‘జంప్ జిలానీ’లతో కర్మభూమిలో పాగా!
బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజపేయి గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం లక్నో.. వాజపేయి కర్మభూమిగా భావించే ఈ లోక్‌సభ నియోజకవర్గంలో మళ్లీ పాగా వేసేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. లక్నోలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలుపొందింది. ఎస్పీ ఏడు స్థానాలు గెలుపొందగా.. కాంగ్రెస్ కూడా ఒక స్థానాన్ని తన ఖాతాలో వేసుకొంది. ఒకప్పుడు లక్నోలో అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ ఇప్పుడు అదేస్థాయిలో సత్తా చాటాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పటివరకు లక్నోలోని ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో నలుగురు ఇతర పార్టీల నుంచి జంప్ చేసిన నేతలే ఉండటం గమనార్హం. ఇటీవల బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ మాజీ చీఫ్ రీటా బహుగుణ జోషికి లక్నో (కంటోన్మెంట్) సీటును పార్టీ ఖరారు చేసింది. రిజర్వ్‌డ్ సీటు మిలహాబాద్ నుంచి మోహన్‌లాల్ గంజ్ ఎంపీ కౌషల్ కిషోర్ భార్యను బరిలోకి దింపింది. లక్నో (నార్త్) స్థానం నుంచి దివంగత డీపీ బోరా తనయుడు డాక్టర్ నీరజ్ బోరాను బరిలోకి దింపుతోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో బోరా బీజేపీలో చేరారు. ఇక లక్నో (సెంట్రల్) స్థానంలో ఎవరూ ఊహించనిరీతిలో బ్రజేష్ పాఠక్‌ను నిలబెట్టింది.
బ్రజేష్ బీఎస్పీ నుంచి బీజేపీలో చేరారు. ఇక టికెట్ల కేటాయింపులో పార్టీ ఫిరాయింపుదారులకే పెద్ద పీట వేస్తున్నారని అసమ్మతి వ్యక్తం చేసిన బీజేపీ నేత సురేశ్ శ్రీవాస్తవకు లక్నో (వెస్ట్) స్థానాన్ని కట్టబెట్టింది. గతంలో ఈ స్థానం నుంచి ఆయన పోటీచేసి ఓడిపోయారు. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌నాథ్ కోసం తన స్థానాన్ని త్యాగం చేసిన మాజీ ఎంపీ లాల్జీ టాండన్ బుజ్జగించేందుకు ఎమ్మెల్యే అశుతోష్ టాండన్‌కు లక్నో (ఈస్ట్) టికెట్‌ను మరోసారి కట్టబెట్టింది.