పోటీ చేయం కానీ, ఆ పార్టీకి చుక్కలు చూపిస్తాం!
లక్నో: రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకపోయినా.. ఆ రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా గట్టి ప్రచారం చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పష్టం చేసింది. ఈ మేరకు యూపీ ఎన్నికల్లో తాము క్రియాశీల ప్రచారం నిర్వహిస్తామని ఆ పార్టీ పేర్కొంది.
తాము పోటీ చేస్తున్న పంజాబ్, గోవా ఎన్నికల ప్రక్రియ ముగియగానే తమ దృష్టి మొత్తం యూపీపైనే కేంద్రీకరిస్తామని, పార్టీ కీలక నేతలు, స్టార్ కాంపెయినర్లు రంగంలోకి దిగి.. బీజేపీని బట్టబయలు చేసేలా ప్రచారం నిర్వహిస్తారని ఆప్ అధికార ప్రతినిధి వైభవ్ మహేశ్వరి పేర్కొన్నారు. 'బీజేపీ దేశాన్ని మోసం చేసింది. జాతీయ రాజకీయాల్లో అతిపెద్ద దెయ్యం ఆ పార్టీనే' అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అసలు స్వరూపమేమిటో ప్రజలకు వివరిస్తామని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే యూపీలో జరగబోతుందో వివరిస్తామని చెప్పారు.