బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భవనంలో గతంలో పనిచేసిన సేవకునికి బాగోతం సంచలనంగా మారింది. ఆ సేవకుని ఆస్తుల విలువ దాదాపు రూ.284 కోట్లని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. గతంలో ఆ సేవకుడు ప్రధాని హసీనా భవనానికి వచ్చే అతిథులకు నీరు, టీ, స్నాక్స్ అందించేవాడని సమాచారం.
ఢాకా ట్రిబ్యూన్ తెలియజేసిన వివరాల ప్రకారం ఆ సేవకుడని పేరు జహంగీర్ ఆలం. ఆయనపై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. పీఎం షేక్ హసీనా కార్యాలయంతోపాటు ఆమె ఇంట్లో పనిచేసే సమయంలో ఆయన పలువురి నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వివిధ పనులు ఇప్పిస్తానంటూ చాలామంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవాడని సమాచారం. ఆ సేవకుడు ప్రైవేట్ హెలికాప్టర్‌లో ప్రయాణాలు సాగించేవాడని తెలుస్తోంది. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో పీఎం హసీనా వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా జహంగీర్ అమెరికాకు వెళ్లపోయాడని తెలుస్తోంది.
బంగ్లాదేశ్‌కు చెందిన మాజీ ఆర్మీ చీఫ్, పోలీసు అధికారి, పన్ను విభాగపు అధికారి, పలువురు ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో ప్రధాని షేక్ హసీనా ఇంటిలో పనిచేసిన మాజీ సేవకుని బాగోతం కూడా బయట పడింది. కాగా ప్రధాని షేక్ హసీనాకు కోట్లకు పడగలెత్తిన సేవకుని గురించి తెలియగానే ఆశ్చర్యపోయారు. ఒక సాధారణ బంగ్లాదేశీయుడు ఇంత సంపదను కూడబెట్టడానికి చాలా ఏళ్లు పడుతుందని, అతని విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు. ప్రపంచ బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం రూ. 2.11 లక్షలుగా ఉంది.
ఈ ఉదంతంపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)అధికార ప్రతినిధి వహిదుజ్జామాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఇంటిలోని పనివానికే భారీ ఆస్తులు ఉన్నప్పుడు యజమాని ఆస్తి ఎంతో ఊహించలేమని వ్యాఖ్యానించారు. ఆ సేవకుడిని ఇంకా అరెస్టు చేయలేయకపోవడం శోచనీయమన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ అజీజ్ అహ్మద్‌పై కూడా అవినీతి ఆరోపణలు రాగా, సంబంధిత అధికారులు అజీజ్‌కు ఆస్తులను జప్తు చేశారు. అతని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment