ఓటమి తర్వాత వివాదంలో అఖిలేశ్!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేశ్ ప్రభుత్వం ఓటమి నేపథ్యంలో ఆ రాష్ట్ర అధికారిక సీఎంవో, ప్రభుత్వ ట్విట్టర్‌లో ట్వీట్లు మాయమవ్వడం వివాదమవుతోంది. యూపీ అధికారిక సీఎంవో, ప్రభుత్వ (@CMOfficeUP, @UPGovt) ట్విట్టర్ పేజీలలో ఇప్పటివరకు ఉంచిన సమాచారాన్నంత డిలీట్ చేశారని సీనియర్ జర్నలిస్టు ఒకరు ఆరోపించారు. ఈ పేజీల్లోని ట్వీట్లన్ని డిలీట్ చేశారని, వాస్తవానికి వీటిని ఆర్ఖైవ్‌లో ఉంచాల్సి ఉంటుందని యూపీకి చెందిన నేషనల్ వాయిస్ చానెల్ ఎడిటర్ బ్రజేష్ మిశ్రా తెలిపారు.
ఈ ట్వీట్లను ఎవరు డిలీట్ చేశారు? ఎందుకు చేశారు? అంటూ ఆయన ప్రశ్నించారు. నిజానికి ఈ రెండు ట్విట్టర్ పేజీల్లోనూ ప్రస్తుతం ట్వీట్లు కనిపించడం లేదు. యూపీ సీఎంవో ట్విట్టర్‌లో 2015 నవంబర్ 19న చివరి ట్వీట్లు ఉండగ, యూపీ ప్రభుత్వ ట్విట్టర్‌లో 2014 సెప్టెంబర్ 7 న చివరి ట్వీట్ కనిపిస్తోంది. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ బీజేపీ చేతిలో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.