అధ్యక్షుడు దిగిపోవాలంటూ ఫుడ్ ఎమర్జెన్సీ !
కారాకాస్ (వెనిజులా): వెనిజులాలోని రెండో అతిపెద్ద రాష్ట్రమైన మిరాండా పాఠశాలల్లో ఫుడ్ ఎమర్జెన్సీని ప్రకటించారు. కేంద్రంలోని సోషలిస్టు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్ష పార్టీల సమ్మేళనం ‘డెమొక్రాటిక్ యూనిటీ రౌండ్ టేబుల్’కు చెందిన హెన్రిక్ కాప్రిల్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మిరాండా రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆయన ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితికి వామపక్ష సోషలిస్టు ప్రభుత్వమే కారణమని, నికోలస్‌ను గద్దె దింపాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రజానీకానికి సరిపడా ఆహారం దేశంలో లేదంటూ కాప్రిల్స్ వ్యాఖ్యానించారు. ఈయన 2013 అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. చమురు నిక్షేపాల దేశంగా పేరొందిన వెనిజులా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటోంది. ఫలితంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ప్రభుత్వం గద్దె దిగాలంటూ పలుచోట్ల నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు.