సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ‘వ్యూహాత్మక బలమైన కూటమి’ ఏర్పాటు తథ్యమని స్పష్టమైంది. ఇందులో భాగంగానే తెరవెనుక సంప్రదింపుల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. యూపీ, బిహార్‌లలో ఈ సంప్రదింపులు తుదిదశలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే.. ప్రధాని అభ్యర్థిపై ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని కూడా పార్టీ భావిస్తున్నట్లు వెల్లడించాయి. ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం ద్వారా కూటమిలో విభేదాలు పొడసూపే అవకాశముందన్న పార్టీ సీనియర్ల హెచ్చరికలతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పలుచోట్ల ఇబ్బందులున్నా స్వల్పకాలిక లక్ష్యాల కోసం దోస్తీ తప్పడంలేదు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్‌తో దోస్తీ విషయంలో పీసీసీలను కలుపుకుని వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ మదిలో ఏముంది?
‘బీజేపీని ఓడించటమే కాంగ్రెస్ సహా విపక్షాల ముందున్న ఏకైక లక్ష్యం. ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తాం’ అని రాహుల్ సన్నిహిత నేత ఒకరు తెలిపారు. ‘మోదీ ప్రధాని కావాలంటే బీజేపీ సొంతగా 230–240 సీట్లు సంపాదించుకోవాలి. ఇంతకన్నా తక్కువ వస్తే.. ఎన్డీయే పక్షాల సాయంతో బీజేపీ అధికారంలోకి వచ్చినా మోదీ స్థానంలో వేరొకరు ప్రధాని అవుతారు. బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో ఈసారి విపక్ష కూటమి ఎక్కువ స్థానాలు గెలవడం ద్వారా మోదీ జోరును అడ్డుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రభుత్వం ఇంతవరకు సమాధానం ఇవ్వని రైతుల సమస్యలు, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, పేదరికం, ఆర్థిక వ్యవస్థ, అవినీతి కేసులు, రాఫెల్ ఒప్పందం తదితరాంశాలే ప్రధాన అస్త్రాలుగా బీజేపీని అడ్డుకుంటామన్నారు.
సిద్ధాంతాల మధ్యే పోటీ
బీజేపీతోపాటు ఆరెస్సెస్ భావజాలంపై ఐకమత్యంగా పోరాడేందుకు పలు విపక్షాల మధ్య విస్తృత ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. యూపీ, బిహార్‌లతోపాటు మహారాష్ట్రలను కీలకమైన రాష్ట్రాలుగా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. మహారాష్ట్రలో ఎన్సీపీతో మంచి దోస్తీ ఉంది. దీనికితోడు ఇటీవల శివసేన కూడా రాహుల్‌ను సమర్థిస్తూవస్తోంది. అయితే సిద్ధాంతపరమైన విభేదాల కారణంగానే శివసేన కు దూరంగా ఉండాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణలో ఇక్కడ ఒంటరిగానే వెళ్లాలని భావిస్తోంది.
పీసీసీలకూ అవకాశం
అయితే పొత్తుల విషయంలో పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకే పూర్తి అధికారాలు కట్టబెట్టినప్పటికీ.. ఆయా రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనుకుంటోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో తమదే అధికారమని ఘంటాపథంగా చెబుతున్న కాంగ్రెస్.. సీఎం అభ్యర్థులను ప్రకటించకూడదని నిర్ణయించింది. ‘యూపీ, బిహార్, మహారాష్ట్రల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీని అడ్డుకోగలిగితే.. నరేంద్ర మోదీ పీఠాన్ని కదిలించినట్లే. 80 మంది ఎంపీలున్న యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో వ్యూహాత్మక అంగీకారం చాలా అవసరం’ అని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు తెలిపారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, హరియాణా సహా పలు ప్రాంతాల్లోనూ పార్టీ బలోపేతమైందన్నారు.
విపక్ష కూటమి తథ్యం!
Published Sat, Aug 4 2018 4:16 AM | Last Updated on Fri, Mar 29 2019 9:14 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment