‘స్కామ్’ పార్టీలను వదిలించుకోండి
► ఓటర్లకు మోదీ పిలుపు
► ఎస్పీ, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను ‘స్కామ్’గా అభివర్ణన
మీరట్: ఉత్తరప్రదేశ్‌ను అవినీతి పార్టీల నుంచి విముక్తం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలను కోరారు. నోట్ల రద్దుతో తాను అవినీతిపరులను ‘దోచుకోవడం’తో వారు తనను అధికారం నుంచి దించేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మోదీ శనివారం మీరట్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల సభతో తొలిసారి తన ప్రచారాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ‘యూపీని స్కామ్.. ఎస్ అంటే సమాజ్‌వాదీ, సీ అంటే కాంగ్రెస్, ఏ అంటే అఖిలేశ్, ఎం అంటే మాయావతి పార్టీల నుంచి విముక్తం చేయండి’ అని కోరారు.
బీజేపీ అభివృద్ధి ఎజెండా కావాలో, నేరస్తులను కాపాడుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే వారు కావాలో తేల్చుకోవాలన్నారు. ‘నన్ను ప్రధానిని చేసింది యూపీనే.. ఇందుకు రుణం తీర్చుకుంటా.. ప్రస్తుతమిక్కడి ప్రగతి నిరోధక ప్రభుత్వంలా కాకుండా కేంద్రంతో కలసి పనిచేసే ప్రభుత్వంతోనే అది సాధ్యమవుతుంది’ అని అన్నారు. తాము అధికారంలోకి వస్తే చిన్న, మధ్యతరగతి రైతుల రుణాలను మాఫీ చేస్తామని, చెరకు రైతులకు 14 రోజుల్లోగా బకాయిలు చెల్లిస్తామన్నారు.
ఎస్పీ–కాంగ్రెస్ పొత్తుపై..
మొన్నటివరకు పరస్పరం తిట్టుకున్న ఎస్పీ, కాంగ్రెస్‌లు రాత్రికి రాత్రి పొత్తుపెట్టుకున్నాయని మోదీ ధ్వజమెత్తారు. తమను తాము కాపాడుకోలేని వారు యూపీని కాపాడలేరని అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి దగ్గర రూ. 150 కోట్లు దొరికినా, అతనిపై చర్య తీసుకోలేదని మండిపడ్డారు. తన కుటుంబానికి, తనకు ప్రాధాన్యమిచ్చిన అఖిలేశ్ ఇప్పుడు అధికారంకోసం పరితపిస్తున్నారని విమర్శించారు. బాబాయి, అబ్బాయి, నాన్న, దాయాది వ్యవహారాలతో ప్రభుత్వం తీరికలేకుండా ఉందని, జనం తమ ఓట్లతో ‘స్కాం’ పార్టీలను నిర్మూలిస్తేనే మార్పు వస్తుందని ములాయం కుటుంబ గొడవలను ప్రస్తావిస్తూ అన్నారు. వనరులు ఉన్న యూపీ.. ప్రభుత్వాల నిర్వాకం వల్ల పేదరికం, నిరుద్యోగం నుంచి బయటికిరావడం లేదని, కేంద్రనిధులను అఖిలేశ్ సర్కారు సద్వినియోగం చేయడంలేదన్నారు.