అధికార కూటమి తుడిచిపెట్టుకుపోయింది!
- పంజాబ్‌లో బీజేపీ-అకాలీకి చుక్కెదురు
- యూపీలో కాంగ్రెస్-ఎస్పీకి అదే పరిస్థితి
- ఎగ్జిట్ పోల్ అంచనాలు
ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో అధికార కూటములకు ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీ దళ్-బీజేపీ కూటమి దారుణంగా ఓడిపోతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార కూటమి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ కాబోతున్నదని ఇండియా టుడే, ఇండియా న్యూస్, ఇండియా టీవీ అంచనా వేశాయి. అటు యూపీలో సమాజ్‌వాదీ-కాంగ్రెస్ కూటమికి కూడా అనుకున్న ఫలితాలు రావని, మరోసారి అధికారంలోకి రావాలన్న అఖిలేశ్ యాదవ్ కల నెరబోరదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి.
403 స్థానాలు ఉన్న యూపీలో మరోసారి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి అఖిలేశ్ యాదవ్ హోరాహోరీగా ప్రచారం సాగించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీతో కలిసి ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ లక్ష్యంగా పోటాపోటీ విమర్శలతో విరుచుకుపడ్డారు. అటు అఖిలేశ్ సతీమని డింపుల్ యాదవ్, కాంగ్రెస్ యువనాయకురాలు ప్రియాంక గాంధీ సైతం ప్రచారంలో మెరిశారు. అయినప్పటికీ అనుకున్న ఫలితాలు అఖిలేశ్ కూటమి దూరంగానే నిలిచిపోతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. దాదాపు అన్ని సర్వేలు యూపీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని, హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. ఇక ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 110-130 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ-వీమ్మార్ అంచనా వేయగా, ఆ కూటమికి 120 స్థానాలు వస్తాయని ఇండియా న్యూస్-యాక్సెస్, 135-147 స్థానాలు వస్తాయని ఇండియా టీవీ-సీవోటర్ సర్వేలు పేర్కొన్నాయి. ఒక్క ఏబీపీ న్యూస్ సర్వే మాత్రమే ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి కొద్దిగా ఎక్కువమొత్తంలో 161 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనాల ప్రకారం చూసుకుంటే మళ్లీ అధికారంలోకి రావాలన్న ఎస్పీ-కాంగ్రెస్ కలలు నెరవేరే అవకాశం అంతగా కనిపించడం లేదు.
ఇక పంజాబ్‌లో అధికార అకాలీ-బీజేపీ కూటమి చిత్తుగా ఓడిపోతుందని దాదాపు అన్ని సర్వేలు ఘంటాపథంగా చెప్పాయి. మాజీ సీఎం అమరిందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటూ అంచనా వేశాయి. తొలిసారి పోటీచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గణనీయమైనరీతిలో సీట్లు సాధించే అవకాశముందని పేర్కొన్నాయి. విశేషమేమిటంటే.. ఇండియా టుడే, ఇండియా న్యూస్, ఇండియా టీవీ సర్వేలు అకాలీ-బీజేపీ కూటమి తుడిచిపెట్టుకుపోతుందని, ఆ కూటమికి పదిలోపు స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి. ఈ కూటమికి ఇండియా టుడే 4-7 స్థానాలు వస్తాయని చెప్పగా, ఇండియా న్యూస్ 7 స్థానాలు, ఇండియా టీవీ 3 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఒక్క చాణక్య మాత్రమే అధికార కూటమికి 45-63 స్థానాలు వస్తాయంటూ ఊరట కలిగించే అంచనాలు వెల్లడించింది.