servant
-
కోట్లకు పడగలెత్తిన బంగ్లాదేశ్ ప్రధాని ఇంటి సేవకుడు
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భవనంలో గతంలో పనిచేసిన సేవకునికి బాగోతం సంచలనంగా మారింది. ఆ సేవకుని ఆస్తుల విలువ దాదాపు రూ.284 కోట్లని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. గతంలో ఆ సేవకుడు ప్రధాని హసీనా భవనానికి వచ్చే అతిథులకు నీరు, టీ, స్నాక్స్ అందించేవాడని సమాచారం.ఢాకా ట్రిబ్యూన్ తెలియజేసిన వివరాల ప్రకారం ఆ సేవకుడని పేరు జహంగీర్ ఆలం. ఆయనపై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. పీఎం షేక్ హసీనా కార్యాలయంతోపాటు ఆమె ఇంట్లో పనిచేసే సమయంలో ఆయన పలువురి నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వివిధ పనులు ఇప్పిస్తానంటూ చాలామంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవాడని సమాచారం. ఆ సేవకుడు ప్రైవేట్ హెలికాప్టర్లో ప్రయాణాలు సాగించేవాడని తెలుస్తోంది. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో పీఎం హసీనా వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా జహంగీర్ అమెరికాకు వెళ్లపోయాడని తెలుస్తోంది.బంగ్లాదేశ్‌కు చెందిన మాజీ ఆర్మీ చీఫ్, పోలీసు అధికారి, పన్ను విభాగపు అధికారి, పలువురు ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో ప్రధాని షేక్ హసీనా ఇంటిలో పనిచేసిన మాజీ సేవకుని బాగోతం కూడా బయట పడింది. కాగా ప్రధాని షేక్ హసీనాకు కోట్లకు పడగలెత్తిన సేవకుని గురించి తెలియగానే ఆశ్చర్యపోయారు. ఒక సాధారణ బంగ్లాదేశీయుడు ఇంత సంపదను కూడబెట్టడానికి చాలా ఏళ్లు పడుతుందని, అతని విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు. ప్రపంచ బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం రూ. 2.11 లక్షలుగా ఉంది.ఈ ఉదంతంపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)అధికార ప్రతినిధి వహిదుజ్జామాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఇంటిలోని పనివానికే భారీ ఆస్తులు ఉన్నప్పుడు యజమాని ఆస్తి ఎంతో ఊహించలేమని వ్యాఖ్యానించారు. ఆ సేవకుడిని ఇంకా అరెస్టు చేయలేయకపోవడం శోచనీయమన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ అజీజ్ అహ్మద్‌పై కూడా అవినీతి ఆరోపణలు రాగా, సంబంధిత అధికారులు అజీజ్‌కు ఆస్తులను జప్తు చేశారు. అతని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. -
Kidnap Case: ఆనందపడ్డారు.. కానీ పోలీసులు వదల్లేదు..
మండపేట(తూర్పుగోదావరి): నమ్మిన పాలేరే నయవంచన చేశాడు. చెడు వ్యసనాలకు బానిసై, చేసిన అప్పులు తీర్చేందుకు మరో నలుగురితో కలిసి పథకం ప్రకారం యజమానిని కిడ్నాప్ చేయించాడు. వచ్చిన రూ.10 లక్షలు పంచుకుని అంతా సద్దుమణిగిపోయిందని అందరూ ఆనందపడ్డారు. కానీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు మాత్రం అంత తేలిగ్గా వదల్లేదు. చదవండి: భార్య కువైట్‌లో.. ఎంత పనిచేశావ్ బంగార్రాజు.. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ఎటువంటి ఫిర్యాదూ రానప్పటికీ స్పందించారు. తమంత తామే ఫిర్యాదు తీసుకుని మరీ విచారణ చేపట్టారు. చివరకు కారు నంబరు ఆధారంగా కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. అయిదుగురు నిందితులకు అరదండాలు వేశారు. వీరిలో ఒకరు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఈ కేసు వివరాలను సోమవారం విలేకర్లకు వివరించారు. ఆయన కథనం ప్రకారం.. అనపర్తి మండలం పొలమూరుకు చెందిన ద్వారంపూడి కృష్ణారెడ్డి ఈ నెల 5వ తేదీ ఉదయం మండపేట మండలం వేములపల్లిలోని పొలం వద్దకు వెళ్లారు. ఆయనను అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలోను, మీడియాలోను విస్తృతంగా ప్రచారం జరిగింది. కిడ్నాపర్ల డిమాండ్ మేరకు బంధువులు రూ.10 లక్షలు చెల్లించి, కృష్ణారెడ్డిని విడిపించారు. అయితే ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే, విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు దీనిపై విచారణ జరపాల్సిందిగా రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎస్సై బి.శివకృష్ణ బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. రూరల్ సీఐ పి.శివగణేష్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టారు. కృష్ణారెడ్డి బంధువులను అన్ని వివరాలూ అడిగి తెలుసుకున్నారు. కృష్ణారెడ్డిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆయనను కారులో ఎక్కించుకుని రాజానగరం మండలం తుంగపాడు, గోకవరం, రంపచోడవరం మీదుగా సీతపల్లి వరకూ తీసుకువెళ్లారు. ఆయనను వదలాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని పాలేరు బక్కి జయరాజు ద్వారా తమకు అందజేయాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు జయరాజుకు రూ.10 లక్షల నగదు ఇచ్చి పంపగా.. కడియం మండలం బుర్రిలంక వద్ద హైవేపై నగదు తీసుకుని, కృష్ణారెడ్డిని అప్పగించి పరారయ్యారు. ‘జయరాజుకు ఇచ్చి పంపాలి’ అని చెప్పడంతో పోలీసులు తొలుత జయరాజును అనుమానించారు. అతడి కాల్ డేటా సేకరించారు. అనంతరం సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కారు నంబర్‌ను గుర్తించి, కేసును ఛేదించారు. రాజానగరం మండలం ముక్కినాడపాకలుకు చెందిన జయరాజు చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. అదే గ్రామానికి చెందిన సమీప బంధువులు పాకా శ్రీను, పాకా సతీష్‌కుమార్, మండేల ప్రవీణ్, వారి స్నేహితుడు ద్వారంపూడి శ్రీనివాసరెడ్డితో కలిసి కృష్ణారెడ్డిని కిడ్నాప్ చేసేందుకు పథక రచన చేశాడు. వీరిలో సతీష్‌కుమార్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. నిందితులు వచ్చిన సొమ్మును పంచుకుని సోమవారం వేములపల్లిలో పార్టీ చేసుకుంటుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6 లక్షల నగదు, కిడ్నాప్‌కు ఉపయోగించిన కారు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ శివగణేష్, ఎస్సై శివకృష్ణలను డీఎస్పీ బాలచంద్రారెడ్డి అభినందించారు. -
అలా రూ. 2 కోట్లు కొట్టేశాడు
సాక్షి, చెన్నై : అదను, పదును చూసి యజమాని ఇంటికే కన్నం వేసాడో ప్రబుద్ధుడు. యజమాని శైలేష్ ఇతిరాజ్ ఇంట్లో లేని సమయంలో ఆ ఇంటి పనిమనిషి , జార్ఖండ్‌కు చెందిన బికాష్ కుమార్ రాయ్ రూ.18 లక్షల నగదుతో సహా, విలువైన ఆభరణాలను కొట్టేశాడు. యజమాని అందించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి అతని ఆట కట్టించారు. శైలేష్ కుటుంబంతో సహా ఊరు వెళ్లడాన్ని అదనుగా భావించిన పనివాడు బికాష్ కుమార్ రాయ్ 18 లక్షల నగదుతోపాటు బంగారు ఆభరణాలు, వజ్రాల నగలు దోచుకుని పరారయ్యాడు. మొత్తం విలువ రూ.2.07 కోట్లకు పైమాటే. దీంతో జూలై 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు శైలేష్. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. బికాష్ జూలై 29న ఎర్నాకుళం-పాట్నా రైలు ఎక్కాడని రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రత్యేక పోలీసు బృందం పాట్నాకు వెళ్లి మరీ శుక్రవారం అర్థరాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌చేసి, సెంట్రల్ జైలుకు తరలించారు. -
పనిమనషి
తిన్న కంచం నుంచి వేసుకునే బట్టల దాకా శుభ్రం చేయాలి. వంట గది నుంచి తోట పని దాకా మనకు తోడవ్వాలి. రోజంతా ఇంటి బాధ్యతలతో పాటు మన బాగోగులూ చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో సమానంగా అంతకు మించీ మనతో ఉంటున్న తననెందుకు పనిమనిషి అంటున్నాం? మనమనిషి అనుకోలేమా? ఈ ప్రశ్నలకు సమాధానం అందరి దగ్గరా లేకపోవచ్చు కానీ కొందరి దగ్గర ఉంది. ఆ కొందరిలో ఒకరి గురించి తెలుసుకుందాం. అందరికీ ఆ సమాధానాన్ని చేరువ చేద్దాం. ‘‘దీదీ... కుక్కర్ ఏదీ... తోమడానికి వేయలేదు?’’‘‘పాచి వాసన పోవట్లేదని నేను కడిగేశాలే’’ఆ సమాధానంతో అపరాధభావానికి లోనైంది రాధ. మిగిలిన గిన్నెలు కడిగేసి.. ఇల్లు ఊడ్చి.. తుడవడానికి సన్నద్ధమైంది. తుడిచే గుడ్డ కనిపించలేదు. అంతా వెదికింది. ఎక్కడా లేదు.‘‘దీదీ.. తుడిచే గుడ్డ కనిపించడం లేదు?’’‘‘ఇవ్వాళ్టి నుంచి దీంతో తుడువు...’’ అంటూ మాప్ కర్రను తెచ్చిచ్చింది.‘‘దీంతోనా?’’ చూపుల్లో ఆశ్చర్యం... స్వరంలో కుతూహలంతో రాధ.ఈలోపు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు లేచి ఏడుపు అందుకున్నాడు. చేతిలో పని పడేసి గబగబా వచ్చి ఉయ్యాల్లోంచి పిల్లాడిని తీసి ఎత్తుకుంది రాధ.. పంటి బిగువున పాపాయి బరువును భరిస్తూ!గబగబా వచ్చిన యజమానురాలు..‘‘నేను ఎత్తుకుంటాలే’’ అంటూ బిడ్డను తీసుకుంది రాధ చేతుల్లోంచి!యజమానురాలి ఊహించని చర్యకు విస్తుపోతూ.. ‘‘దీదీ.. బాబుకి నా చేతుల్లో నిద్రపడుతుంది.. నేను పడుకోబెడ్తాలే’’ అంది.‘‘నేను చూసుకుంటానన్నాను కదా...’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది యజమానురాలు. ఆమె కొత్తగా ఉండడంతో దిగులు పడుతూనేబాల్కనీలోకి వెళ్లింది రాధ. బట్టలు ఉతకడానికి. నల్లా కింద బకెట్ పెట్టి... నల్లా విప్పింది. ఆ చప్పుడికి మళ్లీ లోపలి నుంచి పరిగెత్తుకొచ్చింది యజమానురాలు.‘‘ఏం చేస్తున్నావ్?’’‘‘బట్టలుతుకుదామని నల్లా తిప్పాను దీదీ...’’ అమాయకంగా రాధ.‘‘నల్లా కట్టేసి.. బట్టల్ని వాషింగ్ మెషీన్లో వెయ్’’ యజమానురాలి ఆర్డర్. ‘‘అదేంటి దీదీ? మీరే చెప్తారు కదా ఎప్పుడూ..వాషింగ్ మెషీన్లో బట్టలేస్తే సరిగ్గా మురికి వదలదని?’’ అడుగుతుంది అదే అమాయకత్వంతో.‘‘ఇప్పుడు చెప్తున్నా కదా.. వెయ్! వాడకుండా దాన్నలా మూలన పెట్టి పాత సామాన్లకుఅమ్మేయడానికా?’’ అంటూ లోపలకు వెళ్లిపోతుంది యజమానురాలు.దీదీ వింతగా కనపడ్తోంది ఆ రోజెందుకో మరి రాధకు.పనైపోయాక అటూ ఇటూ తచ్చాడుతుంటుంది రాధ.. ‘‘యే.. ఇంకా ఇంటికెళ్లవా?’’ అడుగుతుంది యజమానురాలు.‘‘వెళ్తా దీదీ..’’‘‘వెళ్లేప్పుడు ఈ పళ్లు తీసుకెళ్లు.. ఎప్పటి నుంచో పడున్నాయిక్కడ’’ డైనింగ్ టేబుల్ మీదున్న పళ్లబుట్టను చూపిస్తూ యజమానురాలు.‘‘అయ్యో... దీదీ.. ఇవి ఈరోజు పొద్దున తీసుకున్నవే... తాజా పళ్లు’’ అంటుంది చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ రాధ.‘‘చెప్పింది చెయ్... తీసుకెళ్లమన్నా కదా.. తీసుకెళ్లు అంతే.. ఆ.. రేపు రానక్కర్లేదు.. సెలవ్ తీసుకో’’ అంది యజమానురాలు.రాధ మనసు కీడు శంకించి ఏదో అనబోతుండగా.. కాలింగ్ బెల్ మోగింది. గబగబా వెళ్లి తలుపు తీసింది రాధ. ఎదురుగా ఓ అమ్మాయి.‘‘ఎవరు కావాలి?’’ అంది రాధ.‘‘నన్ను రమ్మన్నారు’’ అని ఆ అపరిచితురాలు సమాధానం చెప్తూండగానే... ‘‘ఆ.. ఆ.. నేనే రమ్మంది... లోపలికి రా..’’ అంటూ పిలుస్తుంది యజమానురాలు.‘‘రేపట్నుంచి పనిలోకి వస్తావా?’’ అడుగుతుంది యజమానురాలు లోపలికి వచ్చిన ఆ అమ్మాయితో.‘‘దీదీ.. నేనేమై పోవాలి?’’.. ఆందోళనతో రాధ. ‘‘నీతో కాదులే రాధా.. నువ్వాగు’’ అని రాధను వారిస్తూ కొత్త అమ్మాయితో ‘‘పాచి వాసన రాకుండా గిన్నెలు తోమాలి, ఇల్లు ఊడ్చి, తుడవాలి, బట్టలు.. అన్నీ చేయాలి. రేపటి నుంచి వచ్చేయ్’’ బాధ్యత అప్పజెప్పేస్తుంది యజమానురాలు. ‘‘మరి వంట? ఎంతమందికి వండాలి?’’ కొత్త అమ్మాయి ప్రశ్న. ‘‘వంట పని నేను, రాధ చూసుకుంటాంలే..’’ అని ఆమెతో చెప్పి.. ‘‘యే... రాధా.. నాకు హెల్ప్ చేస్తావ్ కదా?’’ అడుగుతుంది నవ్వుతూ యజమానురాలు. రాధా కళ్లల్లో చెమ్మ... ఆనందంతో!‘‘రాధా.. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నన్నెంత శ్రద్ధగా చూసుకున్నావ్? మరి నువ్ గర్భిణిగా ఉంటే నేనూ అంతే శ్రద్ధగా నిన్ను చూసుకోవాలా లేదా?’’ రాధను దగ్గరకు తీసుకుంటూ చెప్తుంది యజమానురాలు! ఇది ఒక యాడ్. విమెన్స్ డే సందర్భంగా విడుదలైంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని.. ముఖ్యంగా ఇంటి పనుల్లో సహాయపడ్తున్న మహిళలను గౌరవించమని... మనుషులుగా చూడమని చెప్తున్న యాడ్. బాగుంది.. యాడ్.. అలా ఉండాలన్న ఊహా.. చాలా బాగుంటుంది. కానీ ప్రాక్టికల్‌గా అలా ఉండ దు. ఎన్ని ఇళ్లల్లో పనమ్మలకు వేరు టీ కప్పు.. సప రేట్ టిఫిన్ ప్లేట్లుండవ్? నిజంగా జరిగే పని కాదు.అలా ఎందుకు అనుకోవడం? నిజంగా జరిగిన సంఘటనల ప్రేరణతోనే ఆ యాడ్ పుట్టి ఉండొచ్చు కదా! అలాంటి రియల్ లైఫ్ యజమానురాలిని ఇక్కడ పరిచయం చేసుకుందాం.ఆమె పేరు... నిహారికా రెడ్డి. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడ, ఇంజనీర్స్ కాలనీలో నివాసం. బొటిక్ నడిపిస్తుంది. కొన్నాళ్ల కిందట నాగమ్మ అనే అమ్మాయి నిహారిక వాళ్లింట్లో డొమెస్టిక్ హెల్పర్‌గా చేరింది. పెళ్లికాని పిల్ల. స్వస్థలం.. కరీంనగర్ జిల్లాలోని సబ్బితం అనే పల్లె. నిహారికను అక్కా... అని ఆప్యాయంగా పిలుస్తూ ఇంటి పనుల్లో సహాయంగా ఉండేది. నిహారికా ఆ అమ్మాయిని బుజ్జీ అంటూ అంతే ప్రేమగా చూసుకునేది. నిహారిక దగ్గర చేరిన ఆర్నెల్లకు నాగమ్మ అస్వస్థతకు గురైంది. నిహారికే ఆసుపత్రిలో చూపించింది. కిడ్నీ సమస్య అని తేలింది. వయసుతోపాటు కిడ్నీలు పెరగక రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పారు వైద్యులు.కిడ్నీ మార్పిడి ఒక్కటే పరిష్కారమని, అప్పటివరకు డయాలసిస్ చేయించాలని సూచించారు. ఈ విషయాన్ని గ్రామంలో ఉన్న నాగమ్మ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది నిహారిక. అప్పటికే నాగమ్మ తండ్రి పక్షవాతంతో, తల్లి డయాబెటీస్‌తో బాధపడ్తున్నారు. నాగమ్మ ఇద్దరు అక్కల పెళ్లిళ్లయిపోయి అత్తగారిళ్లల్లో ఉన్నారు. అన్నదమ్ములు చదువుకుంటున్నారు. తమ బిడ్డ ఆరోగ్యం కోసం రూపాయి ఖర్చు పెట్టలేమని నిస్సహాయతను వ్యక్తం చేశారు నాగమ్మ తల్లిదండ్రులు. దాంతో ఆమె బాధ్యతను నిహారికే తీసుకుంది. దక్కన్ ఆసుపత్రిలో చేర్పించింది. నాగమ్మ కోసం తను స్వయంగా ఆరు లక్షల రూపాయలను వెచ్చించింది. కిడ్నీ మార్పిడి ప్రయత్నం కోసం ఫండింగ్కూ వెళ్లింది. దురదృష్టం.. నాగమ్మ బతకలేదు. ఆర్థికంగా అండగానే కాదు.. రాత్రింబవళ్లు కంటికి రెప్పలా.. కన్నబిడ్డలా నాగమ్మను చూసుకుంది నిహారిక. అప్పటికే ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు. అర్ధరాత్రి ఆసుపత్రికి పరుగెత్తాల్సి వచ్చేది. తెలిసిన వాళ్లను ఇంట్లో పిల్లలకు తోడుగా ఉంచి నాగమ్మను తీసుకుని హాస్పిటల్ వెళ్లేది. ‘‘ఇంత చేసినా ఆ అమ్మాయిని కాపాడుకోలేకపోయాననే బాధ. బుజ్జీ గురించి నేను పడిన ఆరాటమంతా గొప్పకోసం కాదు. ఓ మనిషిగా నా బాధ్యత అది. డొమెస్టిక్ హెల్పర్స్ మనకు స్లేవ్స్ కారు. మనం ఇంకో చోట వర్క్ చేయడానికి ఎలా వెళ్తామో... వాళ్లు మన ఇంట్లో వర్క్ చేయడానికి వస్తారు. మన బాస్ మనల్ని ఇల్ ట్రీట్ చేస్తే మనమెంత హర్ట్ అవుతామో.. సేమ్ మనం ఇల్ ట్రీట్ చేస్తే డొమెస్టెక్ హెల్పర్స్ కూడా అంతే హర్ట్ అవుతారు. సొసైటీలో ఒకరి మీద ఒకరం ఆధారపడి ఉంటాం. పనులూ అంతే. మనమెక్కడో కంట్రిబ్యూట్ చేయాలంటే మన సొంత పనుల్లో ఎవరో ఒకరు మనకు సహాయపడాల్సిందే. పరస్పర సహాయ సహకారాలతోనే సమాజం.. దాని అభివృద్ధి. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే మనుషుల మధ్య తేడాలుండవ్. అందరినీ గౌరవించగలుగుతాం’’ అంటుంది నిహారికా రెడ్డి. ప్రస్తుతం నీహారిక దగ్గర లక్ష్మి అనే హెల్పర్ పదేళ్ల నుంచి పనిచేస్తోంది. ‘‘లక్ష్మీ అక్కా’’ అని పిలుస్తుంది ఆమెను. లక్ష్మీ తన యజమానురాలు నిహారిక గురించి ఏం అంటుందంటే.. ‘‘ఆమె పెద్దబ్బాయి పుట్టినప్పటి నుంచి ఆమె దగ్గరే పనిచేస్తున్నా. అక్కా.. అనే పిలుస్తది. ఎందుకమ్మా అక్కా అంటావ్... అంటే ‘నాకు అక్క లాంటిదానివే లక్ష్మక్కా నువ్వు’ అంటుంది. వాళ్లింట్లో మనిషిలాగే చూస్తుంది. ఒంట్లో బాగాలేకపోయినా.. డబ్బు అవసరం ఉన్నా అన్నిటికీ అమ్మలా ఆదుకుంటుంది’’ అని చెప్తుంది. ఇదొక్క ఉదాహరణే కాదు.. డొమెస్టిక్ హెల్పర్స్‌కు జీవిత బీమా చేసి, పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న యజమానులూ ఉన్నారు. వీళ్లంతా యాడ్ ఫిల్మ్స్‌కే కాదు.. రియల్ లైవ్స్కీ స్ఫూర్తే. – సరస్వతి రమ -
దీపాన్ని బాగు చేయనా?
ఒకసారి ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (ర) ఇంటికి రాత్రి బాగా పొద్దుపోయాక అతిథులు వచ్చారు. రాత్రి ఇషా నమాజు తరువాత ఖలీఫా తన ఇంటికి వచ్చిన అతిథితో ముచ్చటిస్తున్నారు. అంతలోనే లాంతరులో చమురు అయిపోవడంతో దీపం ఆరిపోసాగింది. దీన్ని గమనించిన అతిథి ‘‘ఓ ఖలీఫా; నేను ఈ దీపాన్ని బాగుచేయనా’ అని అడిగారు. ‘‘ఇంటికి వచ్చిన అతిథితో పనులు చేయించడం భావ్యంకాదు’’ అని చెప్పారు. దానికి ఆ అతిథి ‘‘ఇంట్లో సేవకుడిని లేపమంటారా’’ అని అడిగాడు. అందుకు ఖలీపా ‘‘రోజంతా పనిచేసి అతను అలసిపోయాడు. ఇప్పుడే అతని కళ్లు మూతలు పడ్డాయి’’ అని చెప్పి లాంతరులో చమురు పోసి లాంతరును వెలిగించారు. పైన ప్రవక్త (స), ఖలీఫాల గాథలలో మనకెన్నో వెలకట్టలేని అమూల్యమైన జీవిత సత్యాలున్నాయి. మనం చెప్పే మాటలు అందరూ వినాలని భావిస్తాం. మన మాట చెల్లుబాటు కావాలని ఆశిస్తాం. కానీ మనం చెప్పే మాటలు మనం ఎంతవరకు ఆచరిస్తున్నామో ఆలోచించము. ఎదుటివారిపై మనం చెరగని ముద్ర వేయాలంటే, మనం చెప్పకుండానే మన మాటకు గౌరవం దక్కేలా చేసుకోవాలంటే ముందు మనం ఆచరించి చూపాలి. మన పనులు మనం చేసుకోవడం వల్ల సమాజంలో ఆదరణ లభిస్తుంది. గౌరవ మర్యాదలు కలుగుతాయి. -
సేవకుడి తప్పు
ఖలీఫా ఉమర్ (రజి) కు చేపలంటే ఎంతో ఇష్టం. చేపలు తినాలన్న కోరికను తన సేవకుడి ముందుంచేవారు. సేవకుడు చేపలు తెస్తానని బయల్దేరితే మాత్రం ‘‘చేపలకోసం ఎనిమిది మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తుంది’’ అని చెప్పి వారించేవారు. కానీ ఆరోజు సేవకుడు మాత్రం ఈ రోజెలాగైనా ఖలీఫాకు చేపలు వండి పెట్టాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. ఖలీఫా నమాజుకు వెళ్లడం చూసి రాజ్యంలోని మేలుజాతి గుర్రాన్ని ఒక్క దౌడు తీయించాడు. ఎనిమిది మైళ్ల దూరం ప్రయాణించి ఆరోజు చేపల గంపను తీసుకుని వచ్చాడు సేవకుడు. ఎనిమిది మైళ్ల దూరం వెళ్లి చేపలు తెచ్చాననే విషయం ఖలీఫాకు తెలిస్తే తన పని అయిపోయినట్లేననే భయంతో అనుమానం రాకుండా అశ్వానికి స్నానాల శాలలో స్నానం చేయించాడు. గుర్రం సేదతీరేందుకు నీడన కట్టేశాడు. సాయంత్రం ఖలీఫా ఉమర్ ఇంటికొచ్చాక సంతోషంతో చేపల గంపను ఆయన ముందుంచాడు. ‘‘కాసేపట్లో రుచికరమైన చేపల కూరను మీముందుంచుతాను’’ అని ఎంతో ఆతృతతో చెప్పాడు. ఈ మాటలు విన్న ఖలీఫా వెంటనే గుర్రం దగ్గరకెళ్లి తన చేయిని గుర్రంపై నిమిరారు. కాళ్లకు మర్దన చేశారు. ఆ తరువాత గుర్రం చెవులను పరిశీలనగా చూశారు. గుర్రం చెవుల కింద చెమటలు పట్టి ఉన్నాయి. ‘‘గుర్రాన్ని చక్కగా స్నానం చేయించావు బావుంది కానీ గుర్రం చెవుల వెనుక పట్టిన చెమటను తుడవడం మర్చిపోయావు’’ అని సేవకుడిని సున్నితంగా మందలిస్తూ చెప్పారు. ఆ మరుక్షణమే ఖలీఫా ఉమర్ (రజి) తన మోకాళ్లను నేలపై ఆనించి తన సేవకుడితో ‘‘ప్రళయం రోజున ‘ఓ అల్లాహ్ ఉమర్ చేపలు తినే కోరికను తీర్చుకునేందుకు నోరులేని నన్ను పదహారు మైళ్లు పరుగెత్తించాడు’ అని ఈ గుర్రం అల్లాహ్ కు ఫిర్యాదు చేస్తే నేనేం సమాధానం చెప్పుకోవాలి’’ అని సేవకుడిని నిలదీశారు. ‘‘మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకింత దుఖం కలగలేదు. ఈ రోజు నా దుఃఖానికి అంతులేకుండా పోయిందం’’టూ వెక్కి వెక్కి ఏడ్చారు. సేవకుడు చేసిన తప్పుకు దండించకుండా ఆ తప్పును తానే చేసినట్లు పశ్చాత్తాపం చెందారు. సేవకుడితో ‘‘గుర్రానికి ఈరోజు ఎక్కువ మేత పెట్టు. తెచ్చిన ఈ చేపల గంపను తీసుకెళ్లి పేద కుటుంబానికి ఇచ్చి ఉమర్ (రజి)కి క్షమాభిక్ష పెట్టమని అల్లాహ్‌ను వేడుకోమని చెప్పు’’ అని చెప్పారు. ఖలీఫా ఉమర్ (రజి) దైవభక్తికి, దైవ భీతికి మచ్చుతునక ఈ సంఘటన. – ముహమ్మద్ ముజాహిద్ -
పనిచేసే ఇంటికే కన్నం వేసిన పనిమనిషి
-
పనిమనుషుల పనే..?
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్‌నెం–12లోని ఎమ్మెల్యే కాలనీ ఉంటున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నివాసంలో 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటనలో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 6న లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ ఓ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చి ఆభరణాలను నగల పెట్టెలో పెట్టి బీరువాలో భద్రపర్చింది. శుక్రవారం రాత్రి మరో శుభకార్యానికి వెళ్ళేందుకు ముస్తాబై ఆభరణాల కోసం చూడగా కనిపించలేదు. ఈ నెల 8న పనిమనిషి నగల పెట్టెను తస్కరించినట్లు అనుమినించిన పోలీసులు ఇద్దరు పని మనుషులను అదుపులోకి తీసుకున్నారు. చోరీ మిస్టరీ వీడినట్లేనని ఓ అధికారి తెలిపారు. ఆభరణాలు యథాతథంగా నిందితులు దాచిపెట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. నేడో రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. -
నగలు మాయం..పోలీసుల అదుపులో పనిమనిషి
బంజారాహిల్స్: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నంబర్ -14లోని డాక్టర్స్ క్వార్టర్స్‌లో నివసించే పి.అనంతలక్ష్మి రోజూ తన నగలను తీసి బెడ్రూంలో ఉన్న కప్‌బోర్డులో భద్రపరుస్తుంటారు. శుక్రవారం కూడా ఎప్పటిలాగే సాయంత్రం నగలు కప్‌బోర్డులో పెట్టి తాళాలు వేయటం మర్చిపోయారు. రోజు మాదిరిగా పని మనిషి లక్ష్మి బెడ్రూం క్లీన్చేయడానికి లోనికి ప్రవేశించింది. 7.30 గంటలకు క్లీన్‌చేసి వెళ్లిపోయింది. అనంతలక్ష్మి ఉదయం కప్బోర్డు తెరవగా అందులో రూ. 2 లక్షల విలువ చేసే వజ్రాలు పొదిగిన గాజులు, ముత్యాల హారంతో పాటు రూ. 35 వేల విలువ చేసే గొలుసులు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగి ఇంట్లో విచారణ చేపట్టారు. పని మనిషిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రియల్ లైఫ్‌లోనూ బాహుబలే..!
తన రాజ్యంలో పనిచేసే ఓ బానిస దగ్గరకెళ్లి తను తినేది కాస్త పెట్టామంటాడు రాజకుమారుడు. అందుకు ఎంతో సంతోష పడ్డా..! తన స్థాయి గుర్తుకు వచ్చి వద్దంటాడు ఆ బానిస. కానీ ఆ రాజకుమారుడు మాత్రం ఎంతో ప్రేమగా పెట్టు మామ అంటూ వాళ్లతో కలిసి కూర్చోని భోజనం చేస్తాడు. ఇది ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సినిమా కోసం రాజమౌళి సృష్టించిన సీన్. అయితే సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా తాను బాహుబలే అని ప్రూవ్ చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తన ఇంట్లో పనిచేసే అమ్మాయి పెళ్లి వేడుకకు ఈ స్టార్ హీరో స్వయంగా హాజరయ్యాడు. చందానగర్ లో జరిగిన ఈ పెళ్లికి ప్రభాస్ రావటం వదూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఆశ్యర్యానికి గురిచేసింది. కేవలం అలా వచ్చి వెళ్లిపోవటమే కాదు కాసేపు పెళ్లి మండపంలోనే గడిపిన బాహుబలి అభిమానులతో కాసేపు కబుర్లు చెప్పాడు. ప్రభాస్ వచ్చాడని తెలిసి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. -
కాన్పుకు వచ్చిన గర్భిణిపై అసభ్య ప్రవర్తన
-
ప్రధానిని కాదు.. ప్రధాన సేవకుడ్ని!
-
కేంద్ర మాజీమంత్రి ఇంట్లో మృతదేహం
-
కేంద్ర మాజీమంత్రి నివాసంలో మృతదేహం
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కుమారి శెల్జా నివాసంలో సోమవారం ఓ మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తిని శెల్జా నివాసంలో పనిమనిషి భర్త సంజయ్ (42)గా పోలీసులు గుర్తించారు. అడిషనల్ పోలీస్ కమిషనర్ ఎస్బీఎస్ త్యాగి మాట్లాడుతూ తమకు ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో మృతదేహం గురించి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి శెల్జా నివాసం నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది ఆధారాలు సేకరిస్తోంది. సంజయ్ మృతిపై విచారణ జరుపుతున్నట్లు త్యాగి పేర్కొన్నారు.