ప్రదేశాలే వేరు...ప్రయాణాలు ఒకటే...
ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం ఉంచితే...
అక్కడితో వివాహం పూర్తయినట్లే.
మిగతా తంతు అంతా వేడుక కోసమే.
అయితే ఈ దంపతులు వేడుకల వరకు వెళ్లలేదు.
పెళ్లి మాత్రం అయ్యిందనిపించి, వెంటనే
ఎవరి డ్యూటీకి వారు వెళ్లిపోయారు!
వాళ్లేమీ సామాన్యులు కాదు... ఇద్దరూ ఐఏఎస్ ఆఫీసర్‌లు!
ఐదు వందల రూపాయల ఖర్చుతో వివాహం చేసుకుని
48 గంటల లోపే మధ్యప్రదేశ్‌కి ఒకరు, ఆంధ్రప్రదేశ్‌కి ఒకరు
విధి నిర్వహణకు వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా వధువు ‘సలోని సిదానా’ను
సాక్షి ‘ఫ్యామిలీ’ పలకరించింది.
‘‘మా వివాహం గురించి పెద్దగా రాయవలసింది ఏమీ లేదు. మా ఇరుపక్షాల పెద్దల అంగీకారంతోనే ఇలా.. ఖర్చు లేకుండా చేసుకున్నాం. అన్ని వివాహ విధానాలనూ నేను గౌరవిస్తాను. అయితే మేము ఎంచుకున్న విధానం అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే బాధ్యతలలోకి వచ్చాను. ఇంకా ఎన్నో చేయాలి. కొత్తగా చిగుళ్లు తొడుగుతున్న రాజధానికి సబ్‌కలెక్టర్‌గా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అంటున్న సలోని మనోభావాలివి.
మెడిసిన్ చదివి... సివిల్స్ లోకి
మాది వ్యవసాయ కుటుంబం. పంజాబ్‌లోని జలాలాబాద్‌లోని చిన్న గ్రామం మా ఊరు. మేము ముగ్గురం. తమ్ముడు అనిష్, అక్క మమతా సిదాని, నేను. తమ్ముడు ఐఐటి చదువుతున్నాడు. నేను ఢిల్లీలో ఎంబిబిఎస్ పూర్తి చేసి, ఎయిమ్స్‌లో రేడియాలజిస్టుగా పనిచేశాను. అయితే నా మనసు నన్ను సివిల్స్ వైపు లాగుతుండేది. ఆ సమయంలోనే అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో పీజీ సీటు వచ్చింది. సివిల్ సర్వీసులో చేరాలని ఆసక్తి ఉండటంతో, పీజీ వదులుకున్నాను. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యాను. 2013లో యుపిఎస్‌సి పరీక్ష రాశాను. 74వ ర్యాంకు వచ్చింది. సివిల్ సర్వీసులో చేరడం వల్ల నేను ఎక్కువమందికి సేవలు అందించగలుగుతాను. ముఖ్యంగా పేదలకు సహాయం చేయడం కోసమే ఇటువైపు వచ్చాను.
పెద్ద నోట్ల రద్దు కారణం కాదు
శిక్షణా కాలంలో విజయవాడలో ట్రెయినీ కలెక్టర్‌గా పనిచేశాను. పోస్టింగ్ కూడా విజయవాడలోనే వచ్చింది. తెలుగు వారి కోసం కేవలం నెల రోజుల వ్యవధిలో తెలుగులో మాట్లాడటం నేర్చుకున్నాను. దక్షిణ భారతదేశానికి ఇది నా మొదటి ప్రయాణం. అంతకుముందే ముస్సోరి ట్రైనింగ్‌లో లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో అవినాష్‌కి నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం ప్రేమగా, ప్రేమ పెళ్లిగా మారింది. నవంబరు 28 న మధ్యప్రదేశ్‌లోని భిండ్ కోర్టులో అతి సామాన్యంగా మా పెళ్లి జరిగింది. అవినాష్‌ది రాజస్థాన్. అతడి పోస్టింగ్ మధ్యప్రదేశ్‌లో. అక్కడి వశిష్ఠ గోహాడ్‌లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నారు. పెద్ద నోట్లు రద్దయిన కారణంగా ఇలా నిరాడంబరంగా మేము పెళ్లి చేసుకోలేదు కానీ, ఆదర్శ వివాహానికి ఒక మంచి అవకాశం లభించిందనుకున్నాం.
సంభాషణ: డా. వైజయంతి, సాక్షి, విజయవాడ