ఒకే వేదికపై ములాయం కోడళ్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన కోడళ్లు డింపుల్ యాదవ్, అపర్ణా యాదవ్ నిరూపించారు. ఎన్నికల ప్రచారంలో డింపుల్, అపర్ణ ఇద్దరూ కలసి ఒకే వేదికను పంచుకున్నారు. తోడికోడలు అపర్ణకు మద్దతుగా డింపుల్ ప్రచారం నిర్వహించారు. బుధవారం లక్నో కంటోన్మెంట్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో డింపుల్, అపర్ణ పాల్గొన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు కేంద్ర ప్రభుత్వంపైనా డింపుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. అపర్ణకు ఓట్లు వేసి గెలిపించాలని స్థానికులను కోరారు.
ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అయిన అపర్ణ లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. సమాజ్‌వాదీ పార్టీ ఇంతవరకు ఎప్పుడూ నెగ్గని లక్నో కంటోన్మెంట్ స్థానాన్ని ఆమె ఎంచుకున్నారు. ఇక ములాయం పెద్ద కొడుకు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ లోక్ సభ సభ్యురాలు. ఆమె కనౌజ్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. బుధవారం ములాయం కోడళ్లు ఇద్దరూ లక్నోలో ప్రచారం చేశారు. ఇద్దరి వ్యక్తిత్వాలు వేరయినా డింపుల్, తాను చాలా సన్నిహితంగా ఉంటామని అపర్ణ చెప్పారు.
ఎస్పీలో తలెత్తిన అంతర్గత కుటుంబపోరుతో అపర్ణ యాదవ్ వెలుగులోకి వచ్చారు. ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ వర్గం వ్యక్తిగా పేరొందిన అపర్ణ ఎస్పీని తన చేతుల్లోకి తీసుకోవాలని భావించినట్లు కథనాలు వచ్చాయి. ఓ దశలో సీఎం అఖిలేశ్ ఆమెకు సీటు ఇస్తారా లేదా అనే సందేహం వచ్చినా.. చివరికి అపర్ణకు, బాబాయి శివపాల్ యాదవ్ లకు పార్టీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు. ములాయం కుటుంబంలో ఆధిపత్య పోరు, ఎస్పీలో చోటు చేసుకున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కినా.. ఎన్నికలు వచ్చేసరికి తమ మధ్య విభేదాలు లేవని, అందరూ కలసికట్టుగా ఉన్నామని ములాయం కుటుంబ సభ్యులు చెబుతున్నారు.