చిన్న తేడాతో గెలుపు గల్లంతే
► విజయావకాశాల్ని నిర్దేశిస్తున్న ఓట్లశాతంలో స్వల్ప తేడా
► గత ఫలితాల్ని ఉదాహరణగా చూపుతున్న విశ్లేషకులు
లక్నో: ఓటరు నాడి అంతుపట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎస్పీ–కాంగ్రెస్ కూటమి, బీజేపీ, బీఎస్పీల మధ్య త్రిముఖ పోరులో విజేత ఎవరన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఓట్ల శాతంలో స్వల్ప తేడా కూడా సీట్ల సంఖ్యలో భారీ అంతరానికి కారణమవచ్చంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓటర్ల ఆలోచనా ధోరణిలో చిన్న మార్పు పార్టీలు, అభ్యర్థుల గెలుపోటముల్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు.
గత ఎన్నికల ఫలితా లు అందుకు నిదర్శనంగా వారు ఉదహరిస్తున్నారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 30 శాతం, ఎస్పీ 26 , బీజేపీ 17, కాంగ్రెస్ 8.5 శాతం ఓట్లు గెలుచుకున్నాయి. అప్పుడు సమాజ్‌వాదీ గెలుపొందిన స్థానాలు 97. ఐదేళ్ల అనంతరం 2012లో ఎస్పీ కేవలం అదనంగా మూడు శాతం ఓట్లు మాత్రమే దక్కించుకుని 97 స్థానాల నుంచి రికార్డు స్థాయిలో 224 స్థానాలకు ఎగబాకింది. 2007తో పోల్చితే బీఎస్పీ 4.5 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా సాధించినా.... ఆ పార్టీ గెలుపొందిన స్థానాలు 206(2007) నుంచి 80కు పడిపోయాయి.
లోక్‌సభ ఎన్నికల్లోను...
ఇక 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 (18.25 ఓట్లశాతం), ఎస్పీ 23 (23.26%) స్థానాలతో మంచి ఫలితాలు సాధించాయి. బీఎస్పీ 20 (27.42%) స్థానాలకు పరిమితం కాగా... బీజేపీ కేవలం 10 (17.5%) స్థానాలతో సరిపెట్టుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితాలు తారమారయ్యాయి. బీజేపీ ఓట్లశాతం 42.6కు ఎగబాకడంతో 71 స్థానాలతో ప్రత్యర్థి పార్టీల్ని చిత్తుచేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... మొత్తం 403 గాను 80 శాతం స్థానాల్లో బీజేపీ ముందంజలో నిలిచింది. ఎస్పీ 42 అసెంబ్లీ స్థానాల్లో, బీఎస్పీ కేవలం 9 స్థానాల్లో ఆధిక్యం కనపరిచాయి.
కోడలు, తమ్ముడి కోసం
ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్... కోడలు, తమ్ముడి కోసం రంగంలోకి దిగారు. వారిద్దరి గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆయన... ఆ రెండు స్థానాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ పోటీచేస్తున్న జశ్వంత్‌నగర్‌లో ప్రచారం చేస్తూ... ఈ ఎన్నికలు తనకు, శివ్‌పాల్‌కు ఎంతో ముఖ్యమైనవన్నారు. కోడలు అపర్ణ విజయంతో తన గౌరవం ముడిపడిఉందంటూ ఉద్వేగంగా చెప్పారు.
2014 కంటే 10% తగ్గినా..
విశ్లేషకుల అంచనా ప్రకారం... 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో బీజేపీకి 10 శాతం తగ్గినప్పటికీ అధికార పీఠం దక్కించుకునే అవకాశాలున్నాయి. బీజేపీ 32 శాతం ఓట్లు సాధిస్తే మెజార్టీకి అవసరమైన 202 సీట్లను సులువుగా గెలుచుకోవచ్చు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోను ఆ స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఓబీసీల్లో పట్టున్న అప్నాదళ్‌తో పొత్తు తమకు లాభిస్తుందనే ఆలోచనలో బీజేపీ ఉంది.