మెగా పోరు: బరిలో అఖిలేశ్ మరదలు!
లక్నో: ఇప్పుడు అందరి దృష్టి లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గంపైనే నెలకొని ఉంది. ఈ నియోజకవర్గంలో తన మరదలు అపర్ణ యాదవ్‌ను అఖిలేశ్ బరిలోకి దింపితే.. యూపీ ఎన్నికల్లోనే అత్యంత ఆసక్తికరమైన పోరు ఇక్కడ జరిగే అవకాశముంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి కాషాయ కండువా కప్పుకొన్న సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషీని బీజేపీ ఇక్కడ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఆమె ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు అపర్ణ యాదవ్‌ను ఎస్పీ ఇక్కడ బరిలోకి దింపితే రసవత్తరమైన పోరు ఖాయగా కనిపిస్తోంది.
సమాజ్‌వాదీ పార్టీ ఈ స్థానానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. కానీ ఈ టికెట్‌ను అపర్ణకే కేటాయించాలని అఖిలేశ్‌ను ములాయం కోరుతున్నారు. ములాయం రెండో భార్య కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ. దాదాపు ఏడాది కిందటే లక్నో కంటోన్మెంట్ సీటును అపర్ణకు ములాయం కేటాయించారు. ఈ స్థానంలో ఎస్పీ ఎప్పుడూ గెలువలేదు. అయినా, ఇక్కడ బలమైన అభ్యర్థి రీటాను ఎదుర్కొనేందుకు అపర్ణ గతకొంతకాలంగా శ్రమిస్తున్నారు. జోరుగా నియోజకవర్గంలో తిరుగుతూ పట్టు పెంచుకుంటున్నారు.
అయితే, ఇటీవల ఎస్పీలో రాజుకున్న కుటుంబపోరు అపర్ణకు ప్రతికూలంగా మారింది. తండ్రితో తలెత్తిన ఈ కుటుంబపోరులో ఆధిపత్యం సాధించిన అఖిలేశ్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న తెలిసిందే. ఈ పోరులో తన ప్రత్యర్థి అయిన బాబాయ్ శివ్‌పాల్ యాదవ్‌ను కరికరించి.. ఆయనకు ఎస్పీ సీటును కేటాయించిన సంగతి తెలిసిందే. శివ్‌పాల్ వర్గం వ్యక్తిగా ముద్రపడి.. ఎస్పీలో కుటుంబపోరుకు కారణమైనట్టు భావిస్తున్న అపర్ణ యాదవ్‌కు అఖిలేశ్ ఈ సీటు కేటాయిస్తారా లేదా అన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. తండ్రి అభీష్టాన్ని మన్నించి ఇక్కడ అపర్ణకు టికెట్ కేటాయిస్తే.. ఇక్కడ అపర్ణ-రీటా మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.