ఇది మోదీ సృష్టించిన వినాశనం
► పెద్ద నోట్ల రద్దుపై రాహుల్
► పేదలపై దాడి చేసిన తొలి ప్రధాని మోదీ
సాక్షి, బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు అనేది ‘మోదీ సృష్టించిన వినాశనం అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. దేశ జనాభాలో ఒక శాతం ఉన్న కుబేరుల కోసం మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే మోదీ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. శనివారం కర్ణాటకలోని బెల్గావ్‌లో కాంగ్రెస్ సభలో రాహుల్ పాల్గొన్నారు. ‘భారత చరిత్రలోనే తొలిసారి ఒక మోదీ దేశ ప్రజలపైనే దాడికి పాల్పడ్డారు. సాధారణంగా ప్రధాని దేశం కోసం పనిచేస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ కోసం కృషి చేస్తారు. కానీ నరేంద్రమోదీ మన ఆర్థిక వ్యవస్థపైనే దాడికి పాల్పడ్డారు’ అని విమర్శించారు. ‘ మనుషులు సృష్టించిన వినాశనం అంటూ ఉంటాం.
అదే మాదిరిగా నోట్ల రద్దు.. ఆ తర్వాత పరిణామాలను మోదీ సృష్టించిన వినాశనం అనాలి’ అని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఫిడెల్ క్యాస్ట్రోకు నివాళులర్పించారు కానీ, నోట్ల రద్దుతో దేశంలో ప్రాణాలు కోల్పోయిన వందల మంది కోసం 2నిమిషాల పాటు మౌనం పాటించే సమయం బీజేపీ నేతలకు లేకపోయిందని మండిపడ్డారు. ఈ మరణాలకు మోదీనే కారణమని, రెండున్నరేళ్లుగా మోదీ ప్రభుత్వం పేదలపై అఘాయిత్యాలకు పాల్పడుతోందన్నారు.
కరుణకు రాహుల్ పరామర్శ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్యంతో చెన్నై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ శనివారం పరామర్శించారు. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న రాహుల్ నేరుగా ఆసుపత్రికి వెళ్లి కరుణను పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిని అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు రాహుల్ మీడియాతో అన్నారు. అంతకుముందు, డీఎంకే కోశాధికారి స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తదితరులు రాహుల్‌కు స్వాగతం పలికారు. మరోవైపు, రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కరుణను పరామర్శించారు.