అఖిలేశ్ సీఎం అయితే ఆయనే మంత్రి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని, ఈ కొత్త ప్రభుత్వంలోనూ తన సోదరుడు శివ్‌పాల్ యాదవ్ మంత్రిగా కొనసాగుతారని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. 'బంఫర్ మెజారిటీతో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధిస్తుంది. అఖిలేశ్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు' అని ఆయన ఆదివారం ఎటావా జిల్లా సాఫైలో ఓటు వేసిన అనంతరం పేర్కొన్నారు.
అబ్బాయి అఖిలేశ్ యాదవ్, బాబాయి శివ్‌పాల్ యాదవ్ మధ్య పార్టీ ఆధిపత్యం కోసం తీవ్రస్థాయి పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోరులో ములాయం తమ్ముడు శివ్‌పాల్ వైపు నిలిచినా.. ఆఖరికీ అఖిలేశ్ విజయం సాధించి.. పార్టీని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఇటీవల ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా శివ్‌పాల్ యాదవ్‌పై విమర్శనాస్త్రాలు కూడా సంధించారు. అయితే, అఖిలేశ్ విమర్శలను ములాయం తోసిపుచ్చారు. పార్టీని దెబ్బతీయాలనుకున్న కొందరిని ఉద్దేశించి అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారని, శివ్‌పాల్ గురించి కాదని పేర్కొన్నారు. అఖిలేశ్ కొత్త ప్రభుత్వంలోనూ శివ్‌పాల్ మంత్రిగా కొనసాగుతారని పేర్కొన్నారు.