‘ఆ ఇద్దరి’కే పరిమితమైన ములాయం
లక్నో: గత అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ ఈసారి నామమాత్రపు ప్రచారానికే పరిమితం అయ్యారు. ఆయన కేవలం ఇద్దరు అభ్యర్థులకు మాత్రమే ప్రచారం చేశారు. 2012 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి, 300 ర్యాలీల్లో పాల్గొన్న ములాయం ఈసారి తన సోదరుడు శివపాల్ యాదవ్, చిన్న కోడలు అపర్ణ యాదవ్ తరఫున మాత్రమే క్యాంపెయినింగ్ చేశారు. కాగా కాంగ్రెస్‌తో పొత్తు పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ తరఫున కూడా ఆయన ప్రచారంలో పాల్గొనలేదు.
ఈ నేపథ్యంలో సోదరుడు శివ్‌పాల్‌యాదవ్ పోటీ చేస్తున్న జశ్వంత్‌నగర్ నియోజకవర్గంతో పాటు చిన్న కోడలు అపర్ణ యాదవ్ పోటీ చేస్తున్న లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రమే ఆయన ప్రచారం చేశారు. కాగా యూపీ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉన్నా కూడా పెద్దాయన కేవలం సమాజ్‌వాదీ తరఫున మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్‌లో ఇప్పటివరకూ ఐదు దశలు పూర్తికాగా, మరో రెండు దశల పోలింగ్ ఈ నెల 4, 8వ తేదీల్లో జరగనున్నాయి. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.