అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: సీఎం
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం, సమాజ్ వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. యూపీ శాసనసభకు జరిగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయనని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తేల్చేశారు. నేడు ఇక్కడి పార్టీ ఆఫీసులో కొందరు నేతలతో సమావేశం సందర్భంగా కొన్ని విషయాలను ప్రస్తావించారు. అందరు అనుకున్నట్లుగా, మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తాను సరోజినీ నగర్ నుంచి బరిలోకి దిగడం లదేని, ఆ స్థానంలో శార్దా ప్రతాప్ శుక్లా ఉన్నారని చెప్పారు. ఆ నియోజకవర్గం నుంచే కాదు తాను ఎక్కడి నుంచీ పోటీ చేయనని అఖిలేశ్ స్పష్టం చేశారు. 2018 వరకూ తాను ఎమ్మెల్సీగానే కొనసాగుతానని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం మాత్రమే చేయనున్నట్లు వివరించారు.
బుందేల్ ఖండ్ నుంచి పోటీ చేయాలని తనకు ఉందని, అక్కడి ప్రజలకు బలమైన ప్రాతినిద్యం కావాలని కోరుకుంటున్నారని అందుకే ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించినట్లు ఇటీవల స్వయంగా అఖిలేశ్ తెలిపారు. ఈ అఖిలేశ్ రెండు చోట్ల నుంచి నామినేషన్ వేస్తారని ఎస్పీలో ఊహాగానాలు వినిపించాయి. అయితే సీఎం తాజా నిర్ణయంతో పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ప్రచారంపై మాత్రమే దృష్టిపెట్టాలని, లేనిపక్షంలో ఐదేళ్లు కష్టాలు తప్పవని పార్టీ నేతలకు అఖిలేశ్ సూచించారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకైతే రెండు పార్టీల నేతలు కలిసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టలేదు.