మాయాకు అసాధ్యమే.. అఖిలేశ్‌కు ఇదే బెస్ట్!
లక్నో: రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ కొన్నిసార్లు ఎదురయ్యే పరాభవాలు మాత్రం ఆయా నాయకుల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయి. తాత్కాలికమే కావొచ్చు కానీ, ప్రస్తుతం బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావాలన్న ఆమె ఆశలను తాజా అసెంబ్లీ ఎన్నికలు చిత్తు చేశాయి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఆమె పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగియనుంది.
ఇక, మరోవైపు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ రాజ్యసభ వైపు ముగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతుండటంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బీజేపీ సర్కారును ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభకు వెళ్లడమే ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ పెద్దలసభకు వెళ్లాలన్నా అఖిలేశ్ వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఆగక తప్పదు.
ఎమ్మెల్సీగా కొనసాగుతూ 2012 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి ఆ తర్వాతి ఎన్నికల్లో ఎస్పీ చేతిలో పరాజయం ఎదురవ్వడంతో రాజ్యసభకు మారారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి 87 సీట్లు రావడంతో పెద్దలసభలో ఆమె ఎంట్రీకి ఎలాంటి అవాంతరాలు ఏర్పడలేదు. కానీ, ఈసారి బీఎస్పీ కేవలం 19 స్థానాలు మాత్రమే గెలుపొందడంతో ఆమె మరోసారి రాజ్యసభకు ఎన్నిక కావడం దాదాపు అసాధ్యమే. ఈ సవాల్‌ను మాయావతి ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. బిహార్ ఫార్మూలాను తెరపైకి తెచ్చి బద్ధ విరోధి ఎస్పీతో ఆమె జత కలుస్తారా? అన్నది వేచి చూడాలి. ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపితే.. ఆ రెండు రాజ్యసభ స్థానాలను గెలుచుకునే అవకాశముంది. అప్పుడు రాజ్యసభకు అఖిలేశ్‌కు, మాయావతికి ఎంట్రీ ఉంటుంది. కానీ, అప్పటివరకు రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయి? అనేది ఇప్పుడే చెప్పలేం.