పరీక్షలు బాగా రాయాలి.. మీరు ఎన్నికల్లో గెలవాలి
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ఉన్నారు. రోజుకు నాలుగు నుంచి ఏడు ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటున్నారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 170 ర్యాలీలలో పాల్గొన్నారు. అఖిలేష్‌కిది ఎన్నికల పరీక్షా సమయం కాగా.. ఆయన ముగ్గురు పిల్లలకు పరీక్షల కాలం. ఎన్నికల ప్రచారంలో పడి తన పిల్లల చదువు, పరీక్షల గురించి పట్టించుకోలేకపోతున్నానని అఖిలేష్ అన్నారు. ఎలా చదువుతున్నారని తన పిల్లలను అడిగానని, పరీక్షలు బాగా రాయాలని విషెస్ చెప్పానని, వారు కూడా తాను ఎన్నికల్లో గెలవాలని విషెస్ చెప్పారని తెలిపారు.
అఖిలేష్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎస్పీలో అఖిలేష్ తర్వాత ఆమే స్టార్ క్యాంపెయినర్. దీంతో అఖిలేష్, డింపుల్ ఇద్దరూ తమ పిల్లల చదువుపై ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారు. తమ పరిస్థితిని పిల్లలు అర్థం చేసుకున్నారని అఖిలేష్ చెప్పారు. ప్రతిరోజూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాత్రికి ఇంటికి వస్తానని, ఆ సమయంలో పిల్లల పరీక్షల గురించి ఆలోచిస్తానని, మరుసటి రోజు ఉదయం వారి ప్రిపరేషన్ గురించి తెలుసుకుని విషెస్ చెబితే.. వారూ తనకు విషెస్ చెబుతారని ఓ ఇంటర్వ్యూలో అఖిలేష్ చెప్పారు. ఇక తన ప్రచారం గురించి మాట్లాడుతూ.. ర్యాలీలకు ప్రజలు భారీగా తరలిరావడం తనకు ఉత్సాహాన్ని, వారు తనలో స్ఫూర్తి కలిగిస్తున్నారన్నారు.