అక్కడ లిప్‌స్టిక్ ధర రూ.72 వేలు
అక్కడ లిప్‌స్టిక్ ధర రూ.72 వేలు
Published Mon, Jul 3 2017 3:25 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
న్యూఢిల్లీ: భారతీయ మహిళలు ఎరుపెక్కిన పెదాలు, గులాబీ బుగ్గలు, తీరైన నల్లటి కనుబొమలు, కొసదేరిని ముక్కు, అందమైన కురులతో అందంగా కనిపించడం కోసం తహతహలాడుతుండడంతో దేశంలో బ్యూటీ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. అయినప్పటికీ ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా బ్యూటీ బిజినెస్ ఎక్కువగా ఉన్న 50 దేశాల్లోకెల్లా భారత్‌లోనే లిప్‌స్టిక్ ధరలు చాలా తక్కువగా ఉండడం విశేషం. భారత్‌లో ఓ లిప్‌స్టిక్ ధర సరాసరి 926 రూపాయలు ఉండగా, ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వెనిజులా దేశంలో ఉండడం ఆశ్చర్యం. ఆ దేశంలో సరాసరి లిప్‌స్టిక్ ధర 71,627 రూపాయలు పలుకుతుంది. అక్కడి ద్రవ్య సంక్షోభమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వెనిజులా తర్వాత పెరూలో లిప్‌స్టిక్ ధర 3,792 రూపాయలు పలుకుతోంది.
భారత్‌లో కాస్మోటెక్ సర్జరీలు కూడా చవగ్గా అందుబాటులో ఉన్నాయని మెక్సికో ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ 'లినియో' బ్యూటీ ప్రైస్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. బ్రెస్ట్ పెంచుకునేందుకు చేసుకునే కాస్మోటిక్ సర్జరీలకు స్విడ్జర్లాండ్ దేశాల్లో ఆరేడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుండగా, భారత్‌లో కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఖర్చవుతుందట. అయితే భారత దేశంలో ముక్కు కాస్మోటిక్ సర్జరీకి ఎక్కువ ఖర్చు అవుతుందట. సరాసరి 83,922 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపింది. బ్యూటీ బ్రాండ్‌లు, సర్వీసులు, కాస్మోటెక్ ప్రొసీజర్లను పరిగణనలోకి తీసుకొని లినియో కంపెనీ బ్యూటీ ధరల సూచికను తయారు చేసింది.
సోషల్ మీడియా, బ్లాగుల కారణంగా భారత్‌లోని పట్టణ ప్రాంతాల్లో బ్యూటీ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ మార్కెట్ ఒక్క 2016లోనే 16 శాతం వద్ధి చెందింది. ఒక్క లిప్‌స్టిక్ రంగంలోనే 3,338 కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోంది. లాక్మీ, నైకా లాంటి స్థానిక బ్రాండ్లను ఆదరిస్తున్న మహిళలు, స్మాష్‌బాక్స్, సెఫోరా లాంటి విదేశీ బ్రాండ్లను సైతం ఆదరిస్తున్నారు. కనుబొమలపై అవాంఛిత రోమాలను తొలగించడంతోపాటు జుట్టును అందంగా తీర్చిదిద్దినట్లు కత్తిరించడం లాంటి బ్యూటీ సర్వీసులకు కూడా భారత్‌లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా మగవాళ్లకు రోడ్డుపక్కనుండే సాలూన్ షాపులు తక్కువ ధరలకే సేవలిందిస్తున్నాయి.
భారతీయ మహిళలు అందమైన కనుబొమల కోసం సరాసరి 150 రూపాయలు ఖర్చు పెడుతుండగా, అదే అమెరికా మహిళలు దాదాపు 700 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. భారత్‌లో హేర్ కటింగ్ కోసం పురుషులు సరాసరి 175 రూపాయలు ఖర్చు పెడుతుండగా, అమెరికాలో పురుషులు దాదాపు 910 రూపాయలు ఖర్చు పెడుతున్నారు.
Advertisement