తోటికోడలి కోసం ప్రచారం
అపర్ణకు బాసటగా డింపుల్
లక్నో: యూపీ సీఎం అఖిలేశ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ లక్నోలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో బుధవారం తోటికోడలు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ స్థానం నుంచి ములాయం రెండో భార్య కుమారుడైన ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన డింపుల్.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, లక్నో మెట్రో ప్రాజెక్టును డింపుల్ ప్రస్తావించినపుడు ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున మాజీ కాంగ్రెస్ నేత రీటా బహుగుణ జోషి బరిలో ఉన్నారు. కుటుంబంలో ఇటీవల నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇద్దరు కోడళ్లు ఒకే వేదికపైకి రావటం విశేషం. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ కూడా చిన్న కోడలి తరపున బుధవారం కంటోన్మెంట్‌లో ప్రచారం చేశారు.
బీజేపీవి విద్వేష రాజకీయాలు:రాహుల్
బారాబంకి: బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతూ, ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని జైద్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తనూజ్ పూనియా తరఫున ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ విద్వేషం ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ ప్రజల మధ్య సామరస్యం పెంచడానికి పాటుపడుతోందనే సందేశాన్ని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ మాటలు మాత్రమే చెబుతారని పనులు చేయరని ఎద్దేవా చేశారు. యూపీ అభివృద్దికి కాంగ్రెస్–ఎస్పీ కూటమి మాత్రమే పనిచేస్తుందని అన్నారు. 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ మాట నిజం కాలేదని, ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును నవంబర్ 8న చిత్తుకాగితాలు చేశారని చురకలంటించారు.