీయాలు లేని ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు పుతిన్ చేసిన ప్రయత్నం ఫలించింది. ‘ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తా.
మీరు రాజకీయాలకు దూరంగా ఉండండి’ అన్న పుతిన్ మాటలను సామాన్య ప్రజానీకం, కార్మికవర్గం నమ్మడంతో పుతిన్ అధికారానికి అడ్డంకులు లేకుండా పోయాయి. అయితే, గత ఆరేళ్లలో పాశ్చాత్యదేశాల ఆంక్షల ఫలితంగా రష్యా ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. అయినప్పటికీ సిరియా అంతర్యుద్ధంలో జోక్యం, క్రిమియా ఆక్రమణ ద్వారా దేశాన్ని పుతిన్ అగ్రరాజ్యం దిశగానే నడిపిస్తున్నారని రష్యన్లు విశ్వసిస్తున్నారు. కాగా, పుతిన్‌కు తొలినాళ్లలో ప్రజాదరణ ఉన్నప్పటికీ ఇప్పుడు జరిగే ప్రతీ ఎన్నికల్లోనూ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు, పరిశీలకులు ఆరోపిస్తున్నారు.
అణచివేయడంలో ఘటికుడు
ప్రధాన ప్రత్యర్థులను అణచివేయడం, అక్రమంగా జైలుకు పంపడం, ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హులను చేయడం పుతిన్‌కు కొట్టిన పిండి. 1952లో లెనిన్‌గ్రాడ్‌లో జన్మించిన పుతిన్ సెయింట్ పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుకున్నారు. 1975లో కేజీబీలో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉద్యోగంలో చేరి వేగంగా లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. రాజకీయాలపై ఆసక్తితో 1991లో ఉద్యోగానికి రాజీనామా చేసి మకాం రాజధాని మాస్కోకు మార్చారు. యునైటెడ్ రష్యా పార్టీ నేత అయిన పుతిన్‌కు ప్రధానిగా తొలి అవకాశం అధ్యక్షుడు బోరిస్ ఎలిత్సిన్ ఇచ్చారు. 1999లో అప్పటి ప్రధాని సెర్జీ స్టెపాషిన్‌ను బర్తరఫ్ చేసి పుతిన్‌ను ప్రధానమంత్రిగా ప్రమోట్ చేశారు.
అదే ఏడాది డిసెంబర్‌లో రాజీనామా చేసిన ఎలిత్సిన్ తాత్కాలిక అధ్యక్షునిగా పుతిన్‌ను నియమించారు. 2000 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ తన సమీప కమ్యూనిస్ట్ ప్రత్యర్థి గెనడీ జ్యుగనోవ్‌పై విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో 72 శాతం ఓట్లు సాధించి రెండోసారి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. 2008లో ప్రధానిగా నియమితులయ్యారు. 2011లో అధ్యక్ష పదవీకాలా న్ని నాలుగు నుంచి ఆరేళ్లకు పెంచారు. ఈ చట్ట సవరణ చేశాక 2012లో పుతిన్ మూడోసారి అధ్యక్షపదవికి పోటీచేసి 64 శాతం ఓట్లతో గెలిచారు. తాజా విజయంతో పుతిన్ నియంత జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాను ఎక్కువ కాలం పాలించిన నేతగా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment