హసీనా నాలుగోసారి | Hasina wins Bangladesh elections as opposition rejects polls | Sakshi
Sakshi News home page

హసీనా నాలుగోసారి

Published Tue, Jan 1 2019 5:11 AM | Last Updated on Tue, Jan 1 2019 5:30 AM

Hasina wins Bangladesh elections as opposition rejects polls - Sakshi

ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ 11వ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని షేక్‌ హసీనా(71) నేతృత్వంలోని మహాకూటమి ఘనవిజయం సాధించింది. ఆదివారం ముగిసిన ఎన్నికల్లో మొత్తం 300 స్థానాలకు గానూ హసీనాకు చెందిన అవామీలీగ్, దాని మిత్రపక్షాలు 288 చోట్ల విజయదుందుభి మోగించాయి. తాజా ఫలితాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ప్రధానిగా వరుసగా మూడోసారి, మొత్తంగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టేందుకు హసీనాకు మార్గం సుగమమైంది. కాగా, ఈ ఎన్నికల్లో విపక్ష కూటమి జాతీయ ఐక్య ఫ్రంట్‌(ఎన్‌యూఎఫ్‌) కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో అధికార కూటమి 82 శాతం దక్కించుకోగా, విపక్షాలకు 15 శాతం ఓట్లు లభించాయి. 2008లో జరిగిన ఎన్నికల్లో 263 సీట్లు సాధించి రికార్డు సృష్టించిన హసీనా ఈసారి ఏకంగా 288 స్థానాలు కొల్లగొట్టి ఆ రికార్డును తిరగరాశారు.

ఫలితాలను అంగీకరించబోం: విపక్షాలు
బంగ్లాదేశ్‌ పార్లమెంటు ఎన్నికల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని విపక్షాల కూటమి జాతీయ ఐక్య ఫ్రంట్‌(ఎన్‌యూఎఫ్‌) ఆరోపించింది. ఈ ఫలితాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ ఎన్నికలను రద్దుచేసి పారదర్శకంగా, తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) డిమాండ్‌ చేసింది.  

మళ్లీ ఎన్నికల ప్రసక్తే లేదు: ఈసీ
బంగ్లాదేశ్‌లో పోలింగ్‌ సందర్భంగా భారీగా అవకతవకలు, రిగ్గింగ్‌ చోటుచేసుకున్నాయన్న విపక్షాల ఆరోపణలను ఎన్నికల సంఘం చీఫ్‌(సీఈసీ) కె.ఎం.నూరల్‌ హుడా ఖండించారు. పోలింగ్‌కు ముందురోజు రాత్రే చాలాచోట్ల బ్యాలెట్‌ బాక్సులు నిండిపోయాయన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో నైరుతి గోపాల్‌గంజ్‌ నుంచి పోటీచేసిన ప్రధాని హసీనాకు 2,29,539 ఓట్లు రాగా, ఆమెపై పోటీచేసిన ఎన్‌యూఎఫ్‌ అభ్యర్థికి కేవలం 123 ఓట్లు వచ్చాయని తెలిపారు.  

హసీనాకు మోదీ ఫోన్‌..
బంగ్లాదేశ్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన షేక్‌ హసీనాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హసీనాకు సోమవారం ఫోన్‌చేసిన మోదీ.. బంగ్లాదేశ్‌ అభివృద్ధికి భారత్‌ మద్దతు కొనసాగుతుందని వెల్లడించారు. హసీనా నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌ అభివృద్ధి విషయంలో భారత్‌ అండగా ఉంటుందని ప్రకటించారు.


ఏక పార్టీ దిశగా అడుగులు
సైనిక కుట్రలో చనిపోకముందు హసీనా తండ్రి, బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు ముజీబుర్‌  దేశంలో ప్రతిపక్షాలను దెబ్బతీసి ఏకపార్టీ వ్యవస్థను నెలకొల్పేందుకు యత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ముజీబుర్‌ తర్వాత బంగ్లాదేశ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జియావుర్‌ రెహమాన్, ఎర్షాద్‌లు సైన్యానికి చెందిన వ్యక్తులు. వీరూ తమ హయాంలో  ప్రజాస్వామ్యం వేళ్లూనుకోకుండా  ప్రయత్నించారు. సైనిక పాలన ముగిశాక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బీఎన్పీ చీఫ్‌ ఖలీదా వైఖరీ ఇదే. మూడుసార్లు బంగ్లాదేశ్‌ ప్రధానిగా పనిచేసిన ఖలీదా ప్రతీసారి అవామీ లీగ్‌ను అణిచేందుకు యత్నించారు. హసీనా సైతం ప్రజాస్వామ్యం ఉనికిని చెరిపేసేలా వ్యవహరించడం గమనార్హం. ఖలీదాను అవినీతి ఆరోపణలపై జైలు శిక్షపడేలా హసీనా చేశారు.

మొదటి నుంచి పెత్తందారీ ధోరణులే!
1996లో మొదటిసారి ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచీ ప్రతిపక్షాలను, పోటీదారులను హసీనా సహించిన దాఖలాలు లేవు. తన ప్రత్యర్థి ఖలీదా బాటలోనే పయనిస్తూ బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం కావడానికి ఆమె కారకులయ్యారు. బీఎన్పీ మిత్రపక్షమైన ముస్లిం ఛాందసవాద సంస్థ జమాతే ఇస్లామీని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించారు. 1971 యుద్ధ నేరాలపై ఈ సంస్థ నేతలపై విచారణ జరిపించి శిక్షలు అమలు చేశారు. కొందరిని ఉరితీసి, మరి కొందరిని జైళ్లకు పంపారు. జమాతే సంస్థను ఖలీదా వాడుకున్నట్టే మరో ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ హిఫాజుతుల్‌ ఇస్లాంను హసీనా తనకు అనుగుణం గా వినియోగించుకుంటున్నారు.

అవామీలీగ్‌కు ప్రతిపక్షమే లేకుండా చేయడమే లక్ష్యంగా ఆమె అధికారం ప్రయోగిస్తున్నారు. ఇంటర్నెట్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే రచయితలను చంపిన వారిని పట్టుకునే విషయంలో హసీనా ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. అయితే నిరుపేద దేశంగా, బలహీన ఆర్థిక వ్యవస్థగా పేరొందిన బంగ్లాదేశ్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టించడం హసీనా విజయంగా చెప్పొచ్చు. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటం, ఆతర్వాత రాజకీయా పరిస్థితుల నేపథ్యంలో హసీనా భారత్‌తో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. హసీనా చేపట్టిన అభివృద్ధి పనులకు బంగ్లా ప్రజలు పట్టం కట్టారని మోదీ ప్రశంసించారు.  

విద్యార్థి దశ నుంచే...
బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ప్రధాని హసీనా తీసుకున్న చర్యలే కారణమని ఆమె సన్నిహితులు చెబుతుంటే, ప్రతిపక్షాలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారని వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. హసీనా.. బంగ్లాదేశ్‌ తొలి అధ్యక్షుడు ముజీబుర్‌ రెహమాన్‌ కుమార్తె. తూర్పుపాకిస్తాన్‌ (ఇప్పటి బంగ్లాదేశ్‌)లోని తుంగిపరాలో 1947, సెప్టెంబర్‌ 28న జన్మించారు. ఢాకాలోని ఈడెన్‌ కాలేజీలో విద్యార్థి రాజకీయాల్లో హసీనా చురుగ్గా పాల్గొనేవారు. 1975, ఆగస్టు 15న ఆమె తండ్రి రెహమాన్, మిగిలిన కుటుంబ సభ్యులను ఆర్మీలోని ఓ వర్గం దాడిచేసి చంపేసింది. విదేశాల్లో ఉండటంతో హసీనా ప్రాణాలతో బతికిపోయారు. తర్వాత ఐదేళ్ల పాటు భారత్‌లోనే ప్రవాస జీవితం గడిపారు. 1981లో ఆమె అవామీలీగ్‌ పార్టీ అధ్యక్షురాలయ్యారు.

బంగ్లాదేశ్‌లో సైనిక పాలనను పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించడంతో హసీనాకు మద్దతుదారులు క్రమంగా పెరిగారు. ఇదే సమయంలో ఆమెను సైన్యం గృహనిర్బంధంలో ఉంచింది. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్పీ) చీఫ్‌ జియా ఖలీదాతో కలిసి హసీనా ప్రజాస్వామ్య పోరాటాన్ని తీవ్రతరం చేయడంతో చివరికి 1990, డిసెంబర్‌లో అధ్యక్షుడిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ హుస్సేన్‌ మొహమ్మద్‌ ఎర్షాద్‌ రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్‌లో సైనిక పాలనకు తెరపడింది. అయితే కాలక్రమంలో హసీనా, ఖలీదా రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. అణు శాస్త్రవేత్త అయిన ఎం.ఎ.వాజెద్‌ను హసీనా 1968లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జోయ్, కుమార్తె సైమా ఉన్నారు. 2009లో హసీనా భర్త కన్నుమూశారు. హసీనా హయాంలోనే బంగ్లాదేశ్‌ పౌరుల తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. 2017లో దేశ జీడీపీ 250 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement