
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : అదను, పదును చూసి యజమాని ఇంటికే కన్నం వేసాడో ప్రబుద్ధుడు. యజమాని శైలేష్ ఇతిరాజ్ ఇంట్లో లేని సమయంలో ఆ ఇంటి పనిమనిషి , జార్ఖండ్‌కు చెందిన బికాష్ కుమార్ రాయ్ రూ.18 లక్షల నగదుతో సహా, విలువైన ఆభరణాలను కొట్టేశాడు. యజమాని అందించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి అతని ఆట కట్టించారు.
శైలేష్ కుటుంబంతో సహా ఊరు వెళ్లడాన్ని అదనుగా భావించిన పనివాడు బికాష్ కుమార్ రాయ్ 18 లక్షల నగదుతోపాటు బంగారు ఆభరణాలు, వజ్రాల నగలు దోచుకుని పరారయ్యాడు. మొత్తం విలువ రూ.2.07 కోట్లకు పైమాటే. దీంతో జూలై 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు శైలేష్. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. బికాష్ జూలై 29న ఎర్నాకుళం-పాట్నా రైలు ఎక్కాడని రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రత్యేక పోలీసు బృందం పాట్నాకు వెళ్లి మరీ శుక్రవారం అర్థరాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌చేసి, సెంట్రల్ జైలుకు తరలించారు.