
మగువలూ.. హెయిర్ డ్రైయర్స్ ఆపితే పవర్ ఫుల్లు!
వెనిజులా: విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ముదురో మహిళలకు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేశారు. కరెంటు సమస్యల నేపథ్యంలో మహిళలు హెయిర్డ్రైయర్స్ వాడటం మానేయాలని సూచించారు. విద్యుత్ ఉపయోగించి చేసే ప్రతిపనికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు. ఇలా కనీసం ఓ రెండు నెలలపాటు పాటించాలని డిక్రీ జారీ చేశారు. దీంతోపాటు ఎయిర్ కండిషనర్స్ వంటివి ఉపయోగించడం కూడా తగ్గించాలని చెప్పారు.
మహిళలకు సంబంధించి ఆయనేం చెప్పారంటే 'మహిళలు జుట్టును ఆరబెట్టుకునే యంత్రాలు(హెయిర్ డ్రైయర్స్) ఉపయోగించడం కంటే వారి జుట్టులోకి చేతి వేళ్లను పోనిచ్చి సరిచేసుకోవడం ద్వారా సహజంగా ఆరిపోతుందని చాలా కాలంగా నాకున్న ఆలోచన. ఇదొక్కడే నా దగ్గర ఉన్న ఉపాయం కూడా' అని అన్నారు. వాతావరణ పరిస్థితులు కూడా అనూహ్యంగా మారిన నేపథ్యంలో ఇప్పటి వరకు వెనిజులా వాసులు అనుసరిస్తున్న విధానాల్లో స్వల్ప మార్పులు చేసుకుంటే మంచిదని కూడా ఆయన చెప్పారు. అయితే, ఆయన అభిప్రాయంతో పలువురు విభేదించారు. రాష్ట్రపతి వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఒక వేళ అలాంటిదే చేస్తే అంతకన్నా చెత్తపని ఇంకేం ఉండదని అంటున్నారు.