యూపీలో బీజేపీకి సొంత పార్టీలోనే ప్రత్యర్థి!
లక్నో: సరిగ్గా వారం కిందట జనవరి 21న ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన స్టార్ కాంపెనర్ల జాబితాలో గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా ఉంది. తూర్పు యూపీలో ఆయనకు మంచి పట్టుంది. కానీ వారం తిరిగే సరికి బీజేపీ అధినాయకత్వానికి ఆయన నుంచే ఊహించని ప్రత్యర్థి ఎదురైంది. హిందు యువ వాహిని (హెచ్‌వైవీ) శుక్రవారం కుషినగర్, మహారాజ్‌గంజ్ జిల్లాల్లో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీకి పోటీగా అభ్యర్థులను బరిలోకి దింపిన హెచ్‌వైవీ స్వయనా యోగి ఆదిత్యానాథ్ స్థాపించిన సంస్థ కావడం గమనార్హం. 2002లో ఆయన స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు బీజేపీకి సవాల్ విసురుతుండటంపై ఆ పార్టీ అధినాయకత్వం కన్నెర్ర చేస్తున్నది.
తమ సంస్థ స్థాపకుడిని బీజేపీ అవమానించిందని, అందుకే తూర్పు యూపీలో ఏకంగా 64 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టబోతున్నామని హెచ్‌వైవీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ సింగ్ స్పష్టం చేశారు. ఒకవైపు ఎన్నికలు దగ్గరపడుతుండగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరకక సతమవతువున్న బీజేపీని.. యోగి ఆదిత్యనాథ్ అనుచరవర్గం అభ్యర్థులను దింపి చికాకు పరుస్తున్నది. మరోవైపు యూపీ బీజేపీ రాష్ట్ర శాఖలో అసమ్మతి సెగలు రేపుతున్నది. పార్టీలో పనిచేసేవారికి టికెట్లు ఇవ్వడం లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే పెద్దపీట వేస్తున్నారంటూ.. అమిత్‌షాకు వ్యతిరేకంగా పలువురు నేతలు నిరసన బాట పడుతున్నారు.