
యూపీ ఎన్నికలపై ‘నోట్ల’ ప్రభావం ఉంటుందా?
లక్నో: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఏ పార్టీ నష్టపోతుంది, ఏ పార్టీ లాభపడుతుంది? ప్రధానంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది? అన్న అంశాలపై రాష్ర్టంలో అప్పుడే చర్చ మొదలైంది.
పార్టీ టిక్కెట్లను విక్రయించడం ద్వారా మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ కోట్లాది రూపాయలను కూడబెట్టిందని, ఇప్పుడవన్నీ చెల్లవని, చెత్తకుండీలో పడేయడం మినహా ఆమెకు మరో గత్యంతరం లేదని బీజీపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ ఆరోపించారు. దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన మరునాడే మాయావతి డబ్బులిచ్చిన అభ్యర్థులందరిని తన నివాసానికి పిలిచి, ఎవరి డబ్బులు వారు తీసుకెళ్లి కొత్త నోట్లను తీసుకరావాలని ఆదేశించినట్లు సమాజ్ వాది పార్టీ అధికార ప్రతినిధి మొహమ్మద్ షాహిద్ అన్నారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నగదు ప్రవాహం ఎక్కువగా కనిపించదుకనుక ఎన్నికల ప్రచారం ఆర్భాటంగా ఉండదని ఎస్పీ శాశన సభ్యుడు తేజ్ నారాయణ్ పాండే అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం బీఎస్పీ పార్టీపైనే ఎక్కువగా చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందే బీజేపీ నాయకులు సర్దుకొని ఉంటారనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇవన్ని ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలే. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. 1978లో కూడా అప్పటి మురార్జీ దేశాయ్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయాలనే కుట్రతోనే పెద్ద నోట్లను రద్దు చేశారనే ఆరోపణలు వచ్చాయి.
నరేంద్రీ మోదీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2015 సంవత్సరంలో బీజేపీకి భారీగా విరాళాలు వచ్చాయి. 437 కోట్ల రూపాయలు వచ్చినట్లు ఆ పార్టీ ప్రకటించింది. 20వేల రూపాయలకు మించిన విరాళాలను తీసుకోలేదన్న కారణంగా బహుజన సమాజ్ పార్టీ, సమాజ్‌వాది పార్టీలు విరాళాల వివరాలను ప్రకటించలేదు. కానీ బీఎస్పీ నూటికి నూరుశాతం విరాళాలను నగదు రూపంలో తీసుకోగా, బీజీపీ 85 శాతం విరాళాలు నగదు రూపంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే హడావిడి మొదలవుతుందని, ఎన్నికల ప్రచార సామాగ్రిని తయారు చేయడంలో ఏడాదికి ముందు నుంచే తలమున్కలై ఉంటామని లక్నోలోని మోహన్ అగర్వాల్ తెలిపారు. ఆయన పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీలకు జెండాలు, క్యాప్‌లు, బ్యానర్లు, బంటీలు సరఫరా చేస్తుంటారు. అయితే ఇప్పుడు పెద్ద నోట్ల రద్దీతో ఎలాంటి హడావిడు లేకుండా పోయిందని, తమ వ్యాపారం 75 శాతం పడేపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార సామాగ్రిని విక్రయించే అనూప్ అగ్రవాల్ అనే మరో వ్యాపారి కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సామాన్యులు ఇక్కట్లు పడుతున్న నేపథ్యంలో ఇది యూపీ ఎన్నికల్లో బీజేపీకి కలిసొస్తుందా, లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం.