ఒకప్పుడు ప్రపంచ రాజకీయ రంగస్థలిపై ప్రభావశీల శక్తిగా వెలిగిన అలీనోద్య మానికి కాలదోషం పట్టిందా? వెనిజులాలోని మార్గరిటా ద్వీపంలో ఈ నెల 17-18 తేదీలలో జరిగిన 17వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం తీరును చూస్తే ఆ అనుమానం రాకమానదు. 120 సభ్య దేశాలతో ఐక్యరాజ్య సమితిలో అతి పెద్ద రాజకీయ కూటమిగా ఉన్న అలీనోద్యమం (నామ్) శిఖరాగ్ర సదస్సుకు 12 మంది దేశాధినేతలు మాత్రమే హాజరయ్యారు.
వెనిజులాలో నెలకొన్న రాజకీయ అస్థిరత, అధ్యక్షుడు నికొలస్ మధురో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి ఉండటం వల్లనే ఈ సదస్సు చప్పగా సాగిందని అనుకోలేం. మూడేళ్ల క్రితం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 16వ నామ్ సదస్సుకు హాజరైనది 30 మంది దేశాధినేతలే. ఈ ధోరణిని బట్టి నామ్ సభ్య దేశాలలో ఈ ఉద్యమంపట్ల నమ్మకం సడలుతోంది, ఆసక్తి తగ్గుతోందనేది స్పష్టమే. వ్యవస్థాపక సభ్య దేశమైన భారత దేశాధినేత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సుకు హాజరు కాకపోవడం విశేషం.
1961లో ఏర్పడిన నాటి నుంచి నామ్ చరిత్రలో మోదీకి ముందు ఒకే ఒక్క భారత ప్రధాని.. కాంగ్రెస్ బ్లాక్ మెయిలింగ్ మద్దతుతో ఊగిసలాడే ప్రభుత్వానికి నేతృత్వం వహించిన చరణ్‌సింగ్ (1979లో క్యూబాలో జరిగిన 7వ సదస్సు) మాత్రమే ఇలా గైర్హాజరయ్యారు. ప్రధాని ఈ సదస్సుకు హాజరు కానంత మాత్రాన మోదీ ప్రభుత్వం అలీనోద్యమంలో ఆసక్తిని కోల్పోయిందనుకోరాదని ప్రభుత్వ వివరణ. అదెలా ఉన్నా, ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య సాగిన ఆధిపత్య పోటీలో నలిగిపోతున్న వర్ధమాన దేశాల ఉద్యమంగా పుట్టిన నామ్‌కు నేటి ప్రపంచంలో సమంజసత్వమే లేదనే వాదన నేడు గట్టిగా విన వస్తోంది.
అమెరికా, సోవియట్ యూనియన్ అగ్రరాజ్యాలు రెంటికి సమదూరాన్ని పాటించడానికి నేడు అలాంటి ప్రపంచాధిపత్య పోటీ లేదు కాబట్టి అలీన విధానం అవసరం ఇక లేదనే భావన మోదీకి ఏర్పడినట్టుంది. ఇటీవలే అమెరికాతో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకున్న దృష్ట్యా వెంటనే పాశ్చాత్య వ్యతిరేక ముద్ర ఉన్న నామ్ సదస్సుకు హాజరు కాకపోవడమే ఉత్తమమనేది కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రభా వితం చేసి ఉండొచ్చు. పైగా అలీన విధానం అనే భావనకు కర్త జవహర్‌లాల్ నెహ్రూపట్ల, ఆయన వారసత్వంపట్ల ప్రధానికి ఉన్న విముఖత అందరికీ తెలిసినదే.
అలీనోద్యమాన్ని ప్రచ్ఛన్న యుద్ధ శిశువుగా మాత్రమే చూసేవారెవరైనా దానికి కాలం చెల్లిపోయిందనుకోవడం సహజమే. కానీ 1950లలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేస్తున్న కాలంలోనే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని చాలా దేశాలు వలస సంకెళ్లను తెంచుకున్నాయి. అవి ప్రపంచంలో తమదైన సొంత అస్తిత్వాన్ని చాటుకోవాలని, నిలుపుకోవాలని, స్వతంత్రంగా అభివృద్ధి చెందాలని తహతహ లాడాయి. ఆ ఆకాంక్షల నుంచే అలీన విధానం అనే భావన 1954 నాటికి ఊపిరి పోసుకుంది. దాన్ని విస్మరిస్తే అలీన విధానానికి అసలు పునాది వలసవాద వ్యతి రేకత అనే చారిత్రక వాస్తవం మరుగున పడిపోతుంది. అదే నేడు జరుగుతోంది. అలీనోద్యమాన్ని ప్రచ్ఛన్న యుద్ధానికి అంటగట్టేసే యాంత్రిక ధోరణికి కారణ మౌతోంది.
మన కళ్లెదుటే మధ్యప్రాచ్యంలో సాగుతున్న సిరియా మారణహోమం నుంచి, దక్షిణ చైనా సముద్రంలో కమ్ముకుంటున్న ప్రచ్ఛన్న యుద్ధ మేఘాల వరకు ప్రతిచోటా ప్రపంచ శక్తుల సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగిన కాలంలోలాగే నేడూ పలు వర్ధమాన దేశాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక ప్రపంచ శక్తి వెనుక నిలవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవంక అమెరికా, చైనాల మధ్య ఆర్థిక ఆధిపత్య పోటీ నానాటికీ విస్తరిస్తోంది, ఉద్రిక్తతలకు దారితీస్తోంది. వీటికి తోడు అన్ని అంతర్జాతీయ సంస్థలలోను, వేదికలపైన సంపన్న దేశాలు, వర్ధమాన దేశాల ప్రయోజనాల మధ్య సంఘర్షణ నగ్నంగా కనిపిస్తూనే ఉంది.
డబ్ల్యూటీఓ నుంచి పర్యావరణం, వాతావరణ మార్పుల వరకు అడుగడుగునా వర్ధమాన దేశా లపట్ల వివక్ష కొనసాగుతోంది. 21వ శతాబ్దం విసురుతున్న సవాళ్లు అలీనోద్యమం పుట్టిన నాటి కంటే భిన్నమైనవే. కానీ అవి అలీనోద్యమానికి కాలదోషం పట్టిం చకపోగా మరింత ఆవశ్యకం చేస్తున్నాయి. ‘నామ్, పేద దేశాల అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్’ అని ఒకప్పుడు అనేవారు. అలాంటి కూటమిగా నామ్ ఆవశ్యకత ఎప్పటికన్నా నేడు ఎక్కువగా ఉన్నది.
2003 కౌలాలంపూర్ నామ్ సదస్సులో నాటి భారత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి చెప్పింది సరిగ్గా ఇదే: ‘అలీనోద్యమం ఈ నూతన శతాబ్దంలోని గొప్ప చారిత్రక సందర్భం. గతాన్ని పునరాలోచించుకుని, విజయాలను వైఫల్యాలను మదింపు చేసి మన ఉద్యమాన్ని పునరుజ్జీవింపచేయ డానికి నిర్దిష్ట చర్యలను చేపట్టాల్సి ఉంది. ఈ కృషిలో భారత్ తనవంతు పాత్రను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.’
ప్రచ్ఛన్న యుద్ధం ప్రపంచాన్ని అణు యుద్ధం అంచున నిలిపిన 1960లు, 1970లలో భారత్ సహా చాలా వర్ధమాన దేశాలు ఏదో ఒక అగ్రరాజ్యాన్ని ఆశ్రయిం చాల్సి వచ్చింది. అయినా అలీనోద్యమం తన సొంత గొంతుకను వినిపించగలి గింది. 1981లో, నాడు సోవియట్ యూనియన్‌కు మిత్ర దేశంగా ఉన్న భారత్ అధ్యక్షతన నామ్.. అఫ్ఘానిస్థాన్ నుంచి సోవియట్ యూనియన్ తక్షణమే సేనలను ఉపసంహరించాలని తీర్మానించింది. 2013 నామ్ టెహ్రాన్ సదస్సు దక్షిణ చైనా సముద్ర వివాదంపై నీళ్లు నమలకుండా ఐరాస అంతర్జాతీయ సముద్ర మౌలిక సూత్రాలను అన్ని పక్షాలు తు.చ. తప్పక పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.
నేటి మార్గరిటా సదస్సు కూడా చైనా, ఫిలిప్పీన్స్ దక్షిణ చైనా సముద్ర వివాదాన్ని మధ్య వర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. ఆ అంశంపై భారత్ అను సరిస్తున్న సూత్రప్రాయమైన వైఖరి కూడా అదే. నేటికీ బహుముఖ అంతర్జాతీయ వేదికగా అలీన ఉద్యమానికి ఉన్న శక్తిని, ప్రాధాన్యాన్ని గుర్తించి, దాన్ని పునరు జ్జీవింపజేసి, సమర్థ నాయకత్వాన్ని అందించాల్సిన చారిత్రక బాధ్యత ఆ ఉద్యమ నిర్మాతగా, నామ్‌లోని శక్తివంతమైన దేశంగా భారత్‌దే. ఇప్పటికైనా అది గుర్తిం చడం అవసరం.
‘నామ్’కు కాలం చెల్లిందా?
Published Wed, Sep 21 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
Advertisement
Advertisement