SP-Congress alliance
-
‘ఎస్పీ–బీఎస్పీ’కి 7 సీట్లు వదిలిన కాంగ్రెస్
లక్నో: రాజకీయంగా కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ 12కు పైగా ఎంపీ సీట్లను ఇతర పార్టీలకు వదిలేసింది. ఇందులో ఎస్పీ–బీఎస్పీ–ఆరెల్డీ కూటమికి 7 సీట్లను వదిలేసినట్లు ప్రకటించింది. వీటితో పాటు అప్నాదళ్‌కు 2 సీట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ‘7 లోక్‌సభ స్థానాల్లో మా అభ్యర్థులను బరిలో నిలపడంలేదు. ఇందులో మైన్‌పురి, కనౌజ్, ఫిరోజాబాద్ ఉన్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆరెల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్, ఆయన కుమారుడు జయంత్ చౌదరి పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా మా అభ్యర్థులను నిలపడంలేదు’ అని యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ తెలిపారు. అయితే ఏడో స్థానం గురించి కాంగ్రెస్ స్పష్టతనివ్వలేదు. రాయ్‌బరేలి (సోనియా గాంధీ), అమేథి (రాహుల్) పోటీ చేస్తున్న స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపడం లేదని ఎస్పీ–బీఎస్పీ–ఆరెల్డీ కూటమి ఇçప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మైన్‌పురి నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ములాయంసింగ్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కనౌజ్ నుంచి, బదౌన్, ఫిరోజాబాద్ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. అప్నాదళ్‌కు గోండా, పిలిభిత్ స్థానాలను వదిలేస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. -
చిన్న తేడాతో గెలుపు గల్లంతే
► విజయావకాశాల్ని నిర్దేశిస్తున్న ఓట్లశాతంలో స్వల్ప తేడా ► గత ఫలితాల్ని ఉదాహరణగా చూపుతున్న విశ్లేషకులు లక్నో: ఓటరు నాడి అంతుపట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎస్పీ–కాంగ్రెస్ కూటమి, బీజేపీ, బీఎస్పీల మధ్య త్రిముఖ పోరులో విజేత ఎవరన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఓట్ల శాతంలో స్వల్ప తేడా కూడా సీట్ల సంఖ్యలో భారీ అంతరానికి కారణమవచ్చంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓటర్ల ఆలోచనా ధోరణిలో చిన్న మార్పు పార్టీలు, అభ్యర్థుల గెలుపోటముల్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల ఫలితా లు అందుకు నిదర్శనంగా వారు ఉదహరిస్తున్నారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 30 శాతం, ఎస్పీ 26 , బీజేపీ 17, కాంగ్రెస్ 8.5 శాతం ఓట్లు గెలుచుకున్నాయి. అప్పుడు సమాజ్‌వాదీ గెలుపొందిన స్థానాలు 97. ఐదేళ్ల అనంతరం 2012లో ఎస్పీ కేవలం అదనంగా మూడు శాతం ఓట్లు మాత్రమే దక్కించుకుని 97 స్థానాల నుంచి రికార్డు స్థాయిలో 224 స్థానాలకు ఎగబాకింది. 2007తో పోల్చితే బీఎస్పీ 4.5 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా సాధించినా.... ఆ పార్టీ గెలుపొందిన స్థానాలు 206(2007) నుంచి 80కు పడిపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లోను... ఇక 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 (18.25 ఓట్లశాతం), ఎస్పీ 23 (23.26%) స్థానాలతో మంచి ఫలితాలు సాధించాయి. బీఎస్పీ 20 (27.42%) స్థానాలకు పరిమితం కాగా... బీజేపీ కేవలం 10 (17.5%) స్థానాలతో సరిపెట్టుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితాలు తారమారయ్యాయి. బీజేపీ ఓట్లశాతం 42.6కు ఎగబాకడంతో 71 స్థానాలతో ప్రత్యర్థి పార్టీల్ని చిత్తుచేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... మొత్తం 403 గాను 80 శాతం స్థానాల్లో బీజేపీ ముందంజలో నిలిచింది. ఎస్పీ 42 అసెంబ్లీ స్థానాల్లో, బీఎస్పీ కేవలం 9 స్థానాల్లో ఆధిక్యం కనపరిచాయి. కోడలు, తమ్ముడి కోసం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్... కోడలు, తమ్ముడి కోసం రంగంలోకి దిగారు. వారిద్దరి గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆయన... ఆ రెండు స్థానాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ పోటీచేస్తున్న జశ్వంత్‌నగర్‌లో ప్రచారం చేస్తూ... ఈ ఎన్నికలు తనకు, శివ్‌పాల్‌కు ఎంతో ముఖ్యమైనవన్నారు. కోడలు అపర్ణ విజయంతో తన గౌరవం ముడిపడిఉందంటూ ఉద్వేగంగా చెప్పారు. 2014 కంటే 10% తగ్గినా.. విశ్లేషకుల అంచనా ప్రకారం... 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో బీజేపీకి 10 శాతం తగ్గినప్పటికీ అధికార పీఠం దక్కించుకునే అవకాశాలున్నాయి. బీజేపీ 32 శాతం ఓట్లు సాధిస్తే మెజార్టీకి అవసరమైన 202 సీట్లను సులువుగా గెలుచుకోవచ్చు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోను ఆ స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఓబీసీల్లో పట్టున్న అప్నాదళ్‌తో పొత్తు తమకు లాభిస్తుందనే ఆలోచనలో బీజేపీ ఉంది. -
బాత్రూముల్లోకి తొంగిచూస్తారు
మోదీపై విరుచుకుపడ్డ రాహుల్ ► కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని విడుదల చేసిన అఖిలేశ్–రాహుల్ సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్పై ప్రధాని మోదీ చేసిన ‘రెయిన్ కోట్ షవర్’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ధీటుగా స్పందించారు. మోదీకి ఇతరుల బాత్రూంలోకి తొంగి చూడడం అంటే ఇష్టమని విమర్శించారు. లక్నోలో శనివారం యూపీ సీఎం అఖిలేశ్‌తో కలసి రెండు పార్టీల కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసే కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. ‘మోదీకి వారఫలాలు (జ్యోతిష్యం), గూగుల్‌లో సెర్చ్ చేయటం.. ఖాళీ సమయాల్లో ఇతరుల స్నానపు గదుల్లోకి తొంగిచూడటమే పని’ అని అన్నారు. ‘మోదీకి గూగుల్‌లో వెతకటమే పని. ఖాళీగా ఉన్నప్పుడు సాయంత్రం.. మోదీని ఈ పన్నులన్నీ చేసుకోమనండి. ప్రధానిగా నిర్వర్తించాల్సిన పని సక్రమంగా చేస్తే చాలు. ఈ ఎన్నికల ఫలితాలతో ఆయన ఖంగుతింటారు’ అని రాహుల్ అన్నారు. ఇద్దరు యువ నాయకుల మధ్య ఏర్పడిన కూటమి యూపీ భవితను మారుస్తుందని.. ‘ఎస్పీ–కాంగ్రెస్ కూటమి’నుద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ .. ఈ ఎన్నికల్లో తొలి ర్యాలీలో ప్రసంగించారు. తమ్ముడు శివ్‌పాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న జశ్వంత్‌నగర్ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. తమ్ముడికి ఓటువేయాలని మాత్రమే అభ్యర్థించారు. కనీసం 300 సీట్లలో గెలవాలనే లక్ష్యంతో ఎస్పీ–కాంగ్రెస్ కూటమి 10 పాయింట్లతో కనీస ఉమ్మడి కార్యాచరణను శనివారం లక్నోలో విడుదల చేసింది. అధికారంలోకి వస్తే యువకులకు ఉచిత స్మార్ట్ ఫోన్ . 20 లక్షల మంది నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి, రైతులకు రుణాలనుంచి విముక్తి. తక్కువ ధరకే విద్యుత్తు. పంటలకు సరైన ధర, కోటిమంది పేదల కుటుంబాలకు నెలకు రూ.వెయ్యి పింఛను. పట్టణ పేదలకు రూ.10కే భోజనం, ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 33 శాతం, పంచాయతీ, స్థానిక ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ తదితర పది పాయింట్లతో సీఎంపీని వెల్లడించింది. -
యూపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. పశ్చిమ యూపీలోని మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 73 నియోజకవర్గాల్లో 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 839 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 9గంటలకు 10.56 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముజఫర్‌నగర్ సహా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తొలిదశ పోలింగ్ మిగతా ఆరు దశల పోలింగ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. మొత్తం 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 11న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. (చదవండి : 'ఉత్తర'దిశ చూపే ‘పశ్చిమం’! ) కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడు పంకజ్(నోయిడా), ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ అల్లుడు రాహుల్ సింగ్(బులంద్‌షహర్ జిల్లా సికందరాబాద్ నుంచి ఎస్పీ తరఫున) బరిలో ఉన్నారు. ముజఫర్‌నగర్ అల్లర్ల నిందితుడైన సర్దానా సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న పశ్చిమ యూపీలో ఎంఐఎం కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. -
నేడే యూపీ తొలిదశ
పశ్చిమ యూపీలోని 73 స్థానాలకు ఎన్నికలు లక్నో: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు శనివారం జరగనున్నాయి. పశ్చిమ యూపీలోని మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 నియోజకవర్గాలకు జరగనున్న పోలింగ్‌లో 2.6 కోట్ల మంది ఓటేయనున్నారు. 839 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడు పంకజ్(నోయిడా), ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ అల్లుడు రాహుల్ సింగ్(బులంద్‌షహర్ జిల్లా సికందరాబాద్ నుంచి ఎస్పీ తరఫున) బరిలో ఉన్నారు. ముజఫర్‌నగర్ అల్లర్ల నిందితుడైన సర్దానా సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముజఫర్‌నగర్‌లోని 887 పోలింగ్ కేంద్రాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. గోమాంసం తిన్నాడనే ఆరోపణలపై 2015లో ఒక ముస్లిం హత్యకు గురైన దాద్రీ నియోజకవర్గం(గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లా) లోనూ ఈ దశలోనే పోలింగ్ జరుగుతోంది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న పశ్చిమ యూపీలో ఎంఐఎం కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తొలిదశ పోలింగ్ మిగతా ఆరు దశల పోలింగ్‌పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశాయి. ఎస్పీ–కాంగ్రెస్‌కు ఓటేయండి: యూపీ తొలిదశ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని కోల్‌కతాలోని టిప్పు సుల్తాన్ మసీదు ఇమామ్ సయ్యద్ మహ్మమద్ నూరూర్ రెహ్మన్ బర్కతీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆరెస్సెస్‌లు విభజనవాద రాజకీయాలతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాయని, అవి ముస్లింలకు వ్యతిరేకమని ఆరోపించారు. -
‘తుపాను’లోనూ సైకిల్ రయ్ రయ్!
మోదీ వ్యాఖ్యపై సీఎం అఖిలేశ్ సీతాపూర్/లఖింపూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ‘తుపాను’లోనూ ఎస్పీ సైకిల్‌ను ఎలా ముందుకు పోనివ్వాలో పార్టీ శ్రేణులకు తెలుసని సీఎం అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. సీతాపూర్, లఖింపూర్ ఖేరిల్లో సమాజ్‌వాదీ పార్టీ నిర్వహించిన ప్రచార సభల్లో అఖిలేశ్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ చేయి కలపడంతో ఎస్పీ సైకిల్ వేగం పెరగనుంది. స్నేహహస్తమిచ్చిన కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లిచ్చాం. ఎన్నికల్లో బీజేపీ ‘తుపాను’ దెబ్బకు సీఎం ఎగిరిపోతారని మోదీ అంటున్నారు. కానీ అంతటి గాల్లోనూ సైకిల్ సవా రీ ఎలాగో సమాజ్‌వాదీలకు తెలుసు. యూ పీలో అధికారపక్షానికి వ్యతిరేకంగా బలమైన గాలులు వీస్తున్నాయని మోదీ భావిస్తే, పంజాబ్‌లో కూడా అధికారపక్షానికి వ్యతిరేకంగా గాలులువీస్తున్నాయనే విషయం మోదీ గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. ములాయం ప్రచారం: ఎస్పీ–కాంగ్రెస్ కూట మిపై మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న ఎస్పీ అగ్రనేత ములాయంసింగ్ ‘యూ టర్న్’ తీసుకున్నారు. రేపటి నుంచి అఖిలేశ్ తరఫున ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. -
‘స్కామ్’ పార్టీలను వదిలించుకోండి
► ఓటర్లకు మోదీ పిలుపు ► ఎస్పీ, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను ‘స్కామ్’గా అభివర్ణన మీరట్: ఉత్తరప్రదేశ్‌ను అవినీతి పార్టీల నుంచి విముక్తం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలను కోరారు. నోట్ల రద్దుతో తాను అవినీతిపరులను ‘దోచుకోవడం’తో వారు తనను అధికారం నుంచి దించేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మోదీ శనివారం మీరట్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల సభతో తొలిసారి తన ప్రచారాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ‘యూపీని స్కామ్.. ఎస్ అంటే సమాజ్‌వాదీ, సీ అంటే కాంగ్రెస్, ఏ అంటే అఖిలేశ్, ఎం అంటే మాయావతి పార్టీల నుంచి విముక్తం చేయండి’ అని కోరారు. బీజేపీ అభివృద్ధి ఎజెండా కావాలో, నేరస్తులను కాపాడుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే వారు కావాలో తేల్చుకోవాలన్నారు. ‘నన్ను ప్రధానిని చేసింది యూపీనే.. ఇందుకు రుణం తీర్చుకుంటా.. ప్రస్తుతమిక్కడి ప్రగతి నిరోధక ప్రభుత్వంలా కాకుండా కేంద్రంతో కలసి పనిచేసే ప్రభుత్వంతోనే అది సాధ్యమవుతుంది’ అని అన్నారు. తాము అధికారంలోకి వస్తే చిన్న, మధ్యతరగతి రైతుల రుణాలను మాఫీ చేస్తామని, చెరకు రైతులకు 14 రోజుల్లోగా బకాయిలు చెల్లిస్తామన్నారు. ఎస్పీ–కాంగ్రెస్ పొత్తుపై.. మొన్నటివరకు పరస్పరం తిట్టుకున్న ఎస్పీ, కాంగ్రెస్‌లు రాత్రికి రాత్రి పొత్తుపెట్టుకున్నాయని మోదీ ధ్వజమెత్తారు. తమను తాము కాపాడుకోలేని వారు యూపీని కాపాడలేరని అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి దగ్గర రూ. 150 కోట్లు దొరికినా, అతనిపై చర్య తీసుకోలేదని మండిపడ్డారు. తన కుటుంబానికి, తనకు ప్రాధాన్యమిచ్చిన అఖిలేశ్ ఇప్పుడు అధికారంకోసం పరితపిస్తున్నారని విమర్శించారు. బాబాయి, అబ్బాయి, నాన్న, దాయాది వ్యవహారాలతో ప్రభుత్వం తీరికలేకుండా ఉందని, జనం తమ ఓట్లతో ‘స్కాం’ పార్టీలను నిర్మూలిస్తేనే మార్పు వస్తుందని ములాయం కుటుంబ గొడవలను ప్రస్తావిస్తూ అన్నారు. వనరులు ఉన్న యూపీ.. ప్రభుత్వాల నిర్వాకం వల్ల పేదరికం, నిరుద్యోగం నుంచి బయటికిరావడం లేదని, కేంద్రనిధులను అఖిలేశ్ సర్కారు సద్వినియోగం చేయడంలేదన్నారు. -
ప్రధాని కావాలన్న కోరిక లేదు: అఖిలేశ్
లక్నో: తనకు దేశ ప్రధాని కావాలన్న కోరిక లేదని యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. శనివారం ఓ న్యూస్ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ రాజకీయాలకు దూరంగా ఉన్నవారు సంతోషంగా ఉంటారని సరదాగా అన్నారు. ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి రాబోయే ఎన్నికల్లో 300కు పైగా సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధిపొందిన వారిలో కనీసం 50 శాతం మంది ఓటేసినా భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. -
ములాయం ఘాటు వ్యాఖ్యలు
-
ములాయం ఘాటు వ్యాఖ్యలు
లక్నో: అఖిలేశ్, రాహుల్ గాంధీ కలిసి మీడియా ముందుకు వచ్చిన కొద్దిసేపటికే ములాయం సింగ్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తును తాను అంగీకరించనని స్పష్టం చేశారు. హస్తం పార్టీతో పొత్తు తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా సమాజ్ వాదీ పార్టీకి ఉందని పేర్కొన్నారు. ఈ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని ప్రకటించారు. ‘కాంగ్రెస్ పార్టీ చాలా కాలం అధికారంలో ఉంది. కానీ దేశానికి ఏమీ చేయలేదు. ఈ ఎన్నికల్లో నేను ప్రచారం చేయను. కాంగ్రెస్-ఎస్పీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేయమని కార్యకర్తలను కోరతాన’ని ములాయం చెప్పారు. తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి నారద్ రాయ్.. బీఎస్పీలో చేరడంతో ఆయన ఈవిధంగా స్పందించారు. శివపాల్ యాదవ్ తో పాటు నారద్ రాయ్ ను గత అక్టోబర్ లో కేబినెట్ నుంచి అఖిలేశ్ తొలగించారు. నారద్ పార్టీ మారకుండా చూసేందుకు ములాయం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.