Uttar Pradesh assembly polls
-
త్వరలో యోగి కేబినెట్ విస్తరణ..?
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల ముందు, సెమీ ఫైనల్‌గా భావించే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని నిలబెట్టుకొనేందుకు కమలదళం కసరత్తు కొనసాగిస్తోంది. వచ్చే ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయడంలో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జూన్ 10, 11 తేదీల్లో ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి గురువారం రాత్రి సుమారు మూడున్నర గంటల పాటు హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఇందులో జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్‌లతో పాటు పార్టీ హైకమాండ్ పిలుపుతో సీఎం యోగి ఆదిత్యనాథ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్, సంజయ్ నిషాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కీలక భేటీలో మిషన్–2022కు సంబంధించిన రోడ్‌మ్యాప్‌తో పాటు, ఖాళీగా ఉన్న నాలుగు సీట్లను భర్తీ చేసేందుకు ప్రతిపాదిత పేర్ల జాబితాను హైకమాండ్‌కు అందజేశారు. సమావేశంలో పేర్లు ఖరారు చేశారు. రాబోయే ఒకటి, రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్తను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో కేబినెట్ విస్తరణ? మరోవైపు పార్టీ హైకమాండ్‌తో జరిగిన మారథాన్ సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొనడం కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై మరోసారి ఊహాగానాలకు తెరలేపింది. కాగా వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా జరుగబోయే మంత్రివర్గ విస్తరణలో సుమారు ఆరుగురికి మంత్రులుగా అవకాశాన్ని కల్పించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో యువకులు, మహిళలకు పెద్దపీట వేయనున్నారు. అక్టోబర్ నుంచి ప్రధాని పర్యటనలు.. కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి దాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగించేందుకు భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ముందుకు సాగుతోంది. పార్టీ క్యాడర్ని సమీకరించేందుకు ఎన్నికల బూత్ స్థాయి కార్యకర్తల కోసం పన్నా ప్రముఖ్ సమ్మేళనాన్ని వచ్చే నెల చివరి వారంలో బీజీపీ చేపట్టనుంది. అక్టోబర్ నుంచి నెలకోసరి అయినా ప్రధాని మోదీ యూపీ వస్తారని బీజేపీ నాయకుడు తెలిపారు. ఎజెండాపై చర్చ – యోగికి దిశానిర్దేశం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ వ్యవహారంలో పార్టీ ఎన్నికల మూడ్‌లో ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, జాతీయత అంశాలను ఎజెండాతో రాబోయే ఎన్నికల కోసం ఎలా ముందుకు వెళ్లాల నే దానిపై కూడా ఒక వ్యూహం రూపొందించారని సమాచారం. ఎన్నికలకు ముందు అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి సంబంధించిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఒక యాత్రను చేపట్టేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయమని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పార్టీ హైకమాండ్ కోరిందని బీజేపీ కీలక నేత ఒకరు తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో సాధారణంగా జరిగే కుల సమీకరణాలను పరిష్కరించేందుకు కమలదళం ఒక ప్రణాళికను సైతం సిద్ధం చేసిందని సమాచారం. అంతేగాక ఓబీసీలకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాటు, ఇతర వెనుకబడిన వర్గాలు, తరగతుల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్ళాలని యోగి ఆదిత్యనాథ్‌కు హైకమాండ్ దిశానిర్దేశం చేసిందని తెలిసింది. -
బీజేపీ ‘ఇ–రావణులు’ను రంగంలోకి దించింది: అఖిలేష్
లక్నో: వచ్చే సంవత్సరం మొదలుకానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ ‘ఇ–రావణుల’ను రంగంలోకి దించిందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల వేదికపై మత విద్వేషం చిమ్మేందుకు బీజేపీ పథకరచన చేసిందని అఖిలేశ్ చెప్పారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేందుకు బీజేపీ రావణులు సిద్ధంగా ఉన్నారని, వారి వలలో పడకుండా ఎస్పీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. సమాజ్‌వాదీ నేతలపై దుష్ప్రచారానికి బీజేపీ కంకణం కట్టుకుందని, ఎస్పీ నేతలంతా మంచి నడవడికతో మెలగాలని సూచించారు. ‘రాక్షస రాజు రావణుడి తరహాలో సోషల్ మీడియాలో అబద్ధాలు, పుకార్లను పుట్టించి, యూపీ అంతటా ప్రచారం చేసేందుకు ఇ–రావణులను బీజేపీ తీసుకొచ్చింది’అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేశ్ వ్యాఖ్యానించారు. ‘కొందరు బీజేపీ నేతలు.. సమాజ్‌వాదీ పార్టీ నేతలుగా చెలామణి అవుతూ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యానాలు చేస్తూ వాటికి మరింత ప్రచారం కల్పిస్తారు. ఇలాంటి వారి పట్ల ఎస్పీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి అభ్యంతరకర పోస్టులను సరిచూసుకోకుండా మన కార్యకర్తలెవరూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. షేర్ చేయకండి. తప్పుడు పోస్ట్‌లపై ఎప్పటికప్పుడు పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి’ అని కార్యకర్తలకు అఖిలేశ్ సూచించారు. కొందరు అఖిలేశ్ యాదవ్ అధికారిక ట్విట్టర్ ఖాతా అంటూ ఒక నకిలీ అకౌంట్‌ను సృష్టించి, దాని ద్వారా మత విద్వేష వ్యాఖ్యానాలు, అంశాలను సోషల్ మీడియాలో ప్రచారం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా అఖిలేశ్ గుర్తుచేశారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ గత వారం ఫిర్యాదు కూడా చేసింది. ‘యూపీలో సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే అయోధ్యలో రామ మందిరం ఉన్న చోటే బాబ్రీ మసీదు నిర్మించనుంది’ అని పేర్కొన్న ట్వీట్ల స్కీన్షాట్లను ఆధారంగా చూపుతూ ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ పోలీసులకు ఫిర్యాదుచేయడం తెల్సిందే. ‘యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ యూపీలో అభివృద్ధిని గాలికొదిలేసింది. మరెన్నో సమస్యలు అలాగే ఉన్నాయి. వీటన్నింటి నుంచీ ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ నాయకత్వం ఎలాంటి దిగజారుడు పనులైనా చేస్తుంది. మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యం. ఎంతటి అబద్దాలనైనా నిజాలుగా నమ్మించి జనాలను మళ్లీ ఫూల్స్ చేయాలని చూస్తారు. జాగ్రత్త’ అని అఖిలేశ్ రాష్ట్ర ప్రజలను సున్నితంగా హెచ్చరించారు. ‘అబద్ధాలు చెప్పేసి బీజేపీ 300 సీట్లు గెలవగలిగింది. అలాంటప్పుడు ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రాష్ట్ర అభివృద్ధిని చూపించి మనం అంతకంటే ఎక్కువ సీట్లను గెలవగలం. వచ్చే ఎన్నికల్లో ఎస్పీ 350 సీట్లను గెలుస్తుంది’ అని అఖిలేశ్ ధీమాగా చెప్పారు. -
చిన్న తేడాతో గెలుపు గల్లంతే
► విజయావకాశాల్ని నిర్దేశిస్తున్న ఓట్లశాతంలో స్వల్ప తేడా ► గత ఫలితాల్ని ఉదాహరణగా చూపుతున్న విశ్లేషకులు లక్నో: ఓటరు నాడి అంతుపట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎస్పీ–కాంగ్రెస్ కూటమి, బీజేపీ, బీఎస్పీల మధ్య త్రిముఖ పోరులో విజేత ఎవరన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఓట్ల శాతంలో స్వల్ప తేడా కూడా సీట్ల సంఖ్యలో భారీ అంతరానికి కారణమవచ్చంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓటర్ల ఆలోచనా ధోరణిలో చిన్న మార్పు పార్టీలు, అభ్యర్థుల గెలుపోటముల్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల ఫలితా లు అందుకు నిదర్శనంగా వారు ఉదహరిస్తున్నారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 30 శాతం, ఎస్పీ 26 , బీజేపీ 17, కాంగ్రెస్ 8.5 శాతం ఓట్లు గెలుచుకున్నాయి. అప్పుడు సమాజ్‌వాదీ గెలుపొందిన స్థానాలు 97. ఐదేళ్ల అనంతరం 2012లో ఎస్పీ కేవలం అదనంగా మూడు శాతం ఓట్లు మాత్రమే దక్కించుకుని 97 స్థానాల నుంచి రికార్డు స్థాయిలో 224 స్థానాలకు ఎగబాకింది. 2007తో పోల్చితే బీఎస్పీ 4.5 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా సాధించినా.... ఆ పార్టీ గెలుపొందిన స్థానాలు 206(2007) నుంచి 80కు పడిపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లోను... ఇక 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 (18.25 ఓట్లశాతం), ఎస్పీ 23 (23.26%) స్థానాలతో మంచి ఫలితాలు సాధించాయి. బీఎస్పీ 20 (27.42%) స్థానాలకు పరిమితం కాగా... బీజేపీ కేవలం 10 (17.5%) స్థానాలతో సరిపెట్టుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితాలు తారమారయ్యాయి. బీజేపీ ఓట్లశాతం 42.6కు ఎగబాకడంతో 71 స్థానాలతో ప్రత్యర్థి పార్టీల్ని చిత్తుచేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... మొత్తం 403 గాను 80 శాతం స్థానాల్లో బీజేపీ ముందంజలో నిలిచింది. ఎస్పీ 42 అసెంబ్లీ స్థానాల్లో, బీఎస్పీ కేవలం 9 స్థానాల్లో ఆధిక్యం కనపరిచాయి. కోడలు, తమ్ముడి కోసం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్... కోడలు, తమ్ముడి కోసం రంగంలోకి దిగారు. వారిద్దరి గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆయన... ఆ రెండు స్థానాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ పోటీచేస్తున్న జశ్వంత్‌నగర్‌లో ప్రచారం చేస్తూ... ఈ ఎన్నికలు తనకు, శివ్‌పాల్‌కు ఎంతో ముఖ్యమైనవన్నారు. కోడలు అపర్ణ విజయంతో తన గౌరవం ముడిపడిఉందంటూ ఉద్వేగంగా చెప్పారు. 2014 కంటే 10% తగ్గినా.. విశ్లేషకుల అంచనా ప్రకారం... 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో బీజేపీకి 10 శాతం తగ్గినప్పటికీ అధికార పీఠం దక్కించుకునే అవకాశాలున్నాయి. బీజేపీ 32 శాతం ఓట్లు సాధిస్తే మెజార్టీకి అవసరమైన 202 సీట్లను సులువుగా గెలుచుకోవచ్చు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోను ఆ స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఓబీసీల్లో పట్టున్న అప్నాదళ్‌తో పొత్తు తమకు లాభిస్తుందనే ఆలోచనలో బీజేపీ ఉంది. -
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: సీఎం
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం, సమాజ్ వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. యూపీ శాసనసభకు జరిగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయనని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తేల్చేశారు. నేడు ఇక్కడి పార్టీ ఆఫీసులో కొందరు నేతలతో సమావేశం సందర్భంగా కొన్ని విషయాలను ప్రస్తావించారు. అందరు అనుకున్నట్లుగా, మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తాను సరోజినీ నగర్ నుంచి బరిలోకి దిగడం లదేని, ఆ స్థానంలో శార్దా ప్రతాప్ శుక్లా ఉన్నారని చెప్పారు. ఆ నియోజకవర్గం నుంచే కాదు తాను ఎక్కడి నుంచీ పోటీ చేయనని అఖిలేశ్ స్పష్టం చేశారు. 2018 వరకూ తాను ఎమ్మెల్సీగానే కొనసాగుతానని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం మాత్రమే చేయనున్నట్లు వివరించారు. బుందేల్ ఖండ్ నుంచి పోటీ చేయాలని తనకు ఉందని, అక్కడి ప్రజలకు బలమైన ప్రాతినిద్యం కావాలని కోరుకుంటున్నారని అందుకే ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించినట్లు ఇటీవల స్వయంగా అఖిలేశ్ తెలిపారు. ఈ అఖిలేశ్ రెండు చోట్ల నుంచి నామినేషన్ వేస్తారని ఎస్పీలో ఊహాగానాలు వినిపించాయి. అయితే సీఎం తాజా నిర్ణయంతో పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ప్రచారంపై మాత్రమే దృష్టిపెట్టాలని, లేనిపక్షంలో ఐదేళ్లు కష్టాలు తప్పవని పార్టీ నేతలకు అఖిలేశ్ సూచించారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకైతే రెండు పార్టీల నేతలు కలిసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టలేదు. -
'సీఎం పిలిచినా ఎన్నికల్లో ప్రచారం చేయను'
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకూడదని, లౌకిక శక్తులను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్వయంగా ఆహ్వానించినా ఎన్నికల ప్రచారం చేసే ప్రసక్తే లేదని నితీశ్ స్పష్టం చేశారని జేడీయూ జనరల్ సెక్రటరీ కేసీ త్యాగి మీడియాకు తెలిపారు. పార్టీ కోర్ కమిటీ మీటింగ్‌లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. యూపీ ఎన్నికల్లో మతతత్వ శక్తులు ఓడిపోవాలని బీజేపీని ఉద్దేశించి నితీశ్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)-కాంగ్రెస్ కూటమి నెగ్గాలని మనస్ఫూర్తిగా తమ పార్టీ కోరుకుంటుందని చెప్పారు. ఎస్పీ- కాంగ్రెస్ పార్టీలు ఇతర పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయలేకపోవడం నిరాశపరిచిందని నితీశ్ అభిప్రాయపడ్డారు. 2019లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మనం గెలవాలంటే, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీని ఓడించి తీరాలన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయకపోయినా ఎస్పీ-కాంగ్రెస్ కూటమి గెలవాలని నితీశ్ కోరుకుంటున్నారని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. -
పోటీ చేయం కానీ, ఆ పార్టీకి చుక్కలు చూపిస్తాం!
లక్నో: రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకపోయినా.. ఆ రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా గట్టి ప్రచారం చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పష్టం చేసింది. ఈ మేరకు యూపీ ఎన్నికల్లో తాము క్రియాశీల ప్రచారం నిర్వహిస్తామని ఆ పార్టీ పేర్కొంది. తాము పోటీ చేస్తున్న పంజాబ్, గోవా ఎన్నికల ప్రక్రియ ముగియగానే తమ దృష్టి మొత్తం యూపీపైనే కేంద్రీకరిస్తామని, పార్టీ కీలక నేతలు, స్టార్ కాంపెయినర్లు రంగంలోకి దిగి.. బీజేపీని బట్టబయలు చేసేలా ప్రచారం నిర్వహిస్తారని ఆప్ అధికార ప్రతినిధి వైభవ్ మహేశ్వరి పేర్కొన్నారు. 'బీజేపీ దేశాన్ని మోసం చేసింది. జాతీయ రాజకీయాల్లో అతిపెద్ద దెయ్యం ఆ పార్టీనే' అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అసలు స్వరూపమేమిటో ప్రజలకు వివరిస్తామని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే యూపీలో జరగబోతుందో వివరిస్తామని చెప్పారు. -
అందుకే ఆమె పార్టీ మారారు!
లక్నో: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, యూపీసీసీ మాజీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి.. బీజేపీలో చేరడం ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎందుకు పార్టీ మారారన్న దానిపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలకు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడం వల్లే బీజేపీలోకి వెళ్లిపోయారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. లక్నో సెంట్రల్ నియోజకర్గం నుంచి రీటా, లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి తన కుమారుడు మయాంక్ కు టికెట్ అడిగారని తెలిపాయి. దీంతోపాటు షీలా దీక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తూ తనను పక్కన పెట్టడంతో రీటా అంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి బలమైన సంబంధాలునప్పటికీ తనను పట్టించుకోకపోవడంతో ఆమె కలత చెందారు. రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన కిసాన్ యాత్రలోనూ ఆమెకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. ఆవేశపూరిత నాయకురాలిగా ముద్రపడిన రీతా బహుగుణ 2009లో మాయావతిపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టయ్యారు. బీఎస్పీ కార్యకర్తలు ఆమె ఇంటిపై దాడి చేసి నిప్పటించారు. అయితే పార్టీ మారడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. 1998లో సుల్తాన్ పూర్ లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు సార్లు(2009, 2014) లక్నో లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 28 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో యూపీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఆమెను తప్పించి నిర్మల్ ఖాత్రిని నియమించారు. -
వచ్చే ఎన్నికల్లో యూపీలో హంగ్!
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారం సాధించాలన్న బీజేపీ కల సాకారమవుతుందా? అధికార సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ మెజారిటీ సాధిస్తుందా? అంటే యాక్సిస్-ఇండియా టుడే సర్వే ప్రకారం ఈ రెండూ జరగకపోవచ్చు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌లో హంగ్ ఏర్పడుతుందని సర్వేలో తేలింది. గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో జోరు తగ్గినా అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మొత్తం 403 అసెంబ్లీ సీట్లున్న యూపీలో అధికారం సాధించాలంటే 202 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇండియా టుడే సర్వే ప్రకారం బీజేపీ 170 నుంచి 183 సీట్లు గెలిచే అవకాశముంది. ఇక అధికార సమాజ్‌వాదీ పార్టీకి పరాజయం తప్పకపోవచ్చు. ఎస్పీ 94-103 సీట్లు గెలిచి మూడో స్థానంలో నిలవనుంది. ఇక బీఎస్పీ 115 నుంచి 124 సీట్లు సాధించే అవకాశముంది. కాంగ్రెస్‌కు 8 నుంచి 12, ఇతరులకు 2 నుంచి 6 సీట్లు రావచ్చు. -
సమాజ్ వాదీ పార్టీకి షాక్
లక్నో: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఆదివారం బీజేపీలో చేరారు. మీరట్ జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు మనీందర్ పాల్ సింగ్, యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రాహుల్ యాదవ్ తమ మద్దతుదారులతో కలిసి కాషాయ పార్టీలోకి వచ్చారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ నాయకులు బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.