పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బంజారాహిల్స్: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నంబర్ -14లోని డాక్టర్స్ క్వార్టర్స్‌లో నివసించే పి.అనంతలక్ష్మి రోజూ తన నగలను తీసి బెడ్‌రూంలో ఉన్న కప్‌బోర్డులో భద్రపరుస్తుంటారు. శుక్రవారం కూడా ఎప్పటిలాగే సాయంత్రం నగలు కప్‌బోర్డులో పెట్టి తాళాలు వేయటం మర్చిపోయారు. రోజు మాదిరిగా పని మనిషి లక్ష్మి బెడ్‌రూం క్లీన్‌చేయడానికి లోనికి ప్రవేశించింది. 7.30 గంటలకు క్లీన్‌చేసి వెళ్లిపోయింది.
అనంతలక్ష్మి ఉదయం కప్‌బోర్డు తెరవగా అందులో రూ. 2 లక్షల విలువ చేసే వజ్రాలు పొదిగిన గాజులు, ముత్యాల హారంతో పాటు రూ. 35 వేల విలువ చేసే గొలుసులు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగి ఇంట్లో విచారణ చేపట్టారు. పని మనిషిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.