uttarpradesh polls
-
అక్కడెలా బీజేపీ గెలుస్తుంది?
-
అక్కడెలా బీజేపీ గెలుస్తుంది?
ముమ్మాటికీ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి యూపీ ఫలితాలపై హైకోర్టును ఆశ్రయిస్తాం మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందే బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టీకరణ లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సంచలన విజయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి అనుమానాలను వ్యక్తం చేశారు. ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ బీజేపీ గెలుపొందిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే.. అక్కడెలా బీజేపీ గెలిచిందని ఆమె ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని ఆమె ఆరోపించారు. ఇకనుంచి బ్యాలెట్ పేపర్లనే ఎన్నికల నిర్వహణ కోసం వాడాలని మాయావతి ఎన్నికల సంఘాన్ని కోరారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆమె పేర్కొన్నారు. యూపీలో బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. తాజా యూపీ ఎన్నికల్లో 403 స్థానాలకుగాను బీజేపీ 300కుపైగా స్థానాలు గెలుపొంది.. మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 19 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. -
అధికార కూటమి తుడిచిపెట్టుకుపోయింది!
పంజాబ్‌లో బీజేపీ-అకాలీకి చుక్కెదురు యూపీలో కాంగ్రెస్-ఎస్పీకి అదే పరిస్థితి ఎగ్జిట్ పోల్ అంచనాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో అధికార కూటములకు ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీ దళ్-బీజేపీ కూటమి దారుణంగా ఓడిపోతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార కూటమి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ కాబోతున్నదని ఇండియా టుడే, ఇండియా న్యూస్, ఇండియా టీవీ అంచనా వేశాయి. అటు యూపీలో సమాజ్‌వాదీ-కాంగ్రెస్ కూటమికి కూడా అనుకున్న ఫలితాలు రావని, మరోసారి అధికారంలోకి రావాలన్న అఖిలేశ్ యాదవ్ కల నెరబోరదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. 403 స్థానాలు ఉన్న యూపీలో మరోసారి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి అఖిలేశ్ యాదవ్ హోరాహోరీగా ప్రచారం సాగించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీతో కలిసి ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ లక్ష్యంగా పోటాపోటీ విమర్శలతో విరుచుకుపడ్డారు. అటు అఖిలేశ్ సతీమని డింపుల్ యాదవ్, కాంగ్రెస్ యువనాయకురాలు ప్రియాంక గాంధీ సైతం ప్రచారంలో మెరిశారు. అయినప్పటికీ అనుకున్న ఫలితాలు అఖిలేశ్ కూటమి దూరంగానే నిలిచిపోతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. దాదాపు అన్ని సర్వేలు యూపీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని, హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. ఇక ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 110-130 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ-వీమ్మార్ అంచనా వేయగా, ఆ కూటమికి 120 స్థానాలు వస్తాయని ఇండియా న్యూస్-యాక్సెస్, 135-147 స్థానాలు వస్తాయని ఇండియా టీవీ-సీవోటర్ సర్వేలు పేర్కొన్నాయి. ఒక్క ఏబీపీ న్యూస్ సర్వే మాత్రమే ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి కొద్దిగా ఎక్కువమొత్తంలో 161 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనాల ప్రకారం చూసుకుంటే మళ్లీ అధికారంలోకి రావాలన్న ఎస్పీ-కాంగ్రెస్ కలలు నెరవేరే అవకాశం అంతగా కనిపించడం లేదు. ఇక పంజాబ్‌లో అధికార అకాలీ-బీజేపీ కూటమి చిత్తుగా ఓడిపోతుందని దాదాపు అన్ని సర్వేలు ఘంటాపథంగా చెప్పాయి. మాజీ సీఎం అమరిందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటూ అంచనా వేశాయి. తొలిసారి పోటీచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గణనీయమైనరీతిలో సీట్లు సాధించే అవకాశముందని పేర్కొన్నాయి. విశేషమేమిటంటే.. ఇండియా టుడే, ఇండియా న్యూస్, ఇండియా టీవీ సర్వేలు అకాలీ-బీజేపీ కూటమి తుడిచిపెట్టుకుపోతుందని, ఆ కూటమికి పదిలోపు స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి. ఈ కూటమికి ఇండియా టుడే 4-7 స్థానాలు వస్తాయని చెప్పగా, ఇండియా న్యూస్ 7 స్థానాలు, ఇండియా టీవీ 3 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఒక్క చాణక్య మాత్రమే అధికార కూటమికి 45-63 స్థానాలు వస్తాయంటూ ఊరట కలిగించే అంచనాలు వెల్లడించింది. -
యూపీలో హంగ్.. అయినా ఆధిపత్యం ఆ పార్టీదే!
అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడించాయి. చాలావరకు ఎగ్జిట్ పోల్స్ యూపీలో హంగ్ అసెంబ్లీ తప్పదని తేల్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాబోదని అంచనా వేశాయి. అయితే, అత్యధిక స్థానాలు గెలుపొంది.. అతిపెద్ద పార్టీగా నిలువబోయేది బీజేపీయేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా న్యూస్-ఎమ్మార్సీ సర్వే ఫలితాల ప్రకారం చూసుకుంటే 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీజేపీకి 185 సీట్లు, అధికార సమాజ్‌వాదీ-కాంగ్రెస్ కూటమికి 120 సీట్లు, బీఎస్పీకి 90 సీట్లు వస్తాయని అంచనా వేసింది. యూపీలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 202. ఈ సర్వే ప్రకారం చూసుకుంటే బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినా.. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కింగ్ మేకర్‌గా నిలిచే అవకాశముంది. ఇక టైమ్స్ నౌ-వీఎమ్మార్ సర్వే ప్రకారం చూసుకుంటే బీజేపీకి 190-210 స్థానాలు, ఎస్పీ-కాంగ్రెస్‌కు 110-130 స్థానాలు, బీఎస్పీకి 57-74 స్థానాలు వచ్చే అవకాశముందని అంచనా వేసింది. -
యూపీలో బీజేపీకి సొంత పార్టీలోనే ప్రత్యర్థి!
లక్నో: సరిగ్గా వారం కిందట జనవరి 21న ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన స్టార్ కాంపెనర్ల జాబితాలో గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా ఉంది. తూర్పు యూపీలో ఆయనకు మంచి పట్టుంది. కానీ వారం తిరిగే సరికి బీజేపీ అధినాయకత్వానికి ఆయన నుంచే ఊహించని ప్రత్యర్థి ఎదురైంది. హిందు యువ వాహిని (హెచ్‌వైవీ) శుక్రవారం కుషినగర్, మహారాజ్‌గంజ్ జిల్లాల్లో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీకి పోటీగా అభ్యర్థులను బరిలోకి దింపిన హెచ్‌వైవీ స్వయనా యోగి ఆదిత్యానాథ్ స్థాపించిన సంస్థ కావడం గమనార్హం. 2002లో ఆయన స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు బీజేపీకి సవాల్ విసురుతుండటంపై ఆ పార్టీ అధినాయకత్వం కన్నెర్ర చేస్తున్నది. తమ సంస్థ స్థాపకుడిని బీజేపీ అవమానించిందని, అందుకే తూర్పు యూపీలో ఏకంగా 64 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టబోతున్నామని హెచ్‌వైవీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ సింగ్ స్పష్టం చేశారు. ఒకవైపు ఎన్నికలు దగ్గరపడుతుండగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరకక సతమవతువున్న బీజేపీని.. యోగి ఆదిత్యనాథ్ అనుచరవర్గం అభ్యర్థులను దింపి చికాకు పరుస్తున్నది. మరోవైపు యూపీ బీజేపీ రాష్ట్ర శాఖలో అసమ్మతి సెగలు రేపుతున్నది. పార్టీలో పనిచేసేవారికి టికెట్లు ఇవ్వడం లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే పెద్దపీట వేస్తున్నారంటూ.. అమిత్‌షాకు వ్యతిరేకంగా పలువురు నేతలు నిరసన బాట పడుతున్నారు. -
మెగా పోరు: బరిలో అఖిలేశ్ మరదలు!
లక్నో: ఇప్పుడు అందరి దృష్టి లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గంపైనే నెలకొని ఉంది. ఈ నియోజకవర్గంలో తన మరదలు అపర్ణ యాదవ్‌ను అఖిలేశ్ బరిలోకి దింపితే.. యూపీ ఎన్నికల్లోనే అత్యంత ఆసక్తికరమైన పోరు ఇక్కడ జరిగే అవకాశముంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి కాషాయ కండువా కప్పుకొన్న సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషీని బీజేపీ ఇక్కడ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఆమె ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు అపర్ణ యాదవ్‌ను ఎస్పీ ఇక్కడ బరిలోకి దింపితే రసవత్తరమైన పోరు ఖాయగా కనిపిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ ఈ స్థానానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. కానీ ఈ టికెట్‌ను అపర్ణకే కేటాయించాలని అఖిలేశ్‌ను ములాయం కోరుతున్నారు. ములాయం రెండో భార్య కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ. దాదాపు ఏడాది కిందటే లక్నో కంటోన్మెంట్ సీటును అపర్ణకు ములాయం కేటాయించారు. ఈ స్థానంలో ఎస్పీ ఎప్పుడూ గెలువలేదు. అయినా, ఇక్కడ బలమైన అభ్యర్థి రీటాను ఎదుర్కొనేందుకు అపర్ణ గతకొంతకాలంగా శ్రమిస్తున్నారు. జోరుగా నియోజకవర్గంలో తిరుగుతూ పట్టు పెంచుకుంటున్నారు. అయితే, ఇటీవల ఎస్పీలో రాజుకున్న కుటుంబపోరు అపర్ణకు ప్రతికూలంగా మారింది. తండ్రితో తలెత్తిన ఈ కుటుంబపోరులో ఆధిపత్యం సాధించిన అఖిలేశ్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న తెలిసిందే. ఈ పోరులో తన ప్రత్యర్థి అయిన బాబాయ్ శివ్‌పాల్ యాదవ్‌ను కరికరించి.. ఆయనకు ఎస్పీ సీటును కేటాయించిన సంగతి తెలిసిందే. శివ్‌పాల్ వర్గం వ్యక్తిగా ముద్రపడి.. ఎస్పీలో కుటుంబపోరుకు కారణమైనట్టు భావిస్తున్న అపర్ణ యాదవ్‌కు అఖిలేశ్ ఈ సీటు కేటాయిస్తారా లేదా అన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. తండ్రి అభీష్టాన్ని మన్నించి ఇక్కడ అపర్ణకు టికెట్ కేటాయిస్తే.. ఇక్కడ అపర్ణ-రీటా మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. -
‘జంప్ జిలానీ’లతో కర్మభూమిలో పాగా!
బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజపేయి గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం లక్నో.. వాజపేయి కర్మభూమిగా భావించే ఈ లోక్‌సభ నియోజకవర్గంలో మళ్లీ పాగా వేసేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. లక్నోలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలుపొందింది. ఎస్పీ ఏడు స్థానాలు గెలుపొందగా.. కాంగ్రెస్ కూడా ఒక స్థానాన్ని తన ఖాతాలో వేసుకొంది. ఒకప్పుడు లక్నోలో అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ ఇప్పుడు అదేస్థాయిలో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు లక్నోలోని ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో నలుగురు ఇతర పార్టీల నుంచి జంప్ చేసిన నేతలే ఉండటం గమనార్హం. ఇటీవల బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ మాజీ చీఫ్ రీటా బహుగుణ జోషికి లక్నో (కంటోన్మెంట్) సీటును పార్టీ ఖరారు చేసింది. రిజర్వ్డ్ సీటు మిలహాబాద్ నుంచి మోహన్‌లాల్ గంజ్ ఎంపీ కౌషల్ కిషోర్ భార్యను బరిలోకి దింపింది. లక్నో (నార్త్) స్థానం నుంచి దివంగత డీపీ బోరా తనయుడు డాక్టర్ నీరజ్ బోరాను బరిలోకి దింపుతోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో బోరా బీజేపీలో చేరారు. ఇక లక్నో (సెంట్రల్) స్థానంలో ఎవరూ ఊహించనిరీతిలో బ్రజేష్ పాఠక్‌ను నిలబెట్టింది. బ్రజేష్ బీఎస్పీ నుంచి బీజేపీలో చేరారు. ఇక టికెట్ల కేటాయింపులో పార్టీ ఫిరాయింపుదారులకే పెద్ద పీట వేస్తున్నారని అసమ్మతి వ్యక్తం చేసిన బీజేపీ నేత సురేశ్ శ్రీవాస్తవకు లక్నో (వెస్ట్) స్థానాన్ని కట్టబెట్టింది. గతంలో ఈ స్థానం నుంచి ఆయన పోటీచేసి ఓడిపోయారు. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌నాథ్ కోసం తన స్థానాన్ని త్యాగం చేసిన మాజీ ఎంపీ లాల్జీ టాండన్ బుజ్జగించేందుకు ఎమ్మెల్యే అశుతోష్ టాండన్‌కు లక్నో (ఈస్ట్) టికెట్‌ను మరోసారి కట్టబెట్టింది. -
బరిలోకి హోంమంత్రి తనయుడు!
కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ కొడుకుకు బీజేపీ టికెట్ బీజేపీ రెండో జాబితా విడుదల లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. 155 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్‌కు బీజేపీ సీటు దక్కడం గమనార్హం. నోయిడా నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేయనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఇటీవల కమలదళంలోకి చేరిన రీటా బహుగుణ జోషీకి ఆమె సొంత స్థానమైన లక్నో కంటోన్మెంట్ నుంచి బీజేపీ టికెట్ ఖరారు చేసింది. అలాగే సిద్ధార్థనాథ్ సింగ్‌కు అలహాబాద్ వెస్ట్ సీటును, గరిమా సింగ్‌కు అమేథీ సీటును కేటాయించింది. -
యూపీ ఎన్నికలపై ‘నోట్ల’ ప్రభావం ఉంటుందా?
లక్నో: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఏ పార్టీ నష్టపోతుంది, ఏ పార్టీ లాభపడుతుంది? ప్రధానంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది? అన్న అంశాలపై రాష్ర్టంలో అప్పుడే చర్చ మొదలైంది. పార్టీ టిక్కెట్లను విక్రయించడం ద్వారా మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ కోట్లాది రూపాయలను కూడబెట్టిందని, ఇప్పుడవన్నీ చెల్లవని, చెత్తకుండీలో పడేయడం మినహా ఆమెకు మరో గత్యంతరం లేదని బీజీపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ ఆరోపించారు. దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన మరునాడే మాయావతి డబ్బులిచ్చిన అభ్యర్థులందరిని తన నివాసానికి పిలిచి, ఎవరి డబ్బులు వారు తీసుకెళ్లి కొత్త నోట్లను తీసుకరావాలని ఆదేశించినట్లు సమాజ్ వాది పార్టీ అధికార ప్రతినిధి మొహమ్మద్ షాహిద్ అన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నగదు ప్రవాహం ఎక్కువగా కనిపించదుకనుక ఎన్నికల ప్రచారం ఆర్భాటంగా ఉండదని ఎస్పీ శాశన సభ్యుడు తేజ్ నారాయణ్ పాండే అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం బీఎస్పీ పార్టీపైనే ఎక్కువగా చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందే బీజేపీ నాయకులు సర్దుకొని ఉంటారనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇవన్ని ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలే. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. 1978లో కూడా అప్పటి మురార్జీ దేశాయ్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయాలనే కుట్రతోనే పెద్ద నోట్లను రద్దు చేశారనే ఆరోపణలు వచ్చాయి. నరేంద్రీ మోదీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2015 సంవత్సరంలో బీజేపీకి భారీగా విరాళాలు వచ్చాయి. 437 కోట్ల రూపాయలు వచ్చినట్లు ఆ పార్టీ ప్రకటించింది. 20వేల రూపాయలకు మించిన విరాళాలను తీసుకోలేదన్న కారణంగా బహుజన సమాజ్ పార్టీ, సమాజ్‌వాది పార్టీలు విరాళాల వివరాలను ప్రకటించలేదు. కానీ బీఎస్పీ నూటికి నూరుశాతం విరాళాలను నగదు రూపంలో తీసుకోగా, బీజీపీ 85 శాతం విరాళాలు నగదు రూపంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే హడావిడి మొదలవుతుందని, ఎన్నికల ప్రచార సామాగ్రిని తయారు చేయడంలో ఏడాదికి ముందు నుంచే తలమున్కలై ఉంటామని లక్నోలోని మోహన్ అగర్వాల్ తెలిపారు. ఆయన పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీలకు జెండాలు, క్యాప్‌లు, బ్యానర్లు, బంటీలు సరఫరా చేస్తుంటారు. అయితే ఇప్పుడు పెద్ద నోట్ల రద్దీతో ఎలాంటి హడావిడు లేకుండా పోయిందని, తమ వ్యాపారం 75 శాతం పడేపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార సామాగ్రిని విక్రయించే అనూప్ అగ్రవాల్ అనే మరో వ్యాపారి కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సామాన్యులు ఇక్కట్లు పడుతున్న నేపథ్యంలో ఇది యూపీ ఎన్నికల్లో బీజేపీకి కలిసొస్తుందా, లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం.