ములాయం ఘాటు వ్యాఖ్యలు
లక్నో: అఖిలేశ్, రాహుల్ గాంధీ కలిసి మీడియా ముందుకు వచ్చిన కొద్దిసేపటికే ములాయం సింగ్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తును తాను అంగీకరించనని స్పష్టం చేశారు. హస్తం పార్టీతో పొత్తు తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా సమాజ్ వాదీ పార్టీకి ఉందని పేర్కొన్నారు. ఈ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని ప్రకటించారు.
‘కాంగ్రెస్ పార్టీ చాలా కాలం అధికారంలో ఉంది. కానీ దేశానికి ఏమీ చేయలేదు. ఈ ఎన్నికల్లో నేను ప్రచారం చేయను. కాంగ్రెస్-ఎస్పీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేయమని కార్యకర్తలను కోరతాన’ని ములాయం చెప్పారు. తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి నారద్ రాయ్.. బీఎస్పీలో చేరడంతో ఆయన ఈవిధంగా స్పందించారు. శివపాల్ యాదవ్ తో పాటు నారద్ రాయ్ ను గత అక్టోబర్ లో కేబినెట్ నుంచి అఖిలేశ్ తొలగించారు. నారద్ పార్టీ మారకుండా చూసేందుకు ములాయం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.