అందుకే ఆమె పార్టీ మారారు!
లక్నో: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, యూపీసీసీ మాజీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి.. బీజేపీలో చేరడం ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎందుకు పార్టీ మారారన్న దానిపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలకు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడం వల్లే బీజేపీలోకి వెళ్లిపోయారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
లక్నో సెంట్రల్ నియోజకర్గం నుంచి రీటా, లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి తన కుమారుడు మయాంక్ కు టికెట్ అడిగారని తెలిపాయి. దీంతోపాటు షీలా దీక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తూ తనను పక్కన పెట్టడంతో రీటా అంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి బలమైన సంబంధాలునప్పటికీ తనను పట్టించుకోకపోవడంతో ఆమె కలత చెందారు. రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన కిసాన్ యాత్రలోనూ ఆమెకు సరైన ప్రాధాన్యం దక్కలేదు.
ఆవేశపూరిత నాయకురాలిగా ముద్రపడిన రీతా బహుగుణ 2009లో మాయావతిపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టయ్యారు. బీఎస్పీ కార్యకర్తలు ఆమె ఇంటిపై దాడి చేసి నిప్పటించారు. అయితే పార్టీ మారడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. 1998లో సుల్తాన్ పూర్ లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు సార్లు(2009, 2014) లక్నో లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 28 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో యూపీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఆమెను తప్పించి నిర్మల్ ఖాత్రిని నియమించారు.