'సీఎం పిలిచినా ఎన్నికల్లో ప్రచారం చేయను'
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకూడదని, లౌకిక శక్తులను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్వయంగా ఆహ్వానించినా ఎన్నికల ప్రచారం చేసే ప్రసక్తే లేదని నితీశ్ స్పష్టం చేశారని జేడీయూ జనరల్ సెక్రటరీ కేసీ త్యాగి మీడియాకు తెలిపారు. పార్టీ కోర్ కమిటీ మీటింగ్‌లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. యూపీ ఎన్నికల్లో మతతత్వ శక్తులు ఓడిపోవాలని బీజేపీని ఉద్దేశించి నితీశ్ పరోక్షంగా వ్యాఖ్యానించారు.
యూపీలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)-కాంగ్రెస్ కూటమి నెగ్గాలని మనస్ఫూర్తిగా తమ పార్టీ కోరుకుంటుందని చెప్పారు. ఎస్పీ- కాంగ్రెస్ పార్టీలు ఇతర పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయలేకపోవడం నిరాశపరిచిందని నితీశ్ అభిప్రాయపడ్డారు. 2019లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మనం గెలవాలంటే, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీని ఓడించి తీరాలన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయకపోయినా ఎస్పీ-కాంగ్రెస్ కూటమి గెలవాలని నితీశ్ కోరుకుంటున్నారని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు.