ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 300 పార్లమెంట్ స్థానాలకు గాను 299 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, అవామీ లీగ్ ఏకంగా 223 స్థానాలు సొంతం చేసుకుంది. ఎన్నికలు అదివారం జరగ్గా, సోమవారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తుది ఫలితాలు వెలువడ్డాయి. పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షమైన జతియా పార్టీ 11 సీట్లు గెలుచుకుంది.
బంగ్లాదేశ్ కల్యాణ్ పార్టీ కేవలం ఒక స్థానంలో గెలుపొందింది. 62 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అలాగే జతియా సమాజ్ తాంత్రిక్ దళ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. అవామీ లీగ్ అధినేత, ప్రధానమంత్రి షేక్ హసీనా గోపాల్‌గంజ్–3 నియోజకవర్గం నుంచి అఖండ విజయం సాధించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆమె ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.
హసీనా రికార్డు
76 ఏళ్ల షేక్ హసీనా 2009 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వరుసగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. మొత్తంగా ఆమె ప్రధాని అవుతుండడం ఇది ఐదోసారి. బంగ్లా చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించబోతున్నారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్టతో పాటు మరో 15 పార్టీలు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఈసారి కేవలం 41.8 శాతం పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 80 శాతానికి పైగా నమోదవడం విశేషం.
ఇండియా గొప్ప మిత్రదేశం
భారత్ తమకు గొప్ప మిత్రదేశమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కొనియాడారు. ఎన్నికల్లో విజయం అనంతరం ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇరుగుపొరుగు దేశాలైన భారత్–బంగ్లాదేశ్ ఎన్నో సమస్యలను కలిసి పరిష్కరించుకున్నాయని చెప్పారు. 1971, 1975లో భారత్ తమకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. తనకు, సోదరికి, కుటుంబ సభ్యులకు ఆశ్రయం కలి్పంచిందని అన్నారు. ఇండియాను తమ పక్కింటిలాంటి మిత్రదేశంగా భావిస్తామని తెలిపారు. ఇండియాతో తమకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్‌తో సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment