Rita Bahuguna Joshi
-
దీపావళి: బీజేపీ ఎంపీ ఇంట తీవ్ర విషాదం
లక్నో: దీపావళి పండుగ రోజు బీజేపీ ఎంపీ రీటా బహుగుణ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రీటా మనమరాలు టపాసులు కాలుస్తుండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు అంటుకోవడంతో తీవ్ర గాయాలపాలైన ఆరేళ్ల చిన్నారిని ప్రయాగ్‌రాజ్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. 60 శాతం వరకు కాలిన గాయాలతో అక్కడే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె మరణించింది. అయితే రీటా కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం. వారి విజ్ఞప్తి మేరకు మీడియాకు పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి వైద్యులు నిరాకరించారు. (చదవండి: 40 లక్షల దొంగతనం: చివరికి.. ) ఇక ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాపను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా ఢిల్లీ తీసుకువెళ్లాలని భావించామని, అయితే అంతలోనే దురదృష్టవశాత్తూ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని వాపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు. రీటా కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాదకర ఘటన గురించి కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. ‘‘మొదట పాప బాగానే ఉన్నట్లు సమాచారం అందింది, కానీ అంతలోనే తను చనిపోయిందని తెలిసింది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు’’ అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో చిన్న పిల్లలు క్రాకర్స్ కాల్చే సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. కాగా యూపీకి చెందిన రీటా బహుగుణ ప్రస్తుతం అలహాబాద్ నియోజవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
కాంగ్రెస్‌ను వీడి మంత్రి అయ్యారు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషికి సముచిత ప్రాధాన్యం లభించింది. బీజేపీలో చేరిన కొన్ని నెలలకే ఆమె కేబినెట్ మంత్రి అయ్యారు. లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్‌పై గెలిచిన రీటాకు మంత్రి పదవి దక్కింది. ఆదివారం యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం చేయగా, కేబినెట్ మంత్రిగా రీటా ప్రమాణం చేశారు. ఇక బీఎస్పీని వీడి బీజేపీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్యకు మంత్రి పదవి లభించింది. 2007 నుంచి 2012 వరకు యూపీసీసీ అధ్యక్షురాలుగా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా రీటా పనిచేశారు. ఆమె తండ్రి హేమవతీ నందన్ బహుగుణ మాజీ ముఖ్యమంత్రి. రీటా సోదరుడు విజయ్ బహుగుణ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతేడాది అక్టోబరులో రీటా కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. -
ఆలయాల ముందు అభ్యర్థుల బారులు!
లక్నో: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు ఆలయాల ముందు బారులు తీరారు. తమ పార్టీలు విజయం సాధించాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషి.. హజ్రత్ గంజ్ హనుమాన్ దేవాలయంలో ఈ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ విజయం కోసం లక్నోలో హోమాలు చేపట్టారు. పలుచోట్ల ఆయా పార్టీల అభ్యర్థులను ప్రార్థనా మందిరాలను సందర్శించారు. ఎన్నికల ఫలితాలను పురస్కరించుకుని వారణాసిలో ముందుగానే లడ్డూలు తయారు చేశారు. -
మెగా పోరు: బరిలో అఖిలేశ్ మరదలు!
లక్నో: ఇప్పుడు అందరి దృష్టి లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గంపైనే నెలకొని ఉంది. ఈ నియోజకవర్గంలో తన మరదలు అపర్ణ యాదవ్‌ను అఖిలేశ్ బరిలోకి దింపితే.. యూపీ ఎన్నికల్లోనే అత్యంత ఆసక్తికరమైన పోరు ఇక్కడ జరిగే అవకాశముంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి కాషాయ కండువా కప్పుకొన్న సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషీని బీజేపీ ఇక్కడ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఆమె ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు అపర్ణ యాదవ్‌ను ఎస్పీ ఇక్కడ బరిలోకి దింపితే రసవత్తరమైన పోరు ఖాయగా కనిపిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ ఈ స్థానానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. కానీ ఈ టికెట్‌ను అపర్ణకే కేటాయించాలని అఖిలేశ్‌ను ములాయం కోరుతున్నారు. ములాయం రెండో భార్య కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ. దాదాపు ఏడాది కిందటే లక్నో కంటోన్మెంట్ సీటును అపర్ణకు ములాయం కేటాయించారు. ఈ స్థానంలో ఎస్పీ ఎప్పుడూ గెలువలేదు. అయినా, ఇక్కడ బలమైన అభ్యర్థి రీటాను ఎదుర్కొనేందుకు అపర్ణ గతకొంతకాలంగా శ్రమిస్తున్నారు. జోరుగా నియోజకవర్గంలో తిరుగుతూ పట్టు పెంచుకుంటున్నారు. అయితే, ఇటీవల ఎస్పీలో రాజుకున్న కుటుంబపోరు అపర్ణకు ప్రతికూలంగా మారింది. తండ్రితో తలెత్తిన ఈ కుటుంబపోరులో ఆధిపత్యం సాధించిన అఖిలేశ్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న తెలిసిందే. ఈ పోరులో తన ప్రత్యర్థి అయిన బాబాయ్ శివ్‌పాల్ యాదవ్‌ను కరికరించి.. ఆయనకు ఎస్పీ సీటును కేటాయించిన సంగతి తెలిసిందే. శివ్‌పాల్ వర్గం వ్యక్తిగా ముద్రపడి.. ఎస్పీలో కుటుంబపోరుకు కారణమైనట్టు భావిస్తున్న అపర్ణ యాదవ్‌కు అఖిలేశ్ ఈ సీటు కేటాయిస్తారా లేదా అన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. తండ్రి అభీష్టాన్ని మన్నించి ఇక్కడ అపర్ణకు టికెట్ కేటాయిస్తే.. ఇక్కడ అపర్ణ-రీటా మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. -
కపిల్ సిబల్ పై రీటా బహుగుణ గరం గరం..
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పై ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ మహిళా నేత రీటా బహుగుణ జోషీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన నుంచి డబ్బులు తీసుకుని తిరిగివ్వలేదని కపిల్ సిబల్ ఆరోపించడమే రీటా బహుగుణ ఆగ్రహానికి ప్రధాన కారణం. తనపై వ్యాఖ్యలు చేసిన సిబల్ క్షమాపణ కోరాలని ఆమె డిమాండ్ చేశారు. యూపీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీ నేత రీటా బహుగుణ బీజేపీలో చేరారన్న కారణంగా సిబల్ ఆమెపై ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత డబ్బు తీసుకుని తిరిగివ్వలేదన్న తరహాలో కాంగ్రెస్ ఎంపీ సిబల్ ప్రచారం చేసి హడావిడి చేశారు. అందులో భాగంగా రీటాను.. ఆ వలస పక్షి తన డబ్బులతో ఎగిరిపోయింది అన్నట్లు సిబల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై స్పందించిన రీటా బహుగుణ.. సిబల్ వంటి సీనియర్ నేతలు ఇలాంటి చవకబారు రాజకీయాలకు పాల్పడుతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సిబల్ నుంచి తన నియోజకవర్గం కోసం ఎంపీలాడ్(ఎంపీ నిధులు) ఫండ్ తీసుకున్నానని, అయితే అది ఎవరి వ్యక్తిగత డబ్బు కాదని ఆమె ఘాటుగా స్పందించారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వెంటనే సిబల్ కు, లక్నో కలెక్టర్ కు తన ఖాతా రద్దు చేయాలని, నిధులను వెనక్కి తీసుకోవాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. -
రీటా నిష్క్రమణకు రాహుల్ కారణమా?
ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రీటా బహుగుణ పార్టీకి తీలోదకాలిచ్చి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఆమె చెబుతున్నట్లు రాహుల్ గాంధీ నాయకత్వ లోపమే కారణమా? మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? రాహుల్ గాంధీ నాయకత్వ లోపం కారణంగానే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నామని తమిళనాడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జయంతి నటరాజన్, ఒడిషాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ హిమంత్ విశ్వశర్మ గతేడాది ఆరోపించిన విషయం తెల్సిందే. వారి తరహాలోనే రాహుల్ నాయకత్వంలో పార్టీ బలపడే అవకాశం లేనందునే తాను బీజేపీలోకి జంప్ చేశానని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ రీటా బహుగుణ ప్రకటించారు. యూపీ పార్టీలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బహిరంగంగా ప్రకటించకపోయినా అంతర్గత చర్చల్లో రాహుల్ గాంధీకి నాయకత్వ పరిణతి లేకపోవడం వల్లన పార్టీ బలోపేతం కాలేకపోతోందని అంటున్నారు. 'ఫర్వాలేదు, పార్టీ బలోపేతం అవుతోందని అనుకుంటున్నంతలోనే పార్టీలో ఏదో ఉపద్రవం ముంచుకొస్తోంది. ప్రతిసారి ఇలాగే అవుతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాక్ భూభాగంలో సర్జికల్ దాడులు జరిపినప్పుడు సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీయే ఆ తర్వాత మాట మార్చి సర్జికల్ దాడులకు సాక్ష్యాధారాలు చూపించమని అడగడం, సైనికుల రక్తంతో మోదీ రాజకీయం చేస్తున్నారంటూ అనుచిత విమర్శలు చేయడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది' అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని యూపీ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడొకరు మీడియాతో వ్యాఖ్యానించారు. కిసాన్ ర్యాలీతో పార్టీ బలపడుతోందని భావిస్తున్న తరుణంలోనే రైతుల సమస్యలపై మాట్లాడాల్సిన రాహుల్ గాంధీ తగదునమ్మా అంటూ మోదీని విమర్శించడం రాజకీయ పరిణతి లేకపోవడమేనని మరో కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ కారణాలకంటే రీటా బహుగుణ పార్టీ వీడడానికి వ్యక్తిగత కారణాలే ఎక్కువగా ఉన్నాయి. 2003 నుంచి 2008 వరకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, 2007 నుంచి 2012 వరకు యూపీసీసీ అధ్యక్షురాలుగా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగిన రీటా బహుగుణను గత రెండేళ్లుగా పూర్తిగా పక్కన పెట్టడం ఆమెకు కోపం తెప్పించింది. పొరుగు రాష్ట్రం నుంచి షీలా దీక్షిత్‌ను తీసుకొచ్చి పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కూడా ఆమెను నొప్పించింది. యూపీ పార్టీ ఎన్నికల కమిటీలోకి కేవలం సభ్యురాలిగా మాత్రమే తీసుకొని ఏ ప్యానెల్ బాధ్యతలు కూడా అప్పగించకపోవడం ఆమె కోపాన్ని రెట్టింపు చేసింది. రీటా బహుగుణ బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయకురాలే అయినా ఆమెకు ఎప్పుడూ అలాంటి గుర్తింపు లేదు. ఆవేశపూరిత నాయకురాలిగా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమవతీ నందన్ బహుగుణ కూతురుగానే ఆమెకు గుర్తింపు ఉంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తన సోదరుడు విజయ్ బహుగుణను కాంగ్రెస్ పార్టీ అధిస్టానం 2014న తప్పించినప్పుడు రీటా బహుగుణ తన కుటుంబ సభ్యులను పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని సన్నిహితుల వద్ద వాపోయినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడే ఆమె సోదరుడు విజయ్ బహుగుణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోవడంతో ఆ పార్టీలో చేరేందుకు రీటా బహుగుణకు మార్గం సులువైంది. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే ఆమె తన నియోజకవర్గమైన లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి గెలిచిన ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్‌ను ఓడించడం అసాధ్యం. అందుకనే మోదీ సర్జికల్ దాడులను ప్రశంసించడం ద్వారా త్వరలో తాను తీసుకోబోయే పార్టీ తీర్థం గురించి ఆమె ముందుగానే ఉప్పందించారు. ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమవుతాయనే ఆందోళనతో ఉన్న బీజేపీ ఇప్పుడు రీటా బహుగుణ చేరికతో షీలా దీక్షిత్‌కు పోటీగా ఆమెను దించే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
అందుకే ఆమె పార్టీ మారారు!
లక్నో: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, యూపీసీసీ మాజీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి.. బీజేపీలో చేరడం ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎందుకు పార్టీ మారారన్న దానిపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలకు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడం వల్లే బీజేపీలోకి వెళ్లిపోయారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. లక్నో సెంట్రల్ నియోజకర్గం నుంచి రీటా, లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి తన కుమారుడు మయాంక్ కు టికెట్ అడిగారని తెలిపాయి. దీంతోపాటు షీలా దీక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తూ తనను పక్కన పెట్టడంతో రీటా అంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి బలమైన సంబంధాలునప్పటికీ తనను పట్టించుకోకపోవడంతో ఆమె కలత చెందారు. రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన కిసాన్ యాత్రలోనూ ఆమెకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. ఆవేశపూరిత నాయకురాలిగా ముద్రపడిన రీతా బహుగుణ 2009లో మాయావతిపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టయ్యారు. బీఎస్పీ కార్యకర్తలు ఆమె ఇంటిపై దాడి చేసి నిప్పటించారు. అయితే పార్టీ మారడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. 1998లో సుల్తాన్ పూర్ లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు సార్లు(2009, 2014) లక్నో లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 28 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో యూపీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఆమెను తప్పించి నిర్మల్ ఖాత్రిని నియమించారు. -
బీజేపీలోకి రీటా బహుగుణ
బీజేపీ చీఫ్ అమిత్‌షా సమక్షంలో చేరిక.. యూపీలో కాంగ్రెస్‌కు షాక్ న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, యూపీసీసీ మాజీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో 67 ఏళ్ల బహుగుణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేశారు. బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ నడిపిస్తున్న విధానంపై ఆమె విమర్శలు గుప్పించారు. దేశం రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించే స్థితిలో లేదని, ఆయన తీరుతో చాలా మంది సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. యూపీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును ప్రకటించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. సర్జికల్ దాడులకు సంబంధించి ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. సర్జికల్ దాడులకు సంబంధించి భారత్ వాదనను మొత్తం ప్రపంచం అంగీకరించిందన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీకి ప్రత్యామ్నాయం లేదన్నారు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, సీనియర్ నాయకులను పక్కన పెడుతున్నారని, వారు ఏం మాట్లాడాలి.. ఎంత మాట్లాడాలనే విషయం కూడా ఆయనే చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసమే తాను బీజేపీలో చేరినట్టు బహుగుణ చెప్పారు. రీటా నమ్మకద్రోహి అని కాంగ్రెస్ మండిపడింది. బ్రాహ్మణ ఓట్లపై ప్రభావం! రీటా బహుగుణ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. స్వాతంత్య్ర సమరయోధుడు, యూపీ మాజీ సీఎం హేమ్వతి నందన్ బహుగుణ కుమార్తె. రాహుల్, షీలాదీక్షిత్ మాదిరిగానే రాజకీయ వారసత్వంతో వచ్చిన రీటా 24 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్నారు. బ్రాహ్మణ ఓటర్లను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న రీటా చేరిక బీజేపీకి మేలు చేసేదే. అసలే ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే అంశమే. మరోవైపు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీలో చేరిన రీటా ఆ పార్టీలో ఎలా సర్దుకుపోతారనేది కూడా ఆసక్తికరంగా ఉంది. -
రాహుల్ యాత్ర ముగియగానే.. కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలతో పూర్వ వైభవం కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నెలరోజులపాటు యూపీ అంతా కలియతిరిగి.. ‘రైతు యాత్ర’ను ముగిసిన కొద్దివారాలకే యూపీ కాంగ్రెస్ సీనియర్ నేత రీటా బహుగుణ జోషీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ దిగ్గజం హేమవతి నందన్ బహుగుణ తనయురాలైన ఆమె హస్తాన్ని వీడి.. కాషాయం కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో గురువారమిక్కడ ఆమె కమలంలో చేరారు. 67 ఏళ్ల రీటా ప్రస్తుతం లక్నోలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెతోపాటు ఆమె సోదరుడు, మాజీ ఉత్తరాఖండ్ మాజీ సీఎం విజయ్ బహుగుణ కూడా బీజేపీలో చేరారు. గతంలో కాంగ్రెస్ యూపీ చీఫ్‌గా చాలాకాలంపాటు రీటా బహుగుణ సేవలందించారు. అయితే. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం, యూపీ పార్టీ చీఫ్‌గా రాజ్ బబ్బర్‌ను నియమించి తనను పక్కనబెట్టడంతో ఆమె అసంతృప్తి చెంది పార్టీ మారారు. బీజేపీ చేరిన సందర్భంగా రీటా మాట్లాడుతూ రాహుల్‌గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ నాయకత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరించారని అన్నారు. యూపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నియమించుకున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పోల్ మేనేజర్‌గా ఉండగలడు కానీ, పోల్ డైరెక్టర్ కాలేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాల కోసమే తాను కమలం పార్టీలో చేరినట్టు చెప్పారు. పీవోకేలో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు చూపించాలనడం దారుణమన్నారు. యూపీలో మాఫియా రాజ్యం ఏలుతోందని, యూపీలో శాంతిభద్రతలతో కూడిన సుపరిపాలన రావాలంటే ఎస్పీ, బీఎస్పీ మాఫియా నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని ఆమె పేర్కొన్నారు. -
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రీటా బహుగుణ జోషి త్వరలో ఆ పార్టీకి హ్యాండ్ ఇవ్వనున్నారు. రీటా బహుగుణ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె ఇతర పార్టీ నేతలతో కలిసి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కలిసినట్లు తెలుస్తోంది. కాగా ఉత్తరప్రదేశ్ ను 'హస్త'గతం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందే షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం యూపీ పీసీసీ అధ్యక్షుడు నిర్మల్ ఖాత్రి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా రీటా బహుగుణ కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. కాగా రీటా బహుగుణ గతంలో యూపీసీసీ చీఫ్‌గా పని చేశారు. అయితే 2012 యూపీ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం రీటా బహుగుణ లక్నో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో చేరతారనే మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ చివరికి ఆమె బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మాస్ అప్పిరియన్స్ లేకపోయినప్పటికీ ఆరోపణలు చేయడంలో ఏ మాత్రం వెనుకాడే తత్వం కాదు రీటా బహుగుణది. రాజకీయాల్లో ప్రవేశించి చిన్న చిన్నగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలాబలాలపై పూర్తి పట్టున్న ఆమెను ...బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనుకుంటోంది. -
'డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీ, సంఘ్ పరివార్ '
లక్నో: బీజేపీ, సంఘ్ పరివార్ డబుల్ గేమ్ ఆడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషి విమర్శించారు. హిందూ రాష్ట్ర, లవ్ జిహాద్ పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని ధ్వజమెత్తాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కమలనాథులు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఒకపక్క హిందూ రాష్టం, మరోపక్క ప్రేమ జిహాద్ అంటూ బీజేపీ, సంఘ్ పరివార్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని బహుగుణ అన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. -
యువతి ఫోన్ ట్యాప్ చేయించిన మోడీ: కాంగ్రెస్
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉండే అర్హత నరేంద్ర మోడీకి లేదని కాంగ్రెస్ మహిళా నేతలు అన్నారు. గుజరాత్లో ఓ మహిళా ఆర్కిటెక్ ఫోన్‌ను చట్టవిరుద్ధంగా మోడీ ట్యాప్ చేయించారని వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2009లో అప్పటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా, ఓ ఐపీఎస్ అధికారికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను కోబ్రా పోస్ట్, గులైల్ ఇన్వెస్టిగేటివ్ పోర్టల్‌లు ఈ నెల 15న బయటపెట్టాయి. నరేంద్ర మోడీయే తన అనుచరుడు అమిత్ షాతో ఇదంతా చేయించారని కేంద్ర మంత్రులు జయంతి నటరాజన్, గిరిజా వ్యాస్, యూపీసీసీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా ఆరోపించారు. మహిళా గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించిన మోడీపై సుప్రీంకోర్టు జడ్డితో విచారణ జరిపించాలన్నారు. ఆ యువతి వ్యక్తి స్వేచ్ఛను ఎందుకు హరించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గుజరాత్‌ను పాలించే నైతిక, రాజకీయ అర్హత ఆయన కోల్పోయారని పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థిగా మోడీ అనర్హుడన్నారు.