ప్రపంచ  పర్యాటకం కళకళ  | Global tourism almost return to pre-pandemic level in 2024 | Sakshi
Sakshi News home page

ప్రపంచ  పర్యాటకం కళకళ 

Published Mon, Jan 27 2025 6:24 AM | Last Updated on Mon, Jan 27 2025 6:24 AM

Global tourism almost return to pre-pandemic level in 2024

గత ఏడాది పర్యటనల్లో బిజీగా 140 కోట్ల మంది 

నివేదించిన ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ

2024 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా జనం పర్యాటనల్లో మునిగిపోయారని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్‌డబ్ల్యూటీఓ) ప్రకటించింది. గత ఏడాది ఏకంగా 140 కోట్ల మంది జనం పర్యటనల్లో బిజీగా మారారని యూఎన్‌డబ్ల్యూటీఓ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.

 2019 డిసెంబర్‌లో మొదలైన కోవిడ్‌ సంక్షోభం దెబ్బకు కుదేలైన ప్రపంచ పర్యాటకం మళ్లీ నాలుగేళ్ల తర్వాత 99 శాతం పుంజుకోవడం విశేషం. 2014 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఏకంగా రూ.172 లక్షల కోట్లు ఖర్చుచేశారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక్కో పర్యాటకుడు గత ఏడాది మొత్తంలో పర్యాటకం కోసం దాదాపు రూ.86,000 ఖర్చుచేశాసినట్లు స్పష్టమైంది.  

ఎక్కువ ఎక్కడికి వెళ్లారు? 
గణాంకాల ప్రకారంచూస్తే అత్యధికంగా 74.7 కోట్ల మంది జనం యూరప్‌ దేశాల్లో పర్యటించారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ జెండా ఎగరేసి యుద్ధంలో మునిగిపోవడంతో పర్యాటకులు ఉక్రెయిన్, రష్యా వాటి సమీప దేశాల రీజియన్‌లో సందర్శనలపై ఆసక్తి కనబరచలేదు. దేశాలవారీగా చూస్తే ఫ్రాన్స్‌కు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఫ్రాన్స్‌ పర్యాటక బోర్డ్‌ తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది ఆ దేశానికి 10 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు.

 ఆ తర్వాత స్పెయిన్‌లో 9.8 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. ‘‘అత్యధిక సందర్శకులతో ఫ్రాన్స్‌ చరిత్ర సృష్టించింది. 2024 సమ్మర్‌ ఒలింపిక్స్, పారిస్‌లో ప్రఖ్యాత నోట్రే డేమ్‌ క్యాథడ్రల్‌ చర్చి పునఃప్రారంభం, రెండో ప్రపంచయుద్ధంలో నార్మాండీపై దాడుల ఘటనకు 80 ఏళ్లు పూర్తవడంతో జరిగిన కార్యక్రమాలను చూసేందుకు ఏడాది పొడవునా భారీగా జనం తరలివచ్చారు’’అని ఫ్రాన్స్‌ అభిప్రాయపడింది. ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో 31.6 కోట్ల మంది పర్యటించారు.  

స్పెయిన్‌లో విభిన్న పరిస్థితి 
‘‘మా ప్రాంతానికి రండిబాబు. పర్యటించి ఇక్కడి వ్యాపారాన్ని పెంచండి’’అనే రాష్ట్రాలు, దేశాలనే మనం చూశాం. అందుకు భిన్నంగా స్పెయిన్‌ వ్యవహరించినా మళ్లీ అదే దేశానికి జనం వరసకట్టడం గమనార్హం. సెవిల్లే సిటీలోని ప్లాజా డీ ఎస్పానా వంటి ప్రాంతాలు పర్యాటకులతో కిక్కిరిసి పోవడంతో అక్కడి స్థానిక యంత్రాంగం అక్కడ ఎవరు పర్యటించినా చార్జీలు వసూలుచేస్తామని హెచ్చరించింది. 

1929 నిర్మించిన అక్కడి ప్రాంతంలో జనం, వ్యాపారాలు పెరిగిపోయి వీధివ్యాపారుల ఆక్రమణలు అధికమై, పాత కట్టడాలు దెబ్బతింటున్నాయని నగర మేయర్‌ జోస్‌ లూయిజ్‌ శాంజ్‌ చెప్పారు. ఇటలీలో వెనీస్, ఫ్లోరెన్స్‌ నగరాల్లో బృంద పర్యాటకాలపై నిషేధం, రాత్రిళ్లు బీచ్‌లలో ఈతకొట్టడంపై నిషేధాజ్ఞలున్నాసరే ఆ దేశంలో పర్యాటకం గతంతో పోలిస్తే 23 శాతం పెరిగింది.

ఆశ్చర్యపరిచిన చిన్న దేశాలు 
భారత్‌తో పోలిస్తే అధిక మండే ఎండలుంటే ఖతార్‌లో అత్యధిక మంది సందర్శకులు వచ్చారు. అక్కడ గతంతో పోలిస్తే పర్యాటకుల సంఖ్య 137 శాతం పెరగడం విశేషం. గత ఏడాది అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌గా ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ నిలిచింది. దోహాలోని హమాద్‌ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌ కిరీటాన్ని సాధించింది. ఫ్రాన్స్, స్పెయిన్‌ సరిహద్దుల్లోని అత్యంత చిన్న దేశం ఆండోర్రాలోనూ పర్యాటకుల రద్దీ పెరిగింది. డొమెనికన్‌ రిపబ్లిక్, కువైట్, అల్బేనియా, ఎల్‌ సాల్వడార్‌ వంటి చిన్న దేశాలకూ పెద్ద సంఖ్యలో సందర్శకులు క్యూ కట్టడం విశేషం.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement