అక్కడెలా బీజేపీ గెలుస్తుంది?
- ముమ్మాటికీ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి
- యూపీ ఫలితాలపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందే
- బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టీకరణ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సంచలన విజయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి అనుమానాలను వ్యక్తం చేశారు. ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ బీజేపీ గెలుపొందిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే.. అక్కడెలా బీజేపీ గెలిచిందని ఆమె ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని ఆమె ఆరోపించారు. ఇకనుంచి బ్యాలెట్ పేపర్లనే ఎన్నికల నిర్వహణ కోసం వాడాలని మాయావతి ఎన్నికల సంఘాన్ని కోరారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆమె పేర్కొన్నారు. యూపీలో బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. తాజా యూపీ ఎన్నికల్లో 403 స్థానాలకుగాను బీజేపీ 300కుపైగా స్థానాలు గెలుపొంది.. మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 19 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది.