పంజాబ్‌లో ఆప్‌–కాంగ్రెస్‌ హోరాహోరీ! | Goa registers record 83% voter turnout; 75% polling in Punjab | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో ఆప్‌–కాంగ్రెస్‌ హోరాహోరీ!

Published Sun, Feb 5 2017 12:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

పంజాబ్‌లో ఆప్‌–కాంగ్రెస్‌ హోరాహోరీ! - Sakshi

పంజాబ్‌లో ఆప్‌–కాంగ్రెస్‌ హోరాహోరీ!

► మీడియా సర్వే అంచనా
► పంజాబ్‌లో 75%, గోవాలో 83% పోలింగ్‌

న్యూఢిల్లీ/చండీగఢ్‌/పణజి: నోట్ల రద్దు పరిణామాలతో బీజేపీకి, ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మకంగా మారిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సంచలన తీర్పు ఇవ్వనున్నాయా? పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న శిరోమణి అకాలీ దళ్‌(ఎస్‌ఏడీ)–బీజేపీ కూటమి దారుణంగా ఓడిపోనుందా? విపక్ష  కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) మధ్య హోరాహోరీ పోరు సాగి, ఆప్‌ అతిపెద్ద పార్టీగా అవతరించనుందా? శనివారం పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక మీడియా ప్రతినిధులు పలు ప్రాంతాల్లో జరిపిన సర్వే ఫలితాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి. అకాలీ–బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీలో ఆప్‌ పైచేయి సాధిస్తుందని పలువురు ఓటర్లు చెప్పారు. కాంగ్రెస్‌కు కూడా విజయావకాశాలు ఉన్నాయని కొందరు చెప్పగా, అధికార కూటమికి ఫలితాలు తీసికట్టుగా ఉంటాయని సర్వేలో పాల్గొన్న వారిలో చాలామంది చెప్పారు.

మొత్తం 117 సీట్లకుగాను చీపురు పార్టీకి(ఆప్‌) దాదాపు 60, హస్తానికి 40 వస్తాయన్నారు. మార్పు కోసం తాము ఆప్‌ ‘జాడూ’కు ఓటేశామని పలువురు తెలిపారు. దాదాపు 800 జనాభా ఉన్న ఒక గ్రామంలో అయితే ఏకంగా 600 మంది కేజ్రీ పార్టీకి ఓటేసి ఉంటారని స్థానికులు చెప్పారు. పదేళ్ల ప్రభుత్వంపై వ్యతిరేకత చాలామందిలో కనిపించింది. రాష్ట్రం అవినీతి, నిరుద్యోగంతో కుదేలైందని, నోట్ల రద్దుతో చిన్నవ్యాపారాలు దెబ్బతిన్నాయని అన్నారు. అవినీతి ప్రక్షాళనకు నడుం కట్టిన ఆప్‌కు ఒకసారి అవకాశమిచ్చి చూడాలనుకుంటున్నామని చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 4 స్థానాలు గెలుచుకున్న ఆప్‌.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగి 112 సీట్లలో పోటీ చేసింది. దాని మిత్రపక్షం లోన్ ఇన్సాఫ్‌ 5 స్థానాల్లో బరిలో ఉంది.

ప్రశాంతంగా పోలింగ్‌
నోట్ల రద్దు తర్వాత దేశంలో తొలిసారి శనివారం రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్‌ నమోదైంది. పంజాబ్‌లో 75 శాతం, గోవాలో 83 శాతం మంది ఓటేశారు. 117 స్థానాలున్న పంజాబ్‌లో 1,145 మంది, 40 స్థానాలున్న గోవాలో 251 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. చెదురుమదురు ఘటనలు మినహా రెండు రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.  పంజాబ్‌లో ప్రాథమిక వివరాల ప్రకారం సుమారు 75 శాతం పోలింగ్‌ నమోదైంది. సంగ్రూర్‌ జిల్లా సుల్తాన్ పూర్‌ గ్రామంలో ఆప్, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణల్లో ఇద్దరు గాయపడ్డారు.  తరన్ తారన్  జిల్లా లాలూ గుమాన్లో అకాలీదళ్‌ మద్దతుదారుడు పోలింగ్‌ బూత్‌ వద్ద కాల్పులు జరపడంతో కాంగ్రెస్‌ కార్యకర్త ఒకరు గాయపడ్డారు. ఫతేఘర్‌ చురియన్ నియోజకవర్గంలోని రోపోవాలి గ్రామంలో కాంగ్రెస్, అకాలీదళ్‌ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు గాయపడ్డారు.

‘సాంకేతిక’ ఇబ్బందులు
పంజాబ్‌ ఎన్నికల్లో ఓటు ఎవరికి వేశామో తెలియజేసే ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌(వీవీపీఏటీ) యంత్రాలను తొలిసారిగా వినియోగించారు. 6వేలకుపైగా పోలింగ్‌ బూత్‌లలో వాడారు. మజితా, సంగ్రూర్‌ల్లోని కొన్ని చోట్ల వీవీపీఏటీ యంత్రాల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని, దీనిని ఎన్నికల సంఘానికి తెలియజేశామని అధికారులు చెప్పారు.

యంత్రాల్లో సాంకేతిక సమస్యలతో చాలా ప్రాంతాల్లో పోలింగ్‌కు అంతరాయం కలిగిందని పంజాబ్‌ ముఖ్య ఎన్నికల అధికారి వీకే సింగ్‌ చెప్పారు. అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్‌ జరిగింది. పంజాబ్, గోవా ఎన్నికలు అద్భుతమని, అవి ఒక విప్లవంలా సాగాయని  కేజ్రీవాల్‌ చెప్పారు. తామే అధికారంలోకి వస్తామన్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా సాగినందుకు పంజాబ్‌ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

గోవాలో రికార్డు పోలింగ్‌
గోవాలో రికార్డు స్థాయిలో 83 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇంత ఎక్కువ పోలింగ్‌ శాతం నమోదవడం ఇక్కడ ఇదే మొదటిసారి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌తో పాటు ఎంజీపీ–శివసేన–జీఎస్‌ఎం పార్టీల కూటమి కూడా పోటీ పడటంతో పోరు ఉత్కంఠభరితంగా సాగినా.. పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ప్రాథమిక అంచనా ప్రకారం 83 శాతం పోలింగ్‌ నమోదైనా.. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు తెలిపాయి. పణజీలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్‌ బూత్‌ బయట నిలబడిన 78 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో 81.8 శాతం పోలింగ్‌ నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement