యూపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. పశ్చిమ యూపీలోని మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 73 నియోజకవర్గాల్లో 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 839 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 9గంటలకు 10.56 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముజఫర్‌నగర్ సహా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తొలిదశ పోలింగ్ మిగతా ఆరు దశల పోలింగ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. మొత్తం 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 11న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.
(చదవండి : 'ఉత్తర'దిశ చూపే ‘పశ్చిమం’! )
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడు పంకజ్(నోయిడా), ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ అల్లుడు రాహుల్ సింగ్(బులంద్‌షహర్ జిల్లా సికందరాబాద్ నుంచి ఎస్పీ తరఫున) బరిలో ఉన్నారు. ముజఫర్‌నగర్ అల్లర్ల నిందితుడైన సర్దానా సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న పశ్చిమ యూపీలో ఎంఐఎం కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.