మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పుతిన్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేలా కుటుంబ సభ్యులతో పాటు వైద్యులు సైతం ఒత్తిడి చేస్తున్నారని రష్యాలోని ఓ ప్రముఖ పత్రిక తన కథనంలో పేర్కొంది. 68 ఏళ్ల పుతిన్ పార్కిన్సన్ (మెదడులోని నాడీ వ్యవస్థ దెబ్బతినడం) వ్యాధితో బాధపడుతున్నారని, ఈ సమయంలో పదవీ బాధ్యతలను నిర్వర్తించడం అంత సరైనది కాదని వైద్యులు సూచించినట్లు తెలిపింది. అయితే బతికున్నంతకాలం అధ్యక్ష పదవిలో కొనసాగే విధంగా రాజ్యాంగంలో సవరణలు తీసుకువచ్చిన పుతిన్.. అనుహ్యంగా తప్పుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే అనారోగ్యం కారణంగా ఆయన తన విధులను ఇంటి నుంచే నిర్వర్తిస్తున్నారని, భవిష్యత్‌లో వ్యాధి మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత 20 ఏళ్లుగా రష్యాను ఏకఛత్రాధిపత్యం కిందపాలిస్తున్న పుతిన్.. వ్యాధి కారణంగా పదవీ బాధ్యత నుంచి తప్పుకుంటారన్న వార్తలను ఆ దేశ ప్రజలు కొట్టిపారేస్తున్నారు.పుతిన్ తొలుత 1999 నుంచి 2000 వరకు ప్రధాన మంత్రిగా కొనసాగారు. అనంతరం 2000 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా, 2012 వరకు ప్రధానమంత్రిగా కొనసాగారు. ఆ తరువాత మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పెద్ద ఎత్తున రాజ్యాంగ సవరణలు చేపట్టి.. బతికునేంత వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగే విధంగా మార్పులు చేశారు. పుతిన్ ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం 2024లో ముగియనుంది. ఆ తర్వాతా మరో 12ఏళ్లు తనే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణలను రష్యా పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది. మాజీ కేజీబీ అధికారి అయిన వ్లాదిమిర్ పుతిన్ 20 ఏళ్లుగా రష్యా రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తుండటం తెల్సిందే.
సోవియట్ యూనియన్ (యూఎస్‌ఎస్‌ఆర్) విచ్ఛిన్నం అనంతరం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రష్యాను ప్రగతిపథంలో నడిపించడంలో పుతిన్ విజయవంతం అయ్యారు. ఆ తరువాత దేశంలో చోటుచేసుకున్న రాజకీయ పరిస్థితుల కారణంగా పార్లమెంట్ ఎన్నికల్లో కనీస పోటీ కూడా లేకుండా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో పుతిన్ అర్థాంతరంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారనే వార్తలు ఆ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా వార్తలపై సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి.. పదవిలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే తాజా పుతిన్ రాజీనామా వార్తలపై అధ్యక్ష కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
Comments
Please login to add a commentAdd a comment